Share News

కాంగ్రెస్‌ వచ్చాకే కరెంట్‌ లేక పంటలు ఎండుతున్నాయి

ABN , Publish Date - Apr 21 , 2024 | 11:48 PM

కేసీఆర్‌ హయాంలో రైతులకు ఎలాంటి కష్లాల్లేవ్‌

కాంగ్రెస్‌ వచ్చాకే కరెంట్‌ లేక పంటలు ఎండుతున్నాయి
చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

చిన్నకోడూరు, ఏప్రిల్‌ 21 : కేసీఆర్‌ హయాంలో రైతులకు ఎలాంటి కష్టాలు లేవని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులతో మాట్లాడారు. 15 రోజులుగా కేంద్రంలోనే ధాన్యం ఉంచినా ప్రభుత్వం కొనడం లేదని.. అకాల వర్షానికి కొంత మేర ధాన్యం తడిసిందని హరీశ్‌రావుకు తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద మోటార్లు కాలుతున్నాయా అని హరీశ్‌ అడగగా ఓ రైతు తనవి రెండు మోటార్లు కాలిపోయానని చెప్పాడు. హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులు అధైర్యపడొద్దని, అధికారులతో మాట్లాడుతానని, వెంటనే వడ్ల కొనుగోలు ప్రారంభించేలా చూస్తానన్నారు. తొందరపడి తక్కువ ధరకు అమ్మొద్దని, రూ.2,200 మద్దతు ధర ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలో ఇలాంటి కష్టాలు లేవని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మోటార్లు కాలిపోతున్నాయని, రైతుబంధు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గంగాపూర్‌ గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మపెద్దిరాజుల కల్యాణ మహోత్సవ వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ పాపయ్య, పీఏసీఏస్‌ చైర్మన్‌ కనకరాజు, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌లు ఉమే్‌షచంద్ర, లింగం, లింగారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు, ముదిరాజ్‌ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2024 | 11:48 PM