Share News

ఇంటర్‌లో బ్యాక్‌ బెంచ్‌..!

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:00 AM

ఇంటర్‌ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఈసారి వెనుకంజలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 48.01శాతం, ద్వితీయ సంవత్సరంలో 60.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణతశాతం గణనీయంగా పడిపోయింది.

ఇంటర్‌లో బ్యాక్‌ బెంచ్‌..!

పడిపోయిన ఉత్తీర్ణత

ఉసూరుమనిపించిన జిల్లా విదార్థులు

ప్రథమ సంవత్సరంలో 48.01 శాతం,

ద్వితీయ సంవత్సరంలో 60.77 శాతం

ఫలితాల్లో బాలికలదే హవా

రాష్ట్రస్థాయిలో సిద్దిపేట 28వ స్థానం

క్రమంగా పడిపోతున్న గ్రాఫ్‌

కొరవడిన అధికారుల పర్యవేక్షణ!

ఉనికి కోల్పోతున్న ప్రభుత్వ కళాశాలలు

సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 24 : ఇంటర్‌ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఈసారి వెనుకంజలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 48.01శాతం, ద్వితీయ సంవత్సరంలో 60.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణతశాతం గణనీయంగా పడిపోయింది.

ఇంటర్‌ జనరల్‌లో..

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 7,541 మంది పరీక్షలు రాయగా 3,678మంది ఉత్తీర్ణత (48.77శాతం) సాధించారు. వీరిలో 3,251 మంది బాలురు పరీక్ష రాయగా 1181 మంది ఉత్తీర్ణత (36.33శాతం) సాధించారు. 4,290 మంది బాలికలు పరీక్ష రాయగా 2,497మంది (58.21శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండ్‌ ఇయర్‌లో 7,361 మంది పరీక్ష రాయగా 4,496 మంది ఉత్తీర్ణత (61.08శాతం) సాధించారు. వీరిలో 3,172 మంది బాలురు పరీక్ష రాయగా 1,580 మంది ఉత్తీర్ణత (49.81శాతం) సాధించారు. 4,189 మంది బాలికలు పరీక్ష రాయగా 2,916 మంది ఉత్తీర్ణత(69.61శాతం) సాధించారు.

ఒకేషనల్‌లో..

ఇంటర్‌ ఒకేషనల్‌ ఫస్టియర్‌లో 2,677మంది పరీక్ష రాయగా 1,135 మంది ఉత్తీర్ణత (42.40శాతం) సాధించారు. వీరిలో 1,563 మంది బాలురు పరీక్ష రాయగా 428 మంది ఉత్తీర్ణత(27.38శాతం) సాధించారు. 1114 మంది బాలికలు పరీక్ష రాయగా 707 మంది ఉత్తీర్ణత(63.46శాతం) సాధించారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో 2,461 మంది పరీక్ష రాయగా 1,329 మంది ఉత్తీర్ణత (54 శాతం) సాధించారు. వీరిలో 1,283 బాలురు పరీక్ష రాయగా 478 మంది ఉత్తీర్ణత(37.26శాతం) సాధించారు. 1178 బాలికలు పరీక్ష రాయగా 851 మంది ఉత్తీర్ణత(72.14శాతం) సాధించారు.

బాలికలదే పైచేయి

ఇంటర్‌ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ఇయర్‌ ఫలితాల్లో బాలురు 36.33శాతం, బాలికలు 58.21శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్‌ ఇయర్‌లో బాలురు 49.81 శాతం, బాలికలు 69.61శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ ఇంటర్‌ ఫస్టియర్‌లో బాలురు 27.38శాతం, బాలికలు 63.46 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్‌ ఇయర్‌లో బాలురు 37.26 శాతం, బాలికలు 72.14 శాతం ఉత్తీర్ణత సాధించారు.

28వ స్థానానికి..

జిల్లాలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2021-22 ఇంటర్‌ ఫలితాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో 63శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 8వ స్థానం, సెకండ్‌ ఇయర్‌లో 68శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 6వ స్థానం దక్కించుకున్నది. 2022-23 ఫలితాల్లో ఫస్ట్‌ ఇయర్‌లో 52 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానం, సెకండ్‌ ఇయర్‌లో 65శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 11వ స్థానం దక్కించుకున్నది. ఈసారి ఫలితాల్లో ఫస్ట్‌ఇయర్‌లో 48.77 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 29వ స్థానం, సెకండ్‌ ఇయర్‌లో 61.08 శాతం ఉత్తీర్ణతతో 28వ స్థానానికి పడిపోయింది. రెండేళ్ల ఫలితాలతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గింది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విధమైన ఫలితాలు వచ్చాయని తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏ ఒక్క అధికారి కూడా ప్రభుత్వ కళాశాలలను, విద్యార్థుల చదువును పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గతంలో హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఈసారి ఎవరూ శ్రద్ధ చూపకపోవడంతో ఉత్తీర్ణత శాతం పడిపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ కళాశాలల్లో అంతంత మాత్రమే..

జిల్లాలో ఉన్న 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏ ఒక్క కళాశాలలో కూడా 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో కోహెడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 61.74 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో మొదటిస్థానంలో నిలిచింది. తొగుట జూనియర్‌ కాలేజ్‌ 60.19 ఉత్తీర్ణతతో రెండో స్థానం, నంగునూరు కళాశాల 58.82 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచింది. సెకండ్‌ ఇయర్‌లో నంగునూరు కళాశాల 88.57 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో మొదటిస్థానం, కోహెడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 82.76 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానం, హుస్నాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల 81.93 శాతం ఉత్తీర్ణత మూడో స్థానంలో నిలిచాయి. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ బైపీసీలో ఎండీ. బిలాలుద్దీన్‌ 957 మార్కులు, ఎంపీసీలో విజయ రాఘవ 911మార్కులు సాధించారు.

ఫలితాల్లో సత్తాచాటిన ప్రైవేట్‌ కళాశాలలు

ఇంటర్‌ ఫలితాల్లో ప్రైవేట్‌ కళాశాల విద్యార్థులు హవా కొనసాగించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాస్టర్‌ మైండ్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీలో ఎస్‌.కావ్య 470 మార్కులకు 468 మార్కులు సాధించింది. బైపీసీలో రాజేష్‌ 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించాడు. ఇదే కళాశాలలో సెకండ్‌ ఇయర్‌లో ఎంపీసీలో ఆయేషా సిద్ధిక్యు 988 మార్కులు, సందర్శిని 988 మార్కులు, బైపీసీలో గౌతమి 971 మార్కులు సాధించారు. గురు కృప కళాశాలలో ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీలో ఐదుగురు విద్యార్థులు 466మార్కులు, సెకండ్‌ ఇయర్‌ ఎంపీసీలో దివిత 988 మార్కులు, బైపీసీలో సుమయ్య ఫాతిమా 981 మార్కులు సాధించారు.

Updated Date - Apr 25 , 2024 | 12:00 AM