Share News

మంజీరాను తవ్వేస్తున్నారు!

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:42 PM

కొల్చారం, ఏప్రిల్‌ 22: రోజురోజుకూ ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా అడ్డగోలుగా వాగులు, వంకలు తవ్వేస్తున్నారు. అడ్డు వచ్చిన వారిపై దాడులకు సైతం వెనుకంజ వేయడం లేదు.

మంజీరాను తవ్వేస్తున్నారు!
ఇసుకను తవ్వేయడంతో మంజీరా నదిలో తేలిన బండరాళ్లు

హల్దీవాగు నుంచీ ఇసుక అక్రమ రవాణా

అడుగంటుతున్న భూగర్భ జలాలు

పట్టించుకోని రెవెన్యూ, పోలీస్‌ అధికారులు

కొల్చారం, ఏప్రిల్‌ 22: రోజురోజుకూ ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా అడ్డగోలుగా వాగులు, వంకలు తవ్వేస్తున్నారు. అడ్డు వచ్చిన వారిపై దాడులకు సైతం వెనుకంజ వేయడం లేదు. మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలోని మంజీరా తీర గ్రామాలైన తుక్కాపూర్‌, పైతర, ఏటిగడ్డమాందాపూర్‌, కోనాపూర్‌, హల్దీవాగు తీర గ్రామాలైన కొంగోడు, నాయిన్‌ జలాల్‌పూర్‌ గ్రామాల నుంచి అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తుక్కాపూర్‌, పైతర గ్రామ శివారులో మూడు మీటర్ల లోతులో నుంచి కొంతమంది అక్రమార్కులు ఇసుకను తవ్వేస్తుండడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని తుక్కాపూర్‌ గ్రామ రైతులు ఇటీవల తహసీల్దార్‌కు వినతిపత్రం సైతం అందజేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొంగోడు, నాయిన్‌ జలాల్‌పూర్‌ శివారులోని హల్దీవాగు నుంచి ఇసుకను కొల్చారం, కౌడిపల్లి, వెల్మకన్నె, లింగంపల్లి గ్రామాల్లో ట్రాక్టర్‌ ఒక్కంటికి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డొచ్చిన పోలీసులపై సైతం దాడులకు ఇసుక మాఫియా వెనుకడుగు వేయడం లేదు. ఈయేడు హల్దీవాగులో ఇసుక తవ్వకాలతో బండరాళ్లు తేలాయి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రైతులు సాగుచేసిన వరి పొట్ట దశకు చేరుకునే సమయంలో ఎండిపోయింది. నాయిన్‌ జలాల్‌పూర్‌ గ్రామంలో ఇసుక మాఫియాను పట్టుకునేందుకు మెదక్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ తిరుమలేశ్‌ తన సిబ్బందితో రాగా.. ఇసుక మాఫియా దాడులు చేసే ప్రయత్నం చేశాయి. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ముందట బైక్‌.. వెనుక ఇసుక ట్రాక్టర్‌

ఇసుక మాఫియా ఒక్కోసారి.. ఒక్కో పద్ధతిని పాటిస్తూ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తుక్కాపూర్‌, నాయిన్‌ జలాల్‌పూర్‌ గ్రామాల్లోని వాగులో ఇసుక లోడ్‌ చేసుకునే వరకు మోటార్‌ సైకిళ్లపై ఇసుక రవాణా జరిగే రోడ్డు వెంట రెక్కీ నిర్వహిస్తారు. ఇసుక ట్రాక్టర్‌ బయలుదేరగానే ఒక మోటార్‌ సైకిల్‌కు.. ఇంకో మోటార్‌ సైకిల్‌కు అర కిలోమీటర్‌ దూరం ఉంటూ పోలీసులు వస్తున్నట్లు అనుమానం రాగానే ఫోన్‌ ద్వారా ఇసుక ట్రాక్టర్‌ను రోడ్డు పక్కన పొదల చాటుకు దారి మళ్లిస్తారు. లేకుంటే రోడ్డు పక్కనే అన్‌లోడ్‌ చేసి ఖాళీ ట్రాక్టర్‌తో ఉంటారు.

ఇసుక అక్రమ రవాణా మా దృష్టికి రాలేదు

మంజీరా నది, హల్దీవాగు నుంచి రాత్రిపూట ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదన్న విషయం మా దృష్టికి రాలేదు. ఒకవేళ ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం.

- మహ్మద్‌ గఫర్‌ మియా, తహసీల్దార్‌, కొల్చారం

Updated Date - Apr 22 , 2024 | 11:42 PM