Share News

కొంటామన్నా అమ్మరేం!

ABN , Publish Date - Apr 23 , 2024 | 11:43 PM

కోనుగోలు కేంద్రాలు తెరిచి మూడు వారాలు గడుస్తున్నా ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతున్నది.

కొంటామన్నా అమ్మరేం!

వడ్ల కోసం ఎదురుచూపులు

సంగారెడ్డి జిల్లాలో 211 కొనుగోలు కేంద్రాలు

1,88,690 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా

15 కేంద్రాల్లోనే కొనుగోళ్లు షురూ

ఇప్పటి వరకు సేకరించింది 3వేల మెట్రిక్‌ టన్నులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 23 : కోనుగోలు కేంద్రాలు తెరిచి మూడు వారాలు గడుస్తున్నా ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతున్నది. కేంద్రాలకు వడ్లు రాకపోవడంతో సిబ్బంది ఎదురుచూస్తున్నారు. అయితే, వరికోతలు మొదలుకాకముందే కేంద్రాలు తెరవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తున్నది.

15 కేంద్రాల్లోనే కొనుగోళ్లు

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 211 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా మొత్తం మీద 1,88,690 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఏప్రిల్‌లో 17వేల మెట్రిక్‌ టన్నులు, మే నెలలో 1,46,690 మెట్రిక్‌ టన్నులు, జూన్‌లో 25 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలున్నాయని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఈమేరకు జిల్లావ్యాప్తంగా 211 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు వారాలు గడిచినా రైతులు మాత్రం కేంద్రాలకు వడ్లను తీసుకురావడం లేదు. నారాయణఖేడ్‌, కల్హేర్‌, హత్నూర మండలాల్లోని కొనుగోలు కేంద్రాలకు కేవలం 3 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కేంద్రాలకు వచ్చింది. ఇందులో సుమారు రూ.30.80 కోట్ల విలువైన 1724.7 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని తూకంవేసి కొనుగోలు చేశారు. ఇందులో 535.2 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించారు. ఈ ధాన్యం విలువ రూ.1.80 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

రైతులకు చెల్లించింది రూ.57 లక్షలు

కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులకు ప్రభుత్వం జరిపే చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతున్నది. రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసిన తరువాత 72 గంటల్లో చెల్లింపులు జరుపుతామని ప్రభుత్వం పేర్కొంటున్నది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన అనంతరం వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేయడం, ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి నివేదించడం తదితర ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడంలో రెండుమూడు రోజులు అదనంగా సమయం పడుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 15 కొనుగోలు కేంద్రాల్లో 266 మంది రైతులు ధాన్యం విక్రయించగా.. 31 మంది రైతులకు రూ.57 లక్షల చెల్లింపులు జరిగాయి. మిగిలిన రైతులకు ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. ట్యాబ్‌లలో వివరాలు నమోదుచేసి ప్రభుత్వానికి నివేదించడానికి సిబ్బంది కొరత, సర్వర్‌ సమస్యలు ఎదురవుతుండడంతో జాప్యం జరుగుతున్నదని అధికారవర్గాలు తెలిపాయి. జిల్లాలో వరికోతలు జోరందుకుంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కొనుగోళ్లు వేగం పుంజుకుంటాయని అధికారులు అంచనావేస్తున్నారు.

Updated Date - Apr 23 , 2024 | 11:43 PM