Share News

నట్టడివిలో నిలువుదోపిడీ!

ABN , Publish Date - Apr 21 , 2024 | 11:46 PM

రేకులకుంట మల్లన్న భక్తులను దోచుకుంటున్న పూజారులు

నట్టడివిలో నిలువుదోపిడీ!

మొక్కు చెల్లింపు పూజలకు రూ. వేలు వసూలు

హుండీలో డబ్బు వేయకుండా అడ్డగింత

ఇదేమీ అని అడిగితే.. భక్తులపైనే ఆగ్రహం

దుబ్బాక, ఏప్రిల్‌ 21 : నట్టడివిలో వెలిసిన మల్లన్న ఆలయంలో భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. మొక్కులు తీర్చకుంటే ఏ కీడు శంకిస్తుందోననే సందేహం.. దేవుడి వద్దకు వచ్చి పూజారులతో గొడవ పడొద్దనే సంయమనం భక్తుల పాలిట శాపంగా మారింది. దేవాదాయశాఖ పరిధిలోని దుబ్బాక రేకులకుంట మల్లికార్జున, రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయంలో కొందరు ఒగ్గుపూజారుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని భక్తులు వాపోతున్నారు.

మొక్కుల చెల్లింపునకు రూ.250

దుబ్బాక అటవీ ప్రాంతంలోని రేకులకుంట మల్లికార్జున ఆలయానికి రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో నుంచే కాకుండా షోలాపూర్‌, బీవండి, నాందేడ్‌, బీదర్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఏడాది పొడువునా ప్రతీ ఆదివారం, మంగళవారం ఆలయానికి భక్తుల రద్దీ ఉంటుంది. భక్తులు పట్నాలు, మత్తకొలపడం, బోనాలు తీయడం, సుంకు బియ్యం సమర్పించడం వంటి మొక్కులు తీర్చుకుంటారు. దీనికి దేవాదాయశాఖ రూ.250 టికెట్‌ ధరను నిర్ణయించింది. అయితే ఆలయంలో అర్చకత్వం కింద 63 మంది పూజారులను నియమించారు. ఇక్కడి ఆచారం ప్రకారం పట్నాలను ఈ ఒగ్గుపూజారులు వేయడం ఆనవాయితీ. ఇందుకు దేవాదాయ శాఖ వారికి గౌరవ వేతనం అందిస్తుంది. తొలిరోజుల్లో భక్తులు ఒగ్గుపూజారులకు డబ్బు ఇస్తే అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. అదే ప్రమాదంగా మారి, భక్తులకు శాపమైంది.

అడిగినంత ఇస్తేనే..

చాలా దూరం నుంచి భక్తులు ఇక్కడికి బంధు, మిత్రగణంతో వచ్చి, బసచేసి, రాత్రే పూజా కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. వారి వెంట తెచ్చుకున్న మేకను మత్తగొలిపి, కుటుంబసభ్యులు, బంధువులతో విందు భోజనాలను చేస్తారు. అందుకే, తెల్లారితే బంధువులు, మిత్రులు వస్తారని, భక్తులు పూజాది కార్యక్రమాలను రాత్రి వేళ సకాలంలో పూర్తి చేసుకోవాలని చూస్తారు. ఇదే అదునుగా కొందరు పూజారులు తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే పూజలను చేసేందుకు నిరాకరిస్తున్నారు. భక్తులతో కటువుగా వ్యవహరిస్తూ డబ్బివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వని భక్తులను మొక్కులు చెల్లించకుండా ఆలయం నుంచి వెళ్లగొట్టేంత పని చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సీసీ కెమెరాల తొలగింపు

ఆలయం పలుసార్లు వివాదాస్పదంగా మారడం, అక్రమాలకు తావివ్వకుండా ఉంటుందని భావించిన దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. అయితే, ఆయన మరణానంతరం సీసీ కెమెరాలను తొలగించారు. అదే సమయంలో కార్యనిర్వహణాధికారి ఆలయ గోడలపై దేవాదాయ శాఖ అధికారుల సెల్‌ నంబర్‌తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ఐడీ నంబర్‌ ఉన్న ఒగ్గుపూజారుల వద్దే పట్నాలు వేయించుకోవాలని, ఎవరైనా అదనంగా డబ్బు వసూళ్లకు పాల్పడితే సూచించిన నంబర్లకు ఫిర్యాదు చేయాలని ఫ్లెక్సీలను ఉంచారు. అయినా, ఇక్కడ అదనపు వసూళ్ల తీరేమీ మారలేదు.

హుండీలో డబ్బు వేయనివ్వరు

ఆలయానికి ఏటా రూ.44 లక్షల వరకు ఆదాయం వస్తుంది. భక్తులు మొక్కు తీర్చడానికి హుండీలో డబ్బుతోపాటు బంగారం, వెండిని కూడా సమర్పిస్తారు. ఇప్పటివరకు 15 కిలోల వెండి, 500 గ్రాముల వరకు బంగారం వచ్చినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలిసింది. అయితే, ఒగ్గుపూజారులు మాత్రం హుండీలో డబ్బులు వేయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ఆలయ ఆదాయం పక్కదారి పడుతుందనే ఆరోపణలున్నాయి.

తీరుమారలే..

భక్తులతో గొడవకు దిగుతున్న ఒగ్గుపూజారుల మధ్యే సమన్వయం లోపించి గొడవలకు కారణమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల ఆలయంలో పూజారుల నియామకం విషయంలో చెలరేగిన గొడవలు అక్రమార్జనే మూలమని భక్తులు బహిరంగంగానే అంటున్నారు. గొడవ అనంతరం గుర్తింపుకార్డు ఉన్న పూజారులే పట్నాలు వేయించాలని దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు హెచ్చరించినా మారలేదు. భక్తులపై ఎగబడడం, ఆపై అందినకాడికి డబ్బు డిమాండ్‌ చేయడం జరుగుతూనే ఉంది. ఆలయానికి రెగ్యులర్‌ కార్యనిర్వహణాధికారి లేకపోవడంతోనే ఈ మితిమీరిన ఆగడాలు పెరిగిపోయాయని భక్తులు వాపోతున్నారు. ఒగ్గుపూజారుల పెత్తనాన్ని నిలువరించి ప్రశాంతంగా భక్తులు చెల్లించుకునేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Apr 21 , 2024 | 11:49 PM