Share News

Liquor Scam: కవిత కస్టడీ పొడిగింపు..

ABN , Publish Date - May 08 , 2024 | 03:56 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది.

Liquor Scam: కవిత కస్టడీ పొడిగింపు..

ఈడీ కేసులో ఈ నెల 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు.. ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు

న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలంటూ ఆమె చేసిన వినతిని న్యాయస్థానం అంగీకరించింది. జ్యుడిషియల్‌ కస్టడీ ముగియడంతో మంగళవారం మధ్యాహ్నం 2.20 నిమిషాలకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఆమెను తీసుకువచ్చారు. తొలుత ఈడీ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌ కే మట్ట వాదనలు వినిపిస్తూ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కవిత కస్టడీని పొడిగించాలని కోరారు.


వారం రోజుల్లో ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేస్తామని చెప్పారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన ప్రత్యేక జడ్జి కావేరి భవేజా ఈడీ కేసులో కవిత కస్టడీని ఈ నెల 14 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. సీబీఐ కేసులో మధ్యాహ్నం మరోసారి కవితను కోర్టు ముందు హాజరు పరిచారు. సీబీఐ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పంకజ్‌ గుప్తా వాదనలు వినిపించారు.మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా ఈ నెల 20 వరకు పొడిగించారు. కాగా, కవిత తరఫున న్యాయవాదులు నితేశ్‌ రాణా, మోహిత్‌ రావు కోర్టుకు మూడు విజ్ఞప్తులు చేశారు. కవితను కలిసేందుకు నుంచి కుటుంబసభ్యులు వచ్చారని, వారు మాట్లాడేందుకు 15 నిమిషాల సమయం ఇవ్వాలని కోరారు. జైలులో ఆమెకు మరో 10 పుస్తకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త తెచ్చిన ఆహారం తినేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.


జైలులో కవితకు హోం ఫుడ్‌ అందించేందుకు మార్చి 26 ఆదేశాల్లో కోర్టు అనుమతించిందని, అయితే దాన్ని 10 నుంచి 15 మంది జైలు సిబ్బంది చెక్‌ చేస్తుండడంతో కలుషితం అవుతోందని తెలిపారు. అందువల్ల హోం ఫుడ్‌ ఇవ్వడం ఆపేశామని చెప్పారు. అలా కాకుండా జైలు డాక్టర్‌ చెక్‌ చేసి ఆమెకు ఆహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దానికోసం మరో పిటిషన్‌ దాఖలు చేయాలని జడ్జి సూచించారు. కోర్టు లాక్‌పలో కవితను కుటుంబసభ్యులు కలిసేందుకు అనుమతి ఇవ్వడంతో ముగ్గురు కుటుంబ సభ్యులు 15 నిమిషాల పాటు మాట్లాడారు. జైలులో మరో 10 పుస్తకాలు చదివేందుకు కూడా అంగీకారం తెలిపారు.


కోర్టు ప్రాంగణంలో నినాదాలు

కవిత కోర్టు ప్రాంగణంలోకి వచ్చేముందు జై తెలంగాణ, జై భారత్‌ అంటూ నినాదాలు చేశారు. బయటికి వెళ్లే క్రమంలో మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్‌ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి, తనలాంటి వాళ్లను అరెస్టు చేశారని ఆరోపించారు. కవిత బెయిల్‌ పిటిషన్లను కోర్టు తిరస్కరించడంతో బుధవారం ఆమె హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Updated Date - May 08 , 2024 | 03:56 AM