Share News

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు..సోనియా గాంధీపై అన్నా హజారే ఆగ్రహం..

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:38 PM

2011-12లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రంగా ఖండించారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో సంబంధాలు..సోనియా గాంధీపై అన్నా హజారే ఆగ్రహం..
Anna Hazare, Sonia Gandhi

ఇంటర్నెట్ డెస్క్: 2011-12లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రంగా ఖండించారు. హజారే ఉద్యమానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రహస్యంగా మద్దతు ఇచ్చాయని సోనియా గాంధీ తన ఆత్మకథలో పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన హజారే.. ఆ రెండు సంస్థలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు రాజకీయ పార్టీల కంటే దేశం, సమాజ ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు (Anna Hazare fires on Sonia Gandhi).


సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకంలో తన ఉద్యమం గురించి చేసిన ప్రస్తావనపై అన్నా హజారే బుధవారం (నవంబర్ 11) మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో స్పందించారు. తనకు బీజేపీతో కానీ, ఆర్ఎస్ఎస్‌తో కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ సంస్థల కార్యక్రమాల్లో కూడా తాను పాల్గొనలేదని చెప్పారు. తాను చేసే ప్రతి పని సమాజం, దేశ ప్రయోజనాల కోసమేనని, ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తన ఉద్యమం కారణంగానే 2014లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పడానికి ఆధారం ఏమిటని సోనియా గాంధీని ప్రశ్నించారు (India Against Corruption Movement).


సోనియా గాంధీ తన గురించి చేసిన వ్యాఖ్యలపై అన్నా హజారే మరో కీలక ప్రశ్న లేవనెత్తారు. ఇప్పటివరకు తాను సోనియా గాంధీని కలవలేదని, ఆమె కూడా తనను ప్రత్యక్షంగా చూడలేదని అన్నారు. ఒకరినొకరు కలవని పరిస్థితుల్లో తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. అస్పష్టమైన వ్యాఖ్యలు చేయడం వల్ల సదరు వ్యక్తి ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు (Anna Hazare Protest).


మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఈ ఉద్యమానికి ప్రధాన ముఖంగా ఎదిగారని సోనియా తన పుస్తకంలో రాశారు (Lokpal Movement). ఈ ఉద్యమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ రహస్యంగా నిర్వహించాయని, మద్దతు ఇచ్చాయని ఉద్యమంలో పాల్గొన్న కొందరు ప్రముఖులు ఆ తర్వాత వెల్లడించినట్లు పేర్కొన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి తొలగించడమే ఈ ఉద్యమం వెనుక ఉన్న అసలు లక్ష్యమని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. హజారే ఉద్యమం వల్ల అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయంగా ఒత్తిడిని ఎదుర్కొందని ఆమె వివరించారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్


ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 12:41 PM