దేశం కోసం గళం కలుపుతున్న 100 మంది సింగర్లు

ABN , First Publish Date - 2020-05-01T20:55:19+05:30 IST

కోవిడ్-19 వారియర్లకు మద్దతుగా దేశంలోని 100 మంది ప్రముఖ గాయకులు గళం కలపనున్నారు. 'ఒకే దేశం ఒకే వాణి' అని చాటిచెబుతూ ..

దేశం కోసం గళం కలుపుతున్న 100 మంది సింగర్లు

న్యూఢిల్లీ: కోవిడ్-19 వారియర్లకు మద్దతుగా దేశంలోని 100 మంది ప్రముఖ గాయకులు గళం కలపనున్నారు. 'ఒకే దేశం ఒకే వాణి' అని చాటిచెబుతూ దేశభక్తి స్ఫూర్తి గీతాన్ని కలిసి ఆలపించనున్నారు. కరోనా వారియర్లకు, పీఎం-కేర్స్ ఫండ్‌‌కు ఈ గీతాన్ని అంకితం చేసేందుకు నిర్ణయించారు.


ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ (ఐఎస్ఆర్ఏ) నుంచి 100 మంది ఆర్టిస్టులు 14 భాషల్లో ఈ గీతాన్ని ఆలపించనుండటం విశేషం. మే 3న ఐఎస్ఆర్ఏ తరఫున ఈ గీతాన్ని ప్రముఖ గాయని లతా మంగష్కర్ దేశప్రజలకు అంకితమిస్తారని లెజెండ్రీ సింగర్ ఆశా భోస్లే తెలిపారు. ప్రజల మనోభావాలను వివిధ సంగీత ప్రక్రియల్లో వినిపించడానికి కళాకారులు ఎప్పుడూ ముందుంటారని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కరోనాపై పోరాటానికి యావద్దేశం ఏకతాటిపైకి వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఐఎస్ఆర్ఏ నేతృత్వంలో దేశం పట్ల తమకున్న భక్తి, అంకితభావాన్ని ఈ పాట ద్వారా ఏకగళంతో తామంతా చాటుకుంటున్నట్టు ఆశా భోస్లే తెలిపారు.


లాక్‌డౌన్ నేపథ్యంలో సింగర్లందరూ తమ ఇళ్లలోనే ఉంటూ ఈ పాట రికార్డింగ్ చేశారు. ఒక మహత్తర లక్ష్యం కోసం ఇంత పెద్ద సంఖ్యలో సింగర్లంతా ఏకతాటిపైకి రావడం ఇదే ప్రథమం. ఆశా బోస్లే, అనూప్ జలోటా, అల్కా యాగ్నిక్, హరిహరన్,  కేలాష్ ఖేర్, కవితా కృష్ణమూర్తి, కుమార్ సాను, మహాలక్ష్మీ అయ్యర్, మనో, పంకజ్ ఉదాస్, ఎస్.పి.బాలసుబ్రమణియం, షాన్, సోను నిగం, సుదేష్ భోస్లే, సురేష్ వాడ్కర్, శైలైంద్ర సింగ్, శ్రీనివాస్, తలత్ అజిజ్, ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేవన్, సస్బీర్ జస్సి మరో 80 మంది కళాకారులు ఈ దేశభక్తి గీతం ఆలపించారు.

Updated Date - 2020-05-01T20:55:19+05:30 IST