వారంలో 5 లక్షల కేసులు!

ABN , First Publish Date - 2020-08-31T06:23:41+05:30 IST

దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీసంఖ్యలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో 78,761 మందికి వైరస్‌ సోకిందని, 948 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది...

వారంలో 5 లక్షల కేసులు!

  • దేశంలో 24 గంటల్లో 78,761 మందికి కరోనా
  • 10.55 లక్షల పరీక్షలు.. మరణాల్లో మూడో స్థానానికి

న్యూఢిల్లీ, ఆగస్టు 30: దేశంలో కరోనా కేసులు మళ్లీ భారీసంఖ్యలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో 78,761 మందికి వైరస్‌ సోకిందని, 948 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. దేశంలో గత వారం వైరస్‌ విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. 7 రోజుల్లో 5 లక్షల కేసు లు నమోదయ్యాయి. ఈ నెల 7న 20 లక్షలు, 23న 30 లక్షల మార్క్‌ను చేరుకోవడం గమనార్హం. ఇప్పుడు బాధితుల సంఖ్య 35 లక్షలకు చేరింది. మరణాలు 63,498 అయ్యాయి. మరణాల్లో భారత్‌(63,498).. మెక్సికో (63,800)ను దాటి మూడో స్థానంలోకి వచ్చింది. మహారాష్ట్రలో గత వారం కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి.


దేశవ్యాప్త కేసుల్లో 21శాతం (16,867)పైగా, జాతీయ మరణాల్లోనూ 34శాతం(328)పైగా మహారాష్ట్రవే. ఏపీలో వరుసగా నాలుగో రోజు 10 వేలు దాటగా, కర్ణాటకలో వరుసగా 5వ రోజూ 8,852, తమిళనాడులో 6,495 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక బీజేపీ చీఫ్‌ నళిన్‌కుమార్‌ కతీల్‌కు పాజిటివ్‌ వచ్చింది. మైనింగ్‌ వ్యాపారి గాలి జనార్దనరెడ్డికి వైరస్‌ సోకింది. ఓఎస్డీ, భద్రతా అధికారికి కరోనా నిర్ధారణ కావడంతో చత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ ఐసోలేషన్‌కు వెళ్లారు. రాజస్థాన్‌ మంత్రి ప్రతాప్‌ కచారియా కొవిడ్‌ బారినపడ్డారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌(90) నివాసం ప్రభుకుంజ్‌కు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సీల్‌ వేశారు. భవనంలోని వారికి వైరస్‌ సోకినందున ఈ చర్య తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. 


40 రోజుల్లో మొదటి స్థానానికి భారత్‌: కె.కె.అగర్వాల్‌

దేశంలో కరోనా కేసులు ఇలాగే పెరిగితే మరో 40రోజుల్లో అమెరికా, బ్రెజిల్‌ను దాటి భారత్‌ అగ్ర స్థానానికి చేరడాన్ని ఎవరూ ఆపలేరని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) మాజీ చీఫ్‌ డాక్టర్‌ కె.కె.అగర్వాల్‌ హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు చేయాల్సినంతా చేశాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే వ్యాప్తిని అరికట్టొచ్చన్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య 2.5 కోట్ల మార్కును దాటింది. అయితే, అధికారిక లెక్కలకు వాస్తవ కేసులు 10 రెట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇది 8,42,000 మందికిపైగా ప్రాణాలను బలితీసుకుంది. 


Updated Date - 2020-08-31T06:23:41+05:30 IST