అమిత్‌ షా డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-09-01T08:01:19+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) నుంచి సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి...

అమిత్‌ షా డిశ్చార్జి

  • దేశంలో మరో 78,512 కేసులు.. 971 మంది మృతి


న్యూఢిల్లీ, ఆగస్టు 31: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) నుంచి సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని  ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల ప్రారంభంలో కరోనా పాజిటివ్‌గా తేలడంతో అమిత్‌ షా గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. తర్వాత నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి అయ్యారు. తీవ్ర అలసట, ఒళ్లు నొప్పులతో ఈ నెల 18న ఎయిమ్స్‌లో చేరారు. దేశంలో వరుసగా ఐదో రోజూ 75 వేలపైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 78,752 మందికి వైరస్‌ సోకిందని.. 971 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 76.62కు చేరిందని.. మరణాల రేటు 1.78కి తగ్గిందని కేంద్రం పేర్కొంది.  కాగా, కొత్త కేసుల్లో 70 శాతం 7 రాష్ట్రాల్లోనే వచ్చాయని కేంద్రం పేర్కొంది. 24 గంటల్లో 80 వేల కేసులు నమోదైనట్లు, దేశంలోని మొత్తం కేసుల్లో 43 శాతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకవేనని ప్రకటించింది. తమిళనాడు (8.27 శాతం)నూ కలుపుకొంటే 53 శాతం దాటుతోంది.


2 లక్షలు తగ్గిన పరీక్షలు 

శనివారం రికార్డు స్థాయిలో 10.55 లక్షల పరీక్షలకు 78,761 కేసులు రాగా.. ఆదివారం (8.46 లక్షలు) రెండు లక్షలపైగా పరీక్షలు తక్కువగా చేశారు. కేసుల సంఖ్య మాత్రం దాదాపు సమానంగా ఉండటం గమనార్హం. అసోంలో కరోనా బారినపడిన ఎమ్మెల్యేల సంఖ్య 25కు చేరింది. మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరీక్షల సంఖ్య పెంచినందనే ఢిల్లీలో కేసులు ఎక్కువగా నమోదు అవుతు న్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ పేర్కొన్నారు.   మహారాష్ట్రలోని పుణెలో 3,856 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో రోజువారీ బాధితులు 5 వేలకు తగ్గడం లేదు.


కరోనా విధుల్లో చనిపోతే అమరులుగా గుర్తించండి

కరోనా రోగుల చికిత్సలో పాల్గొంటూ.. వైరస్‌ బారినపడి మృతి చెందిన వైద్యులను ‘అమర జవాన్ల’ తరహాలో గుర్తించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది.  దేశంలో ఇప్పటికి 87 వేల మంది వైద్య సిబ్బంది వైర్‌సకు గురయ్యారని, 573 మంది చనిపోయారని పేర్కొంది. వీరిలో వైద్యులే 307 మంది ఉన్నారని వివరించింది.


Updated Date - 2020-09-01T08:01:19+05:30 IST