యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

ABN , First Publish Date - 2020-10-30T20:42:24+05:30 IST

భారత నావికా దళం శుక్రవారం యాంటీ షిప్ మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లీ : భారత నావికా దళం శుక్రవారం యాంటీ షిప్ మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నావికా దళానికి చెందిన గైడెడ్ మిసైల్ కార్వెటీ ఐఎన్ఎస్ కోరా నుంచి దీనిని ప్రయోగించారు. ఈ యాంటీ షిప్ మిసైల్ తన లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా ఛేదించింది. బంగాళా ఖాతంలో గరిష్ఠ పరిథిలోని లక్ష్యాన్ని ఛేదించింది. భారత నావికా దళం ఓ ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపింది. 


‘‘భారత నావికా దళానికి చెందిన గైడెడ్ మిసైల్ కార్వెటీ ఐఎన్ఎస్ కోరా నుంచి ప్రయోగించిన యాంటీ షిప్ మిసైల్ గరిష్ఠ పరిథిలోని బంగాళా ఖాతంలోని తన లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా ఛేదించింది.  టార్గెట్ షిప్ తీవ్రంగా ధ్వంసమైంది, మంటల్లో చిక్కుకుంది’’ అని ట్వీట్‌లో నావికా దళం పేర్కొంది. ధ్వంసమైన టార్గెట్ షిప్ ఫొటోలను నావికా దళం విడుదల చేసింది. 


కొద్ది రోజుల క్రితం అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ ప్రబల్ నుంచి ప్రయోగించిన యాంటీ షిప్ మిసైల్ ఓ నౌకను అత్యంత కచ్చితంగా ధ్వంసం చేయడానికి సంబంధించిన వీడియోను నావికా దళం విడుదల చేసింది. ఆ నౌక మునిగిపోవడం ఈ వీడియోలో కనిపించింది. 


ఐఎన్ఎస్ ప్రబల్ అంటే చమక్ క్లాస్ మిసైల్ బోటు. ఐఎన్ఎస్ కోరా అంటే కోరా క్లాస్ కార్వెటీస్‌ యొక్క లీడ్ షిప్. దీనికి 3ఎం-24 యాంటీ షిప్ మిసైల్స్‌ను ప్రైమరీ వెపన్‌గా అమర్చుతారు. డిఫెన్సివ్ వెపన్స్‌గా రెండు స్ట్రెలా-2ఎం యాంటీ ఎయిర్ మిసైల్స్ ఉంటాయి. కార్వెటీ అంటే చిన్న యుద్ధ నౌక. 


Updated Date - 2020-10-30T20:42:24+05:30 IST