రేపు ఏపీ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు: విష్ణువర్ధన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-04T18:35:22+05:30 IST

రాష్ట్రంలో రహాదారులు అధ్వాన్న దుస్థితిపై రేపు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

రేపు ఏపీ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు: విష్ణువర్ధన్‌రెడ్డి

విజయవాడ: రాష్ట్రంలో రహాదారులు అధ్వాన్న దుస్థితిపై రేపు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. బీజేపీ  శ్రేణులు, అభిమానులు ఈ దిగ్బంధనం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ భజన నడుస్తోందన్నారు. తమ వాలంటీర్లు ఇంత పెన్షన్, రేషన్ ఇచ్చారు అని చెప్పుకునే జగన్ కాంట్రాక్టర్లకు ఎంత నిధులు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాలేజీల్లో ర్యాగింగ్ ఇప్పుడు అసెంబ్లీకి పాకిందని వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించడంలో వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.  భీమవరంలో రోడ్ల నిర్వహణకు 12 సార్లు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు.


ఏపీలో 4వేల కోట్లకు టెండర్లు పిలిచారని.. కానీ ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వీసీఐసీ ద్వారా నిర్వహణకు సొమ్ము ఇస్తే పక్కదారి పట్టించారని మండిపడ్డారు. పీఎంజీవై ద్వారా రూ.723 కోట్లు ఇస్తే దారి మళ్ళించారని ఆగ్రహంవ్యక్తం చేశారు. సంబంధిత శాఖ నుంచి యుటిలైజేషన్ సర్టిఫికేట్ రాకపోవడంతో నిధులు ఆగిపోయాయన్నారు. బ్యాంకులు కూడా ఏపీకి డబ్బులు ఇవ్వాలంటే భయపడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఎంఎస్ఎంఈ కింద సొమ్ములు ఆగిపోయాయన్నారు. పంచాయితీరాజ్‌లో రూ.900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆర్ధికమంత్రి సొంత ఊళ్ళో కాంట్రాక్టర్లు నిరసనకు దిగారని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. 


బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.చంద్రమౌళి మాట్లాడుతూ...మత్స్యశాఖ ఏర్పాటు చేసి అద్భుత కార్యక్రమాలు ప్రధాని నరేంద్రమోదీ చూశారన్నారు. ఏపీ భౌగోళిక పరిస్థితులు తెలిసిన ప్రధాని 10 ఫిషింగ్ హార్బర్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు.  ఫిష్ ల్యాండింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారన్నారు. 3వేల కోట్లతో ఫిషింగ్ హార్బర్ల ప్రతిపాదన ఆమోదించారని ఆయన తెలిపారు. వాప్స్‌కో ఆధ్వర్యంలో హార్బర్ల డీపీఆర్ తయారు చేశారని సంవత్సరంపైగా గడిచిపోయినా కేంద్రం ఇచ్చిన సొమ్ములపై రాష్ట్రం మాట్లాడట్లేదని మండిపడ్డారు. వాప్స్‌కోను కాదని రాష్ట్ర ప్రభుత్వమే చేసుకుంటాననడం సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కేస్తోందని విమర్శించారు. కేంద్రం ఆర్థిక సాయం ఇస్తున్నా పనులు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనమని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో పది ఫిషింగ్ హార్బర్‌ల వద్ద బీజెపీ ఏపీ శాఖ ఉద్యమిస్తుందని చంద్రమౌళి తెలిపారు. 

Updated Date - 2020-12-04T18:35:22+05:30 IST