కరోనా కట్టడిలో తెలంగాణ భేష్‌

ABN , First Publish Date - 2020-05-01T07:28:33+05:30 IST

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం కితాబునిచ్చింది. హైదరాబాద్‌ సందర్శించిన కేంద్ర అంతర్‌ మంత్రిత్వ కమిటీ ఈ మేరకు తమకు సమాచారం అందించినట్లు...

కరోనా కట్టడిలో తెలంగాణ భేష్‌

  • వైరస్‌ వ్యాప్తి చెందకుండా పటిష్ఠ చర్యలు
  • రాష్ట్ర సర్కారుకు కేంద్రం కితాబు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం కితాబునిచ్చింది. హైదరాబాద్‌ సందర్శించిన కేంద్ర అంతర్‌ మంత్రిత్వ కమిటీ ఈ మేరకు తమకు సమాచారం అందించినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాత్సవ గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు. కేంద్ర బృందం ఆస్పత్రులు, డ్రగ్‌ల స్టోర్లు, ఆశ్రయ కేంద్రాలు, మండీలు మొదలైనవన్నీ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసేందుకు సరిపడా కిట్లు, వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని కనిపెట్టి, చికిత్స చేసి, డిశ్చార్జి చేసే వరకూ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని కేంద్ర బృందం చెప్పినట్లు హోంశాఖ వెల్లడించింది. 


గాంధీలో రోజుకు 300 పరీక్షలు

కరోనా చికిత్సకు ప్రధాన కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో అన్ని నిబంధనలను అనుసరిస్తున్నారని, కరోనాను నిర్ధారించేందుకు ఇక్కడ ప్రయోగశాలలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. గాంధీలో రోజుకు 300 పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొంది. చికిత్స పూర్తయిన తర్వాత రోగిని ఇంటివరకూ వదిలిపెడతారని, ఇంటిలో హోం క్వారంటైన్‌ చేసేలా చూస్తారని, మొబైల్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పింది. ఆస్పత్రుల్లో చేరిన రోగులకు ఉచిత వైఫై వంటి సౌకర్యాలు కూడా కల్పించారని తెలిపింది. కింగ్‌ కోఠీ ఆస్పత్రిలోనూ నమూనాలు సేకరించే సౌకర్యాలు కల్పించారని వెల్లడించింది. అయితే ఇక్కడ కొన్ని వార్డులకు శౌచాలయాలు దూరంగా ఉన్నాయని, ఇక్కడ రోగులను చేర్చవద్దని కేంద్ర బృందం సూచించినట్లు పేర్కొంది. సిబ్బంది, రోగులకు ఉపయోగించే కారిడార్లు వేర్వేరుగా ఉండాలని, రోగులను తీసుకొచ్చేటప్పుడు, పంపించేటప్పుడు వేర్వేరు ప్రాంతాలను ఉపయోగించాలని కేంద్ర బృందం సూచించినట్లు వివరించింది.


జీహెచ్‌ఎంసీ సేవలూ ప్రశంసనీయం

కట్టడి ప్రాంతాల్లో నిత్యావసరాలను ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని, మునిసిపల్‌ సిబ్బంది, ప్రజలు వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ల మద్దతు తీసుకుంటున్నారని పేర్కొంది. క్వారంటైన్‌ కేంద్రాల్లోనూ పరిస్థితులు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పింది. ‘మై ఫుడ్‌’ యాప్‌ ద్వారా జీహెచ్‌ఎంసీ ఆహార సౌకర్యాలు కల్పిస్తోందని, మొబైల్‌ క్యాంటీన్లు నడుపుతున్నదని కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. తెలంగాణలో ఇప్పుడు కరోనా రోగులు రెట్టింపు అయ్యే శాతం 70 రోజులకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు కూడా తెలిపాయి.


Updated Date - 2020-05-01T07:28:33+05:30 IST