33 వేలు దాటాయి

ABN , First Publish Date - 2020-05-01T07:44:45+05:30 IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 33 వేలు దాటింది. తాజాగా 1,823 కేసులు నమోదవడంతో మొత్తం 33,610కి పెరిగింది. మరో 67 మంది బలి అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 1,075కు...

33 వేలు దాటాయి

  • భారత్‌లో మరో 67 మంది మృతి
  • 1,075కు చేరిన మృతుల సంఖ్య


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: భారత్‌లో కరోనా  కేసుల సంఖ్య 33 వేలు దాటింది. తాజాగా 1,823 కేసులు నమోదవడంతో మొత్తం 33,610కి పెరిగింది. మరో 67 మంది బలి అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 1,075కు చేరింది.  8,372 మంది (24.9 శాతం) కరోనా రోగులు కోలుకొన్నారు. ముంబైలో 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి సంభవించిన 67 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 32 నమోదయ్యాయి. గుజరాత్‌లో 16, మధ్యప్రదేశ్‌లో 11 మంది మృతి చెందారు. ‘‘కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు ఢిల్లీ, యూపీ, జమ్మూ కశ్మీర్‌, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు, పంజాబ్‌లో 11 నుంచి 20 రోజుల మధ్య  పడుతోంది. ఇదే కర్ణాటక, లద్దాఖ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, కేరళలో 20 నుంచి 40 రోజుల మధ్య పడుతోంది’’ అని  కేంద్ర ఆరోగ్య శాఖ  సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. రికవరీ రేటు 14 రోజుల్లో 13.06 శాతం నుంచి 25 శాతానికి మెరుగుపడిందని చెప్పారు. కరోనా వైర్‌సతో మరణించిన వారిలో 78 శాతం మందికి ఇతర వ్యాధులు ఉన్నాయని తెలిపారు. మృతుల్లో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మహిళలని చెప్పారు. ‘‘వారిలో 14 శాతం 45 ఏళ్లలోపు, 34.8 శాతం 45-60 మధ్య, 51.2 శాతం 60 ఏళ్లు పైబడిన వారు’’ అని వివరించారు. కాగా, మహారాష్ట్రలో మరణాల సంఖ్య 432కు పెరిగింది. తర్వాత స్థానాల్లో గుజరాత్‌ (214), మధ్యప్రదేశ్‌ (130), ఢిల్లీ (56), రాజస్థాన్‌ (51), ఉత్తరప్రదేశ్‌ (40) ఉన్నాయి. కేసుల సంఖ్యలో కూడా మహారాష్ట్రే మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు 10,498కి చేరాయి. ముంబైలోనే గురువారం కొత్తగా 583 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 4,395 (కొత్త కేసులు 313), ఢిల్లీలో 3,439, మధ్యప్రదేశ్‌లో 2,660, రాజస్థాన్‌లో 2,438, ఉత్తరప్రదేశ్‌లో 2,221, తమిళనాడులో 2,323కు పెరిగాయి. తమిళనాడులో రికార్డుస్థాయిలో ఒకే రోజు 161 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో గురువారం 30 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కేసుల సంఖ్య 565కి చేరింది. కాగా, మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్‌ పట్టణంలో 20 రోజుల పసికందుకు కరోనా సోకింది. ఈ శిశువు తల్లి కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రసవించింది. 


కేరళలో కలెక్టర్‌ క్వారంటైన్‌

కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లా కలెక్టర్‌తో పాటు ఆయన డ్రైవర్‌, గన్‌మేన్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం ఓ టీవీ విలేకరికి కలెక్టర్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విలేకరికి కరోనా సోకినట్లు తేలడంతో కలెక్టర్‌ను క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.


లాయర్లకు నిధి ఏర్పాటును పరిశీలించండి: సుప్రీం కోర్టు

స్వతంత్రంగా ప్రాక్టిస్‌ చేస్తున్న న్యాయవాదుల కోసం అత్యవసర నిధి ఏర్పాటు గురించి ఇండియన్‌ బార్‌ కౌన్సిల్‌ (బీసీఐ) పరిశీలించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ అంశంపై పిటిషన్‌ దాఖలు కాగా, జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ నిర్వహించింది. యావత్‌ దేశం కష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో న్యాయవాదుల కోసం నిధిని ఏర్పాటు చేయాలని నిర్దేశించలేమని పేర్కొంది. 


Updated Date - 2020-05-01T07:44:45+05:30 IST