కెనడాపై కరోనా పడగ

ABN , First Publish Date - 2020-05-01T08:40:50+05:30 IST

కెనడాపై కరోనా పంజా విసిరింది. ఇప్పటి వరకు 47,000 మందికి ఆ వైరస్‌ సోకింది. 2,600 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. తెలుగు అలయెన్సెస్‌ ఆఫ్‌ కెనడా (టాకా) చైర్మన్‌ సామంతపూడి హనుమంతాచారి...

కెనడాపై కరోనా పడగ

  • మే 24 వరకు లాక్‌డౌన్‌ 
  • భారీగా సహాయక చర్యలు
  • తెలుగువారంతా క్షేమమే
  • విద్యార్థులకు ‘టాకా’ చేయూత
  • ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో టాకా అధ్యక్షుడు హనుమంతాచారి

కెనడాపై కరోనా పంజా విసిరింది. ఇప్పటి వరకు 47,000 మందికి ఆ వైరస్‌ సోకింది. 2,600 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. తెలుగు అలయెన్సెస్‌ ఆఫ్‌ కెనడా (టాకా) చైర్మన్‌ సామంతపూడి హనుమంతాచారి ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ఆయన 25 ఏళ్ల క్రితం కెనడా వెళ్ళారు. 10 సంవత్సరాల క్రితం టాకాను నెలకొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కెనడాలో ఉన్న పరిస్థితుల గురించిన వివరాలు ఆయన మాటల్లోనే..


తెలుగు వారంతా క్షేమం

కెనడాలో కరోనా సోకిన భారతీయుల సంఖ్య చాలా తక్కువ, మృతుల్లో మనవాళ్లు ఒకరిద్దరు ఉన్నారు. కెనడాలో 80 వేలకుపైగా తెలుగు వారు ఉన్నారు. వారంతా క్షేమంగా ఉన్నారు. అన్ని వర్సిటీలను మూసివేయడంతో.. తెలుగు విద్యార్థులను టాకా ఆదుకుంటోంది. అవసరమైన మందులు, ఇతర వసతులను కల్పిస్తున్నాం. లాక్‌డౌన్‌ ముగియగానే.. వారిని తిరిగి భారత్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం.


భారీగా నిరుద్యోగ భృతి

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు. దాదాపు 50 లక్షల మంది కరోనా మూలంగా నిరుద్యోగులుగా మారారు. వారందరికీ 4 నెలల పాటు.. నెలకు 2 వేల డాలర్ల చొప్పున ఆర్థిక సహాయన్ని ప్రకటించారు. ఉపాధి కోల్పోయిన చిన్న వ్యాపారులకు.. వారు చెల్లించాల్సిన నెలవారీ అద్దెలో 75ు మొత్తాన్ని 4 నెలల పాటు అందజేస్తారు. విద్యార్థులకు నెలకు 200 డాలర్లు ఇస్తారు.


మే 24 వరకూ లాక్‌డౌన్‌

కెనడాలో కరోనా లాక్‌డౌన్‌ను మే 24 వరకు విధించారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఇంకా పొడిగించవచ్చు. 90ు మందికి ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు కల్పించారు.


రంగంలోకి సైన్యం

కెనడాలో కరోన సోకి మృతి చెందిన వారిలో అత్యధికులు 70 ఏళ్లకు పైబడిన వారే. వీరిలో ఎక్కువ మంది వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారే. దీంతో సోమవారం నుంచి దేశంలోని అన్ని వృద్ధాశ్రమాలను కెనడా సైన్యం స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉంటున్న వృద్ధుల ప్రాణాలను రక్షించడానికి సన్నద్ధమైంది.


అప్రమత్తంగా భారత కాన్సులేట్‌

కెనడాలో ఉన్న భారత రాయభార కార్యాలయం 24 గంటలూ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. రాయభారి అపూర్వా శ్రీవాత్సవ ఆధ్వర్యంలో సిబ్బంది ఆపదలో ఉన్న భారతీయులను ఆదుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. టాకాతోపాటు కెనడా నలుమూలలా ఉన్న 30 భారతీయ సంఘాలతో రాయభార కార్యాలయం ఆన్‌లైన్‌ ద్వారా చర్చలు జరుపుతోంది.

(న్యూయార్క్‌ నుంచి కిలారు అశ్వనీ కృష్ణ)




Updated Date - 2020-05-01T08:40:50+05:30 IST