కొవిడ్-19: జ్యోతిష్కులకు భారీగా పెరిగిన గిరాకీ!

ABN , First Publish Date - 2020-04-29T17:43:02+05:30 IST

కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన భారతీయులు తమ భవిష్యత్తుపై ఆస్ట్రాలజీ ఆశ్రయిస్తుండడంతో ఇప్పుడు..

కొవిడ్-19: జ్యోతిష్కులకు భారీగా పెరిగిన గిరాకీ!

లక్నో: కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన భారతీయులు తమ భవిష్యత్తుపై ఆస్ట్రాలజీని ఆశ్రయిస్తుండడంతో ఇప్పుడు జ్యోతిష్కులకు భారీగా గిరాకీ పెరిగింది. ప్రత్యేకించి ఫోన్‌ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా సమాధానాలు చెబుతున్న జ్యోతిష్కులు రెండు చేతులా సంపాదిస్తున్నట్టు కనిపిస్తోంది. వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు పండితులు ఒక్కో నిమిషానికి రూ.12 నుంచి 400 దాకా వసూలు చేస్తున్నారు. మూతపడిన పరిశ్రమలు, ఫైనాన్షియల్ మార్కెట్లపైనే జనాలకు ఎక్కువగా బెంగపట్టుకున్నట్టు ఆస్ట్రాలజిస్టులు చెబుతున్నారు. కరోనా కల్లోలం నేపథ్యంలో చాలామంది ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తుండగా.. యువతరం తమ కెరీర్ గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారట. అడపాదడపా కొందరు ప్రేమికులు కూడా తమకు ఫోన్ చేసి ఈ ఏడాది తమ పరిస్థితి ఎలా ఉంటుందో ఆరాతీస్తున్నట్టు పండితులు వెల్లడించారు. 


లాక్‌డౌన్ నేపథ్యంలో తమకు ఇప్పుడు రోజూ వంద నుంచి 250 ఫోన్ కాల్స్ పెరిగాయని ఆస్ట్రోయోగి వెబ్‌సైట్ చీఫ్ ఆదిత్య కపూర్ వెల్లడించారు. 22 నుంచి 40 ఏళ్ల లోపువారే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారనీ.. అధిక శాతం మంది తమ కెరీర్ పరిస్థితిపైనే ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన తెలిపారు. దాదాపు 400 మంది జ్యోతిష్కులున్న ఈ వెబ్‌సైట్లో... తమకున్న పాపులారిటీని బట్టి పండితులు ఒక్కో నిమిషానికి రూ.12 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నట్టు ఆదిత్య తెలిపారు. కాగా మరో ప్రముఖ ఆస్ట్రాలజీ వెబ్‌సైట్ ఆస్ట్రోసాగే సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ పాండే మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ నేపథ్యంలో మా ఆదాయం 42 శాతం పెరిగింది. మా ఈ-మెయిల్ కన్సల్టేషన్లకు బాగా ప్రాచుర్యం ఉంది. ఒక్కో ప్రశ్నకు రూ.250 నుంచి రూ.300 వరకు చార్జ్ చేస్తాం. అదే ఫోన్ కాల్ అయితే 15 నిమిషాలకు రూ.400 వరకు ఖర్చవుతుంది..’’ అని తెలిపారు. దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఎన్నారైలు సైతం తమను సంప్రదిస్తున్నట్టు జ్యోతిష్కులు పేర్కొనడం విశేషం.

Updated Date - 2020-04-29T17:43:02+05:30 IST