విజయవాడలో భార్య.. విజయనగరంలో భర్త.. పెళ్లైన మూడు నెలలకే ఘోరం..!

ABN , First Publish Date - 2020-05-01T20:27:54+05:30 IST

కాళ్ల పారాణి ఆరనే లేదు. పెళ్లి ముచ్చట తీరనే లేదు. ఇంతలోనే ఆ జంటపై విధి కన్నెర్రజేసింది. పెళ్లయిన మూడు నెలలలోపే నవదంపతులను విడదీసింది. మృత్యువు ఆ వరుడిని తనతో తీసుకెళ్లిపోయింది. ఆ యువతికి తీవ్ర వేదనను మిగిల్చింది.

విజయవాడలో భార్య.. విజయనగరంలో భర్త.. పెళ్లైన మూడు నెలలకే ఘోరం..!

ప్రమాదంలో గాయపడిన వరుడి మృతి

వివాహమైన మూడు నెలలకే విషాదం

భర్తను కడసారి చూడలేకపోయిన భార్య


పూసపాటిరేగ(విజయనగరం) : కాళ్ల పారాణి ఆరనే లేదు. పెళ్లి ముచ్చట తీరనే లేదు. ఇంతలోనే ఆ జంటపై విధి కన్నెర్రజేసింది. పెళ్లయిన మూడు నెలలలోపే నవదంపతులను విడదీసింది. మృత్యువు ఆ వరుడిని తనతో తీసుకెళ్లిపోయింది. ఆ యువతికి తీవ్ర వేదనను మిగిల్చింది. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోవిందపురం గ్రామానికి చెందిన ఎర్రబోలు నరేష్‌(26) శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని సరాకా ల్యాబ్‌ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సంస్థలో చోటుచేసుకున్న ప్రమాదంలో నరేష్‌ తీవ్ర  అస్వస్థతకు గురయ్యాడు. విజయనగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశాడు. అతనికి భార్య, తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, పాపారావు ఉన్నారు. 


 పెళ్లయిన మూడు నెలలకే..

ఈ ఏడాది ఫిబ్రవరి 9న విజయవాడకు చెందిన యువతితో నరేష్‌కు వివాహమైంది. సంప్రదాయం ప్రకారం మార్చి మొదటి వారంలో భార్యను తీసుకొని నరేష్‌ అత్తింటికి వెళ్లాడు. ఉగాదికి వెళ్లి ఆమెను తనతో పాటు తీసుకురావాలని అనుకున్నాడు. అత్తమామలతో అదేమాట చెప్పి...స్వగ్రామానికి వచ్చేశాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మళ్లీ భార్యను చూసేందుకు   అత్తవారింటికి వెళ్లే అవకాశం లేకుండాపోయింది. దీంతో ఆమె కన్నవారింటిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రమాద సంఘటన విషయం తెలిసిన తరువాత భార్యను ఇక్కడికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా... కుదరలేదు. ఇంతలో గురువారం నరేష్‌ మృతిచెందాడు. 


చివరి చూపునకూ నోచుకోక...

విజయవాడలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న యువతికి నరేష్‌ మృతిచెందిన విషయాన్ని గురువారం కుటుంబ సభ్యులు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. అక్కడి నుంచి ఆమెను రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆమె కూడా రెడ్‌జోన్‌లో ఉండడంతో భర్తను కడసారి చూసేందుకు కూడా అవకాశం లేకుండాపోయింది. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. వీడియో కాల్‌ ద్వారా భర్త అంత్యక్రియలు చూడాల్సి వచ్చింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పెళ్లయ్యాక భార్యాభర్తలిద్దరూ కనీసం నెల రోజులు కూడా కలసి ఉండలేదని... సంప్రదాయాన్ని పాటించాల్సి రావడంతో వేర్వేరుగా ఉండాల్సి వచ్చిందని... ఇంతలోనే ఈ ఘోరం జరుగుతుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

Updated Date - 2020-05-01T20:27:54+05:30 IST