ఐఐటీ పీహెచ్‌డీ.. విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-30T11:06:42+05:30 IST

విద్యాకుసుమం రాలిపోయింది..

ఐఐటీ పీహెచ్‌డీ.. విద్యార్థి ఆత్మహత్య

ఖరగ్‌పూర్‌ ఐఐటీ హాస్టల్‌లో ఘటన 

మూడు నెలల కిందటే వివాహం

అయ్యకోనేరు దక్షిణ ప్రాంతంలో విషాదం


విజయనగరం(ఆంధ్రజ్యోతి): విద్యాకుసుమం రాలిపోయింది. చదువులో ఉన్నతంగా రాణిస్తూ ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆ విద్యార్థి చదువుల ప్రయాణం అంతలోనే ఆగిపోయింది. మూడు నెలల కిందటే వివాహం చేసుకున్న అతన్ని మంచి ఉద్యోగంలో చూద్దామనుకుంటున్న తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త తెలిసింది. కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పడంతో వారికి గుండె పగిలినట్టయింది. విజయనగరం అయ్యకోనేరు దక్షిణ గట్టు ప్రాంతానికి చెందిన భవానీభట్ల కొండలరావు(30) విషాదాంతమిది. మూడు రోజుల కిందట ఖరగ్‌పూర్‌లో తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భౌతిక కాయానికి బుధవారం విజయనగరంలో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


విజయనగరం అయ్యకోనేరు దక్షిణ గట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న భవానీభట్ల భాస్కరరావు, సుధామాణిక్యం రెండో సంతానమైన భవానీభట్ల కొండలరావు (30)పశ్చిమబంగ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఎంటెక్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం అక్కడే పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి-14(ప్రేమికుల రోజు)న కాకినాడ ప్రాంతానికి చెందిన యువతితో ఆయనకు వివాహమైంది. ఆమె చెన్నయ్‌లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాక చదువురీత్యా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నెల 25న తల్లిదండ్రులు, చిన్నాన్న కామేశ్వరావు కూడా కొండలరావుతో ఫోన్లో మాట్లాడారు. మరోసారి ఆదివారం కొండలరావుతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ అన్న సమాచారం వచ్చింది.


పదేపదే స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో అక్కడున్న ఇతరులతో వాకబు చేశారు. ఆయన ఉంటున్న గది తలుపులు వేసి ఉన్నాయని తెలిపారు. అంతలోనే సోమవారం ఉదయం ఖరగ్‌పూర్‌ పోలీసులు భాస్కరరావుకు ఫోన్‌ చేసి ‘మీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని చెప్పారు. ఆ వార్తతో కుటుంబ సభ్యులంతా గుండెలవిసేలా రోదించారు. వెంటనే తండ్రి భాస్కరరావు, చిన్నాన్న కామేశ్వరావులు కరోనా నేపథ్యంలో ముందస్తు అనుమతి తీసుకుని ఖరగ్‌పూర్‌కు వెళ్లారు. మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేసుకుని ఐఐటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌లో విజయనగరం బయలుదేరి వచ్చారు. బుధవారం ఉదయం కొత్తపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  ఆత్మహత్యపై ఖరగ్‌పూర్‌ పోలీసులు ఎటువంటి సమాచారాన్ని తెలియజేయలేదు. విద్యార్థికి సంబంధించి ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌, పర్సు కూడా పోలీసుల వద్దే ఉన్నాయి. విచారణ అనంతరం వాటిని తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది.


అయ్యకోనేరు దక్షిణ ప్రాంతంలో విషాదం

కొండలరావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి అయ్యకోనేరు దక్షిణగట్టు ప్రాంతంలో విషాదం అలముకుంది. ఆ యువకుడి కుటుంబ సభ్యులు అందరితో కలివిడిగా ఉంటారు. చదువులో ఉన్నతంగా రాణిస్తున్న కొండలరావు మృతిని ఆ ప్రాంత వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. కొండలరావు అక్క రూపకాక్షాయణిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. తమ్ముడిని విగతజీవిగా చూసి కుమిలికుమిలి ఏడ్చింది. అంత్యక్రియలకు భార్య రాలేదు. ఆమె తండ్రి వేంపాటి సాంబశివరావు హాజరయ్యారు.

Updated Date - 2020-04-30T11:06:42+05:30 IST