లైఫ్ ఆఫ్టర్ కరోనా: ఐసీయూలో చేరిన పేషంట్‌లా రియల్ ఎస్టేట్

ABN , First Publish Date - 2020-04-29T22:30:23+05:30 IST

గత మూడేళ్ల నుంచి మందగమనంలో సాగుతున్న ఈ సెక్టార్‌ ఇప్పుడు మరింత వెలవెలబోతున్నది. దేశంలో కోట్లాది మందికి

లైఫ్ ఆఫ్టర్ కరోనా: ఐసీయూలో చేరిన పేషంట్‌లా రియల్ ఎస్టేట్

కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బకి రియల్‌ ఎస్టేట్‌ రంగం విలవిలలాడుతోంది. గత మూడేళ్ల నుంచి మందగమనంలో సాగుతున్న ఈ సెక్టార్‌ ఇప్పుడు మరింత వెలవెలబోతున్నది. దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించే ఈ రంగం ఆటుపోట్లకి గురైతే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నెలల స్వల్ప వ్యవధిలో రియాల్టీ ఫీల్డ్‌ ఏ స్థాయిలో పిడుగుపాటుకి గురైందో తెలుసుకుందాం. కరోనా తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతున్నదో సమీక్షించుకుందాం. 


"సొంత ఇంటి కల'' అన్న ఒకేఒక్క అంశాన్ని మెట్టుగా చేసుకుని ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన రంగమే "రియల్‌ ఎస్టేట్‌''! సామాన్యుడు మొదలు అపర కుబేరుల ఆకాంక్షలనే పెట్టుబడిగా చేసుకుని ఈ సెక్టార్‌ అంచెలంచెలుగా విస్తరించింది. ఇండిపెండెంట్‌ ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఎస్టేట్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, మహా టవర్లు, బహుళ అంతస్తుల సౌధాలు.. ఇలా ఎవరెస్టు శిఖరాన్నే తాకిన రంగమిది. ఈ ప్రస్థానంలో చిన్నచిన్న ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని స్థిరమైన అభివృద్ధితో దేశ ఆర్థిక పురోగతికి కూడా ఊతమిస్తున్న శాఖ ఇది. ఉక్కు సంకల్పమూ, కాంక్రీటు పునాది కలిగిన ఈ రంగాన్ని కూడా కరోనా అనే మహమ్మారి ఈడ్చి కొట్టింది. భూకంపానికి వణికే భవనం మాదిరిగా శక్తివంతమైన రియాల్టీ రంగం కూడా ఇప్పుడు గడగడమని వణుకుతోంది..


కేవలం రెండంటే రెండే నెలల్లో ఈ రంగం కూడా ఐసీయూలో చేరిన పేషెంట్‌లా తయారైంది. ఈ రంగంపై ఆధారపడిన కోట్లాదిమంది భవిష్యత్తు ప్రమాదంలో పడింది. లాక్‌డౌన్‌ దెబ్బకి దేశవ్యాప్తంగా రియాల్టీ రంగం దాదాపుగా లక్షకోట్ల రూపాయలు నష్టపోయినట్టు ఒక అంచనా. అంతేకాదు- వివిధ దశల్లో ఉన్న సుమారు 60 లక్షల కోట్ల రూపాయల విలువజేసే ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇన్ని వెంచర్లు వెంటిలేటర్లపైకి చేరితే పరిస్థితి ఏంగాను చెప్పండి? భారత్ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగానిది మేజర్‌ పార్ట్‌. రియాల్టీపై ఆధారపడి ఐదు కోట్లమందికి పైగా బతుకుతున్నారు. ఇండియన్‌ వర్క్‌ఫోర్స్‌లో 12 శాతం ఇది. అలాంటి కీలక రంగంలో ప్రస్తుత ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్న మాట నిజం.


ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ "అన్‌రాక్‌'' నివేదిక ప్రకారం భారతదేశంలో 7 పెద్ద నగరాల్లో 2013- 2019 మధ్య మొదలైన సుమారు 15.62 లక్షల గృహనిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల నిర్మాణ సామగ్రి లభ్యతకి ఆటంకాలు ఏర్పడి ఈ పనులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా వెంటనే ఈ పనులు పునఃప్రారంభం కాకపోవచ్చునని అంటున్నారు. నిజానికి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి వేసవికాలం, పండుగల సమయం మంచి సీజన్‌గా భావిస్తారు. కానీ ఈసారి వేసవిని కరోనా కాటేయడంతో కొత్త వెంచర్లు ప్రారంభమైన దాఖలాలే లేవు. 


2018లో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత ఆ ప్రభావం రియాల్టీ సెక్టార్‌పై బాగా పడింది. ఆ రంగానికి ఆర్థిక మద్దతు ఇచ్చే సంస్థలు వెనుకంజ వేశాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వంటివి కూడా దెబ్బమీద దెబ్బ కొట్టాయి. దీంతో రియాల్టీ రంగం మందగమనంలోకి జారుకుంది. ఈ దశలోనే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్స్‌ యాక్ట్‌ అంటే "రెరా''ని 2017లో కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో 2018లో ఈ రంగం 18 శాతం వృద్ధిని సాధించింది. 2019లో కొంత స్థిరత్వం కనిపించింది. 2020 తొలి క్వార్టర్‌లోకి వచ్చేసరికి.. కరోనా ప్రభావం పరిస్థితిని తారుమారు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో పత్రాల పరిశీలన, వ్యక్తిగత సంప్రదింపులు, సైట్‌ విజిట్లు వంటివి తప్పనిసరి. లాక్‌డౌన్‌ తర్వాత ఇలాంటి ప్రక్రియలకి ఆస్కారమే లేకుండాపోయింది. దీంతో ఇళ్లు కొనాలనుకున్న వారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. కరోనా కారణంగా 2021 ఆర్థిక సంవత్సరం వరకూ లగ్జరీ హౌసింగ్‌తో పాటు మొత్తం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని హౌసింగ్ డాట్ కామ్ తాజా నివేదిక వెల్లడించింది. 


రియాల్టి అనేది శాఖోపశాఖలతో విస్తరించిన మహావృక్షం వంటిది. ఎందుకంటే ఈ రంగంపై ఆధారపడి సుమారు 250 చిన్నాపెద్దా పరిశ్రమలు ఉంటాయి. సిమెంట్‌, స్టీల్‌, ఇటుక, ఇసుక, ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌, ఎలక్రికల్స్‌, పెయింట్స్‌.. ఇలా అనేక శాఖలు ఈ రంగంతో అనుబంధం కలిగి ఉంటాయి. వీటన్నింటికీ అండ, ఆధారమూ, తల్లివేరు మాత్రం రియాల్టీ రంగమే. అందువల్ల ఈ సెక్టార్‌లో నష్టాలు మొదలైతే ఆ ప్రభావం అనుబంధ రంగాలపై పడుతుంది. 


కొవిడ్‌- 19 విజృంభణ తర్వాత దేశంలో ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగుళూరు, పుణే, హైదరాబాద్‌లలో రియాల్టీ రంగం స్తబ్దుగా మారింది. లాక్‌డౌన్‌ తర్వాత ఈ రంగానికి అవసరమైన సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ఈ రంగంలో పెట్టుబడులకి బ్రేక్‌పడింది. ఫిబ్రవరి నుంచి ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రంగంలో 60 శాతం పెట్టుబడులు తగ్గిపోయాయి. 


ఫస్ట్‌ క్వార్టర్‌లోనే భారత్‌లో హౌసింగ్‌ సేల్స్‌ 60 శాతం మందగించాయి. ప్రతికూల ఫలితాలు కనిపించడంతో సహజంగానే బిల్డర్స్‌కి లోన్స్‌ ఇవ్వడానికి బ్యాంకులు నో అంటున్నాయి. దీనికితోడు.. భవన నిర్మాణరంగంలో వలస కార్మికుల సంఖ్య అత్యధికం. రూరల్‌ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకి వలస వచ్చి వీరంతా పనిచేస్తుంటారు. దేశంలో లాక్‌డౌన్‌ విధించాక.. వలస కార్మికులంతా సమూహాలు సమూహాలుగా తమ ప్రాంతాలకు తరలిపోయారు.


భారీ వెంచర్లు వేసే సంస్థలు కూడా నీరుగారుతున్నాయి. మార్చి నెల ముందు నుంచి ఈ రంగంలో డ్రాస్టిక్‌గా క్రయవిక్రయాలు తగ్గాయి. హౌసింగ్‌ లోన్స్‌ తీసుకునేవారి సంఖ్య కుదించుకుపోయింది. రెసిడెన్షియల్‌ పర్పస్‌ సేల్స్‌, ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ వంటివి బాగా మందగించాయి. రొటేషన్‌ పడిపోవడంతో నగదు లభ్యత అడుగంటింది. రియాల్టీ సంస్థలు తాము తీసుకున్న సుమారు 5 లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఎలా తీర్చాలో తెలియక దిక్కులు చూస్తున్నాయి.  ఈ ఊబినుంచి ఆయా సంస్థలు బయటపడేదెప్పుడో తెలియడం లేదు. 


నిజానికి హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌కి ఆ మధ్య కొంత హైప్‌ వచ్చింది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికలు, 2019 నాటి సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మనీ రొటేషన్‌ బాగా జరిగింది. దీంతో రియాల్టీ సెక్టార్‌లో పాజిటివ్‌ సిగ్నల్స్‌ స్పష్టంగా కనిపించాయి. అయితే ఆ ప్రభావం ఎక్కువ కాలం కొనసాగలేదు. గత ఏడాది ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించింది. అయినప్పటికీ హౌసింగ్‌ లోన్లు తీసుకునేవారి సంఖ్య ఆశించినంత పెరగలేదు. ఈ తరుణంలో వర్షాకాలం రాకముందే కేంద్రంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రంగానికి ఊతమిచ్చే చర్యలు చేపట్టడం అవసరం! దేశ ఆర్థిక వ్యవస్థకి మూలాధారమైన నిర్మాణరంగం కరోనా కాటుతో కుదేలయ్యిందనీ, వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టడం అవసరమనీ ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ అయిన కేపీఎంజీ కూడా అభిప్రాయపడింది.  


రియాల్టీ కంపెనీల ఆర్థిక కష్టాలు తీర్చడం కోసం గతంలో కేంద్రప్రభుత్వం పదివేల కోట్లతో ఒక నిధిని ఏర్పాటుచేసింది. పెద్దపెద్ద రియాల్టీ సంస్థలు తాము చేపట్టిన వెంచర్లు ఆర్థిక కష్టాల వల్ల ఆగిపోతే.. ఈ నిధి నుంచి రుణం పొందవచ్చు. అయితే అప్రూవ్‌డ్‌ ప్రాజెక్టులకి మాత్రమే ఈ సాయం అందుతుంది. అలాగే నేషనల్‌ హౌసింగ్‌ బోర్డు వద్ద కూడా పదివేల కోట్ల రూపాయల నిధి ఉంది. దీనితోపాటు ఈ రంగాన్ని ఆదుకోవాలంటూ నాన్‌బ్యాంకింగ్‌ సంస్థలను కేంద్రప్రభుత్వం ఏనాడో కోరింది. ఇన్ని రక్షణ కవచాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత కరోనా కొట్టిన దెబ్బ నుంచి తేరుకోవడం కష్టమేనని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. 


తమని అన్ని రకాలుగా ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటుచేయాలనీ, తమకిచ్చే లోన్స్‌ విషయంలో లిబరల్‌గా వ్యవహరించాలనీ రియాల్టీ రంగ పెద్దలు కోరుతున్నారు. అదే విధంగా లాక్‌డౌన్‌ వల్ల రోడ్డునపడిన తమను ఆదుకోవాలని భవన నిర్మాణరంగ కార్మికులు కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. 


కరోనా గ్రహణం వీడిన తర్వాత రియాల్టీ రంగం పూర్తిగా కోలుకోవాలంటే చాలా కాలం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా వెంటనే పనులేవీ పుంజుకునే పరిస్థితి లేదు. పని సంబంధాలు పూర్వస్థితికి ఎప్పుడొస్తాయో అంచనాకి అందడం లేదు. తమ సొంతూళ్లకి తిరుగు వలస పోయిన కార్మికులంతా పూర్తిస్థాయిలో మళ్లీ నగర బాట పడతారా అన్నది సందేహమే. అందువల్ల భవన నిర్మాణ రంగంలో నిపుణుల కొరత, మానవ వనరుల కొరత ఏర్పడవచ్చునని అంటున్నారు. మరి ఈ పరస్థితులన్నీ ఎప్పటికి చక్కబడతాయో వేచిచూద్దాం. 


చివరిగా ఓ ఆసక్తికర అంశాన్ని చెప్పుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో హౌసింగ్‌ ప్రైజ్‌ 20 శాతం వరకూ తగ్గవచ్చట. ఈ పరిణామం ఇళ్లు కొనాలనుకునేవారికి ప్లస్‌ అవుతుందట. ఈ మాట చెప్పింది హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌  ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌. అంత పెద్దాయన చెప్పారంటే అది జరిగే పనే కావచ్చు. అంటే బడుగుజీవి సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఇదే మంచి తరుణం! సో..  కరోనా పాజిటివ్‌లో ఇదొక కొత్త కోణం అన్న మాట!

Updated Date - 2020-04-29T22:30:23+05:30 IST