లాక్‌డౌన్-3పై మంత్రులతో మోదీ కీలక మంతనాలు

ABN , First Publish Date - 2020-05-01T19:05:06+05:30 IST

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ కొనసాగించాలా...

లాక్‌డౌన్-3పై మంత్రులతో మోదీ కీలక మంతనాలు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనే విషయంపై చర్చించారు. సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. లాక్‌డౌన్ కొనసాగిస్తే వచ్చే ఆర్ధికపరమైన ఇబ్బందులను అధిగమించగలిగే చర్యలపై మోదీ మంత్రులతో, అధికారులతో చర్చించారు.


లాక్‌డౌన్ కొనసాగించే ఉద్దేశంతోటే వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు 12 వందల మందితో ప్రత్యేక రైలు బయలుదేరింది. మిగతా రాష్ట్రాలు కూడా రైళ్లు లేదా బస్సుల ద్వారా తమ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను పిలిపించుకుంటున్నాయి. 


తొలి విడత లాక్‌డౌన్ ఏప్రిల్ 24నుంచి ఏప్రిల్ 14 వరకూ కొనసాగింది. రెండో దశ మే 3 వరకూ కొనసాగనుంది. ఆయా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు మెజారిటీ సీఎంలు లాక్‌డౌన్ కొనసాగించాలని సూచించారు. పంజాబ్ అయితే ఏకంగా మే 17 వరకూ లాక్‌డౌన్ పొడిగించింది. ఈ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించే సమయంలో లాక్‌డౌన్ కొనసాగింపుపై ప్రధాని నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. అదే సమయంలో కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


దేశంలో కరోనా కేసుల సంఖ్య 35043కు చేరింది. 1147 మంది చనిపోయారు.       

Updated Date - 2020-05-01T19:05:06+05:30 IST