‘ప్రధాని’ వాంఛ తీరని ప్రణబ్

ABN , First Publish Date - 2020-09-01T08:31:29+05:30 IST

ప్రధాని కావాలన్నది ప్రణబ్‌ చిరకాల వాంఛ. మూడు సార్లు చేజారింది. మొదటి సారి ఇందిర హత్యానంతరం, రెండోసారి రాజీవ్‌ హత్యానంతరం.. మూడోసారి 2009లో మన్మోహన్‌సింగ్‌ రెండో టర్మ్‌ సమయంలో! తన అభిలాషను ఆయన పరోక్షంగా కాంగ్రెస్‌ నాయకత్వానికి తెలియపరచినా లాభం లేకపోయింది...

‘ప్రధాని’ వాంఛ తీరని ప్రణబ్

ప్రధాని కావాలన్నది ప్రణబ్‌ చిరకాల వాంఛ. మూడు సార్లు చేజారింది. మొదటి సారి ఇందిర హత్యానంతరం, రెండోసారి రాజీవ్‌ హత్యానంతరం.. మూడోసారి 2009లో మన్మోహన్‌సింగ్‌ రెండో టర్మ్‌ సమయంలో! తన అభిలాషను ఆయన పరోక్షంగా కాంగ్రెస్‌ నాయకత్వానికి తెలియపరచినా లాభం లేకపోయింది.


ఎంత దగ్గరో అంత దూరం

1998లో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సీతారాం కేసరి ఉండేవారు. 1996 ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) పదవిని అట్టిపెట్టుకుని అధ్యక్షుడిగా వైదొలిగారు. ఆ స్థానంలో కేసరి బాధ్యతలు చేపట్టారు. తర్వాత సీపీపీ పదవినీ తీసుకున్నారు. అయితే ఆయన వ్యవహార శైలి కారణంగా మమతా బెనర్జీ వంటి ప్రజాకర్షక నేతలు కాంగ్రె్‌సకు దూరమయ్యారు. దాంతో పార్టీ పగ్గాలు చేపట్టాలని నేతలంతా సోనియాగాంధీపై ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. ఇందులో ప్రణబ్‌ ముఖర్జీదే కీలక పాత్ర. ఆమెకు రాజకీయంగా అన్ని విధాలా ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సంక్షోభ పరిష్కర్తగా కీలక బాధ్యత పోషించినా.. ప్రధాని పదవి దగ్గరకు వచ్చేసరికి సోనియా దూరంగానే ఉంచారు. అనూహ్యంగా మన్మోహన్‌ను ప్రధానిని చేశారు. 2009లో కూడా అదే పునరావృతమైంది. పార్టీపరంగా, ప్రభుత్వపరంగా అందరి తలలో నాల్కలా వ్యవహరించినా సోనియా ఆయన్ను సంపూర్ణంగా విశ్వసించలేదని కొందరు కాంగ్రెస్‌ నేతలు అంటారు. రాజీవ్‌పై తిరుగుబాటుచేసి సొంత పార్టీ పెట్టుకున్న ఆయన.. తన నాయకత్వానికి ఎసరు తీసుకురావచ్చన్న అనుమానం ఆమెలో ఎక్కడో ఉందని.. అందుకే సమర్థుడైనా ఆయనకు ప్రధాని పదవిని కట్టబెట్టలేదని చెబుతారు. అయితే 2012లో రాష్ట్రపతి పదవిని ఆయనకు కట్టబెట్టి సోనియా కొంతలో కొంత ఊరటనిచ్చారు.


ప్రధాని పదవికి నన్నే ఎంపిక చేస్తారని..

‘2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తర్వాత.. ప్రధాని పదవిని సోనియాగాంధీ తిరస్కరించడంతో నాకే అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు. ప్రభుత్వంలో నాకు అపార అనుభవం ఉంది. మన్మోహన్‌ సివిల్‌ సర్వెంట్‌. ఐదేళ్లు ఆర్థిక సంస్కరణల మంత్రిగా ఉన్నారు. మన్మోహన్‌ను రాష్ట్రపతి పదవికి సోనియాగాంధీ ఎంపిక చేస్తే.. ప్రధాని పదవికి నన్ను ఎంపిక చేస్తారని నేను కూడా అనుకున్నాను. కౌశాంబి హిల్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. ఈ ఫార్ములాపై తీవ్రంగా చర్చిస్తున్నారన్న వదంతి కూడా నేను విన్నాను. అయితే మన్మోహన్‌ కేబినెట్‌లో చేరేందుకు నాకు ఇష్టం లేదనేది వాస్తవం. ఇదే విషయాన్ని సోనియాకు తెలియజేశాను. అయితే ప్రభుత్వం నడవడానికి కీలకం కాబట్టి ప్రభుత్వంలో చేరాల్సిందేనని ఆమె నాపై ఒత్తిడి తెచ్చారు.’

(ప్రణబ్ రాసిన పుస్తకం 'ది కొయిలేషన్‌ ఇయర్స్‌' నుంచి..)




రాజకీయంగా చీకటి కాలం

1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం.. ప్రణబ్‌ ప్రధాని అవుతారని అందరూ అనుకున్నారు. కానీ రాజీవ్‌ ప్రధాని అయ్యారు. ప్రణబ్‌ను మాత్రం కేబినెట్‌లోకి తీసుకోలేదు. ఇందిర హయాంలో కీలకంగా వ్యవహరించిన ఆయనపై కొందరు కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌కు చెడుగా చెప్పారు. దాంతో ఆయన్ను దూరం పెట్టి.. నలుగురు బెంగాల్‌ నేతలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. కొన్నాళ్ల తర్వాత బెంగాల్‌ పీసీసీకి ప్రణబ్‌ను అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నెపంతో సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటనలు ఆయన్ను బాగా బాధించాయి. దరిమిలా 1987లో రాష్ట్రీయ సమాజ్‌వాది కాంగ్రెస్‌ పార్టీ పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. అదే ఏడాది బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది.


తిరిగి రాజీవ్‌తో సయోధ్య కుదుర్చుకున్నారు. మరుసటి ఏడాది త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ తరపున ఎన్నికల బాధ్యతలు నిర్వహించడానికి ప్రణబ్‌ కరెక్టని రాజీవ్‌కు ఆయన సన్నిహితులే చెప్పారు. దీంతో ఆయన్ను అక్కడకు పంపారు. త్రిపురలో కాంగ్రెస్‌ సంకీర్ణం గెలిచింది. దరిమిలా కాంగ్రె్‌సలోకి ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఇందిర హయాంలో పార్టీలో నంబర్‌ టూగా చలామణి ఆయన తాను.. మళ్లీ సాధారణ కార్యకర్తగా జీవితం మొదలుపెట్టానని ఆయన ఓ సందర్భంలో చెప్పారు.


మళ్లీ వెలుగులోకి..

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మళ్లీ ప్రణబ్‌ ప్రభ సాగింది. పీవీ తన ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ను తీసుకుని.. ప్రణబ్‌ను ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. 1995లో విదేశాంగ మంత్రిని చేశారు. తర్వాతికాలంలో ప్రణబ్‌ సోనియాగాంధీకి విశ్వాసపాత్రుడయ్యారు. ఆమెను 1998లో పార్టీ అధ్యక్షురాలిని చేయడంలో కీలకంగా వ్యవహరించారు.  2004లో ప్రణబ్‌ తొలిసారి జంగీపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మన్మోహన్‌ కేబినెట్‌లో నంబర్‌టూ అయ్యారు. 2012 వరకు లోక్‌సభ నాయకుడిగా వ్యవహరించారు. 2004-06 మధ్య రక్షణ, 2006-09 మధ్య విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2009 నుంచి 12 వరకు అంటే.. రాష్ట్రపతి పదవికి యూపీఏ అభ్యర్థిగా ప్రకటించేవరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షాల అభ్యర్థి పీఏ సంగ్మాను ఓడించి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 


ఒకే ఒక్క కీలక మంత్రి..

పీవీ, మన్మోహన్‌ హయాంలో ప్రణబ్‌ది కీలక పాత్ర. సంక్షోభ పరిష్కర్త. ప్రతి కేబినెట్‌ సంఘానికీ ఆయనే చైర్మన్‌. మన్మోహన్‌ జమానాలో ఆయన మంత్రిగా ఉన్న ఎనిమిదేళ్లలో 42 కేబినెట్‌ సంఘాలకు సారథ్యం వహించడం విశేషం, సన్నిహితులతా ఆయన్ను గోమ్‌ (గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌-జీవోఎం) అని పిలుచుకునేవారు.


తెలంగాణ కమిటీకి కూడా! 

తెలంగాణ ఏర్పాటు విషయమై ఏర్పాటుచేసిన మంత్రివర్గ కమిటీకి కూడా ప్రణబ్‌ ముఖర్జీయే నేతృత్వం. ఫలానా తేదీలోగా తెలంగాణ విషయమై ప్రకటించి తీరాలని కేసీఆర్‌ డెడ్‌లైన్‌ విధించినప్పుడు.. ‘నాకెవరూ డెడ్‌లైన్లు పెట్టలేరు.. హెడ్‌లైన్లూ సూచించలేరు. నేనెప్పుడు నిర్ణయం తీసుకోవాలో అప్పుడే తీసుకుంటా.. ఇది డెడ్‌లైన్లకు సంబంధించిన అంశం కాదు’ అని ప్రణబ్‌ నిష్కర్షగా తేల్చిచెప్పారు.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-09-01T08:31:29+05:30 IST