పీఎం కాలేదు... పీకేఎంగానే మిగిలారు

ABN , First Publish Date - 2020-09-01T07:14:33+05:30 IST

ప్రణబ్‌ ముఖర్జీకి రెండు సార్లు ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది. 1984లో ఆయన తన మనసులో అనుకున్నారు.. రెండోసారి 2009లో వాస్తవ జీవితంలో ఆ పదవి అందినట్లే అంది చేజారింది. ఫలితంగా ఆయన ఎన్నటికీ పీఎం (ప్రధానమంత్రి) కాలేకపోయారు. పీకేఎం (ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ)గానే మిగిలిపోయారు. రాజీవ్‌గాంధీ ఆయన్ను ‘పీకేఎం’ అనే పిలిచేవారు...

పీఎం కాలేదు... పీకేఎంగానే మిగిలారు

ప్రణబ్‌ ముఖర్జీకి రెండు సార్లు ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం వచ్చింది. 1984లో ఆయన తన మనసులో అనుకున్నారు.. రెండోసారి 2009లో వాస్తవ జీవితంలో ఆ పదవి అందినట్లే అంది చేజారింది. ఫలితంగా ఆయన ఎన్నటికీ పీఎం (ప్రధానమంత్రి) కాలేకపోయారు. పీకేఎం (ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ)గానే మిగిలిపోయారు. రాజీవ్‌గాంధీ ఆయన్ను ‘పీకేఎం’ అనే పిలిచేవారు. ఇందిరాగాంధీ 1980లో ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఆయన రాజకీయ దిశ తిరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన సామర్థ్యాన్ని గమనించిన ఆమె.. రాజకీయంగానూ ఆయన సలహాలకు విలువివ్వడం మొదలుపెట్టారు.


వెక్కివెక్కి ఏడ్చారు...

 1984 అక్టోబరు 31న ఇందిరపై కాల్పులు జరిగినప్పుడు ప్రణబ్‌ కోల్‌కతాలో ఉన్నారు. కాకతాళీయంగా రాజీవ్‌గాంధీ సైతం అక్కడే ఉన్నారు. రాజీవ్‌, ప్రణబ్‌, ఇతరులను ఢిల్లీ తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. అప్పటికి ప్రధానిపై కాల్పులు జరిపారని.. ఎయిమ్స్‌లో ఆమె ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని మాత్రమే ప్రపంచానికి తెలుసు. రాజీవ్‌, ఆయన బృందం విమానంలో ప్రణబ్‌కు కొంత దూరంగా కూర్చున్నారు. (ఈ విషయాన్ని ప్రణబ్‌ స్వయంగా నాకు చెప్పారు.) ప్రణబ్‌ ఒంటరిగా కూర్చుని.. తన గురువైన ఇందిర గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆ సమయంలో రాజీవ్‌ను కాక్‌పిట్‌లోకి పిలిచారు. ఆయన తిరిగొచ్చి.. ఆమె ఇక లేరు అని ప్రకటించారు. రాజీవ్‌ తనను తాను తమాయించుకున్నా.. ప్రణబ్‌ మాత్రం ఒక్కసారిగా ఏడ్చేశారు. వెక్కివెక్కి ఏడ్వడం విమానంలో అందరికీ వినిపించింది. తర్వాత ఆయన తేరుకున్నారు. ఇందిర చనిపోయినా.. తర్వాతి ప్రధాని బాధ్యతలు చేపట్టేదాకా పరిపాలన కొనసాగాల్సి ఉందని గ్రహించారు. వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లారు.


పైలట్‌ రేడియో నుంచి ఓ సందేశం పంపారు. త్రివిధ దళాధిపతులు కేబినెట్‌ కార్యదర్శితో పాటు తనను కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు రావాలని సూచించారు. ఇది తాను ప్రభుత్వపరంగా చేపట్టిన వాస్తవిక చర్యని ప్రణబ్‌ చెప్పారు. ప్రధాని హత్యకు గురయ్యారు. ప్రణబ్‌ కేబినెట్‌లో నంబర్‌టూగా ఉన్నారు. కొత్త ప్రధాని వచ్చేదాకా ప్రభుత్వాన్ని నడిపే బాఽధ్యత ఆయనదే. గతంలో కూడా జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి చనిపోయినప్పుడు గుల్జారీలాల్‌ నందా రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ప్రణబ్‌ చేపట్టిన ఈ చర్య దరిదాపుగా ఆయన రాజకీయ భవిష్యత్‌ను దెబ్బతీసింది. ఎయిర్‌పోర్టుకు అధికారులంతా ప్రణబ్‌ నుంచి (ప్రధానిగా) ఆదేశాలు తీసుకోవడానికే వచ్చారని రాజీవ్‌, ఆయన సన్నిహితులు భావించారు. ప్రణబ్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టబోతున్నారేమోనని విస్మయం చెందారు. నిజానికి అప్పటికే రాజీవ్‌ గ్యాంగ్‌తో.. ముఖ్యంగా అరుణ్‌ నెహ్రూతో ఆయనకు సత్సంబంధాలు లేవు. అందుచేత ఏం జరగబోతోందో ప్రణబ్‌కు తెలుసు. రాజీవ్‌ ప్రధానిగా ప్రమాణం చేయగానే చిన్న కేబినెట్‌ ఏర్పాటుచేశారు. అందులో ప్రణబ్‌కు చోటు దక్కలేదు. అనంతరం జరిగిన ఎన్నికల్లో రాజీవ్‌ అఖండ మెజారిటీతో ప్రధాని అయ్యారు. మీరిక ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదని ప్రణబ్‌కు చెప్పించారు. బెంగాల్‌కు పంపించి.. వేరే సాకులతో బహిష్కరింపజేశారు. నాలుగేళ్ల తర్వాత.. రాజీవ్‌కు తన గ్యాంగ్‌లోని చాలామందితో పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. మళ్లీ ‘పీకేఎం’ గుర్తుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆర్థిక వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను రాజీవ్‌ ఆయనకు అప్పగించారు. 1991 ఎన్నికల్లో రాజీవ్‌ గనుక ప్రధాని అయిఉంటే ప్రణబ్‌ కచ్చితంగా మళ్లీ ఆర్థిక మంత్రి అయ్యేవారు.



మన్మోహన్‌తో అభిప్రాయ భేదాలు..

ప్రణబ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్‌బీఐ గవర్నర్‌గా మన్మోహన్‌ ఉండేవారు. 2004లో మన్మోహన్‌ ప్రధాని అయినప్పుడు ఆయన కింద పనిచేయడం మీకెలా అనిపించిందని ప్రణబ్‌ను అడిగితే ఆయన నవ్వేఽశారు. ఎలాంటి విభేదాలు రాకుండా ఇద్దరూ చూసుకున్నారు. అయితే అమెరికాతో అణు ఒప్పందం విషయంలో మాత్రం వీరికి అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. ఈ ఒప్పందం ఆమోదం పొందాలని.. ఆమోదముద్ర పడకపోతే తన ప్రభుత్వం కూలిపోవడమే మంచిదని మన్మోహన్‌ వాదించారు. ఆ ఒప్పందాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటి మద్దతుతోనే యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. వామపక్షాలతో కామన్‌ ఎజెండాను కుదుర్చుకున్నప్పుడు అణు ఒప్పందం లేదని.. దీనిని ఆమోదించకుండా అవి తనను వంచించాయని మన్మోహన్‌ ఎలా అంటారని ప్రణబ్‌ ప్రశ్నించారు. 2009లో ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్‌ 2004లో వచ్చినన్ని స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని.. వామపక్షాల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు.


మన్మోహన్‌ను ప్రధానిగా లెఫ్ట్‌ పార్టీలు అంగీకరించవని.. వాటి మద్దతుతో తిరిగి ప్రధాని పీఠమెక్కేందుకు ఆయనా ఒప్పుకోరని అనుకున్నారు. అయితే మన్మోహన్‌ కాకుండా ప్రణబ్‌ ముఖర్జీ సారథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే వామపక్షాలు మద్దతిస్తాయని భావించారు. మన్మోహన్‌ రాష్ట్రపతి పదవి చేపడతారని అనుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 200కిపైగా స్థానాలు సంపాదించింది. వామపక్షాల మద్దతు దానికి అవసరం లేకపోయింది. మన్మోహన్‌ తిరిగి ప్రధాని అయ్యారు. కానీ ప్రణబ్‌ రాష్ట్రపతి పదవి చేపట్టారు. అయితే ప్రణబ్‌నే ప్రధాని పదవికి ఎంపిక చేసి ఉండాల్సింది. ఆయనైతే యూపీఏ-2 ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడిపిఉండేవారు. మన్మోహన్‌ నానా కంగాళీ చేశారు. ప్రణబ్‌ మరణంతో వర్తమాన రాజకీయ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. 20, 21వ శతాబ్దాల్లో సుదీర్ఘ రాజకీయ జీవితం సాగించిన సమర్థ రాజకీయ నేతల్లో ఆయనొకరు. కానీ దేశానికి. తనకు ప్రధానమంత్రి కాలేకపోవడం దయనీయం. తుది శ్వాస వరకు ‘పీకేఎం’గానే ఉండిపోయారు.


Updated Date - 2020-09-01T07:14:33+05:30 IST