అన్నార్తులకు కొండంత అండ.. ఈ టీనేజ్ సిస్టర్స్..

ABN , First Publish Date - 2020-04-29T19:02:57+05:30 IST

కరోనా కల్లోలం నేపథ్యంలో అన్నార్తులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా అనేకమంది మానవత్వం చాటుకుంటున్న వేళ..

అన్నార్తులకు కొండంత అండ.. ఈ టీనేజ్ సిస్టర్స్..

 భువనేశ్వర్: కరోనా కల్లోలం నేపథ్యంలో అన్నార్తులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా అనేకమంది మానవత్వం చాటుకుంటున్న వేళ.. కటక్‌కి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సైతం తమవంతు సాయం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కరోనా భయంతో అందరూ ఇళ్లకే పరిమితం కాగా... వీళ్లు మాత్రం నగరంలోని సీడీఏ ప్రాంతంలో ప్రతిరోజూ పేదల ఆకలి తీరుస్తున్నారు. బిజయలక్ష్మి మొహరానా (17), బైద్యలక్ష్మి (15) ఇద్దరూ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారైనప్పటికీ.. ఇంటింటికీ తిరిగి ఆహారం సేకరించి అవసరతలో ఉన్నవారికి పంచిపెడుతున్నారు. వాస్తవానికి వీరి కుటుంబం కూడా కరోనా లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. బాలికల తండ్రి బిజయ్ మొహరానా వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ‘‘ఆకలితో పస్తులుంటున్న పేదవారికి ఏదోవిధంగా సాయం చేయాలని మేము సంకల్పించాం. దాదాపు నెల రోజుల నుంచి మా తండ్రి కూడా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలు పడుతున్న ఇబ్బందులు ఎలా ఉంటాయో మాకు ప్రత్యక్షంగా తెలుసుకాబట్టి మేము కూడా మా వంతు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం..’’ అని ప్లస్-3 విద్యార్ధిని బిజయలక్ష్మి పేర్కొంది. సీడీఏ ప్రాంతంలోని ప్రజలను కలుసుకుని పేదల కోసం రోటీలు, బియ్యం, కూరగాయలు, పండ్లు డొనేట్ చేయాలని అడుగుతున్నామనీ.. అందుకు వారంతా అంగీకరిస్తున్నారని ఆమె తెలిపింది.


రెండు వారాలుగా 65 గృహాల నుంచి ఆహార పదార్ధాలు సేకరించి పేదలకు పంచుతున్నట్టు బిజయలక్ష్మి వెల్లడించింది. ఒకవేళ సరిపడా ఆహారం సమకూరక పోతే తామే ఇంట్లో ఆహారం వండి అన్నార్తులకు పంపిణీ చేస్తున్నామని వివరించింది. ఈ కార్యక్రమం కోసం దాతలతో కలిసి వాట్సాప్‌లో ఓ గ్రూప్ ఏర్పాటు చేశామనీ.. తద్వారా వారి బంధువుల నుంచి కూడా విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఈ ఇద్దరి అక్కాచెల్లెళ్ల సంకల్పం కారణంగా కటక్‌లోని దర్గా బజార్ చక్‌లో రోజూ 400 నుంచి 500 మందికి పేద ప్రజలకు ఆహారం అందుతుండడం విశేషం. వీరి కృషిని స్థానిక అధికారులు సైతం మెచ్చుకోవడంతో పాటు సజావుగా ఆహార పంపిణీ జరిగేందుకు సహకరిస్తున్నారు. ‘‘ఈ అక్కాచెల్లెళ్ల గొప్ప మనసును ప్రశంసిస్తున్నాం. ఆహారం పంపిణీ సందర్భంగా అందరూ సమాజిక దూరం పాటించేలా మా సిబ్బంది కూడా సహకరిస్తున్నారు..’’ అని కటక్ డీసీపీ అఖిలేశ్వర్ సింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-29T19:02:57+05:30 IST