మీ భోజనం మాకు అక్కర్లేదు: రైతులు

ABN , First Publish Date - 2020-12-04T08:08:36+05:30 IST

ప్రభుత్వంతో మలిధఫా చర్చలకు విజ్ఞాన్‌భవన్‌కు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం ఇచ్చే మధ్యాహ్న భోజనాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. తమ కోసం సహచరులు వండి పంపిన భోజనమే చేస్తానని స్పష్టం చేశారు. లంచ్‌ విరామ సమయానికి రైతుల కోసం సరిహద్దు పాయింట్ల నుంచి ఓ ప్రత్యేక వాహనంలో వచ్చిన లాంగర్‌

మీ భోజనం మాకు అక్కర్లేదు: రైతులు

తాము తెచ్చుకున్న భోజనంతో లంచ్‌


న్యూఢిల్లీ/చండీగఢ్‌, డిసెంబరు 3: ప్రభుత్వంతో మలిధఫా చర్చలకు విజ్ఞాన్‌భవన్‌కు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం ఇచ్చే మధ్యాహ్న భోజనాన్ని తీసుకునేందుకు నిరాకరించారు. తమ కోసం సహచరులు వండి పంపిన భోజనమే చేస్తానని స్పష్టం చేశారు. లంచ్‌ విరామ సమయానికి రైతుల కోసం సరిహద్దు పాయింట్ల నుంచి ఓ ప్రత్యేక వాహనంలో వచ్చిన లాంగర్‌ (అంటే సామూహికంగా వండి వడ్డించే భోజనం)ను వారు కలిసి చేశారు. విజ్ఞాన్‌భవన్‌లోని ఓ గదిలో ఓ టేబుల్‌ వద్ద కూర్చుని వారు హడావిడిగా లంచ్‌ చేయడం కనిపించింది. కొందరు రైతులైతే నేలమీదే కూర్చుని చేశారు. ప్రభుత్వానికి తామే అన్నం పెడతామని, తమ నోటి దగ్గర కూడు లాక్కోకుంటే అదే చాలని ఓ రైతు నేత వ్యాఖ్యానించాడు.


పద్మవిభూషణ్‌ను వాపస్‌ ఇచ్చిన బాదల్‌

కేంద్రం నల్లచట్టాలు చేసి రైతులకు ద్రోహం చేసిందని ఆరోపిస్తూ పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్‌ అగ్రనేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ తనకిచ్చిన పద్మవిభూషణ్‌ అవార్డును వెనక్కి తిరిగి ఇచ్చేశారు. నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది అంటే 2015లో బాదల్‌కు దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ను ఇచ్చారు. ప్రజల వల్లే అందునా సామాన్యుడైన రైతు వల్లే నేనిపుడీ స్థితిలో ఉన్నాను. ఇపుడా రైతు తన గౌరవాన్ని కోల్పోయాడు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల నడిరోడ్డుపై నిలుచుని ఉన్నాడు. ఇంకా నేనీ పద్మవిభూషణ్‌ గౌరవాన్ని అట్టేపెట్టుకోవడంలో అర్థం లేదు’ అని బాదల్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.


అటు అకాలీ రెబెల్‌ నేత సుఖ్‌దేవ్‌సింగ్‌ ధిండ్సా కూడా కేంద్రం తనకిచ్చిన పద్మభూషణ్‌ అవార్డును వెనక్కిచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనకు కేంద్రం నిరుడీ అవార్డిచ్చింది. కాగా, సాగు చట్టాలతో పాటు ఈ ఏడాదే చేసిన విద్యుత్‌ సవరణ చట్టాన్ని కూడా కేంద్రం రద్దు చేయాలని అఖిల భారత విద్యుత్‌ ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్‌) డిమాండ్‌ చేసింది. కాగా, ఢిల్లీకి ఆందోళన నిమిత్తం వచ్చి మరణించిన ఇద్దరు రైతుల కుటుంబాలకు పంజాబ్‌ ప్రభుత్వం చెరో రూ.ఐదు లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. రైతు చట్టాల రద్దు కోసం పార్లమెంట్‌ను తక్షణం సమావేశపర్చాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. 

Updated Date - 2020-12-04T08:08:36+05:30 IST