10,00,000.. మహమ్మారిపై మిలియన్ గెలుపు

ABN , First Publish Date - 2020-05-01T07:05:54+05:30 IST

గ్లాసులో సగం నీళ్లున్నాయి... అంటే ఆశావాదం! సగం గ్లాసు ఖాళీగా ఉంది.. అంటే నిరాశావాదం!! సత్యం ఒక్కటే. చూసేవాళ్ల ఆలోచనల్లోనే తేడా. కరోనాకూ అదే వర్తిస్తుంది!! నిజమే.. ఇది మునుపెన్నడూ ఎరగని సంక్షోభమే...

10,00,000.. మహమ్మారిపై మిలియన్ గెలుపు

  • ప్రపంచవ్యాప్తంగా కోలుకున్న పది లక్షల మంది
  • ప్రస్తుత యాక్టివ్‌ కేసులు 20 లక్షలు
  • వారిలో 19.45 లక్షల మందిలో
  • కనిపిస్తున్నది కొద్దిపాటి లక్షణాలే
  • విషమస్థితిలో ఉన్నవారు 54 వేలు
  • మృతుల సంఖ్య ప్రపంచ సగటు 7శాతం
  • మనదేశంలో ఆ సగటు 3.2 శాతమే
  • భారత్‌లో కోలుకుంటున్న రేటు 25శాతం
  • కేసుల రెట్టింపు వేగం 11 రోజులు
  • భయంతో కాదు.. బాధ్యతతో మెలగాల్సిన సమయమిది


గ్లాసులో సగం నీళ్లున్నాయి... అంటే ఆశావాదం! సగం గ్లాసు ఖాళీగా ఉంది.. అంటే నిరాశావాదం!! సత్యం ఒక్కటే. చూసేవాళ్ల ఆలోచనల్లోనే తేడా. కరోనాకూ అదే వర్తిస్తుంది!! నిజమే.. ఇది మునుపెన్నడూ ఎరగని సంక్షోభమే!! ఆ వైరస్‌ బారిన పడి 2 లక్షల మరణించిన మాటా నిజమే. కానీ.. అదే వైరస్‌ బారిన పడిన 3 మిలియన్ల జనాభాలో 10 లక్షల మంది.. అక్షరాలా పది లక్షల (దాదాపు మూడో వంతు) మంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు! ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి యాక్టివ్‌ కేసుల సంఖ్య దాదాపు 20 లక్షలుగా ఉంది.


ఆ 20 లక్షల మందిలో కూడా, కొద్దిపాటి లక్షణాలున్నవారు 19.45 లక్షల మంది అని.. ఆరోగ్యం ఆందోళనకరంగా/ విషమస్థితిలో ఉన్నవారి సంఖ్య 54 వేలు అని ‘వరల్డోమీటర్‌’ గణాంకాలు చెబుతున్నాయి. ఆ 19 లక్షల మంది కూడా మున్ముందు కోలుకునే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే వైరస్‌ సోకిన అందరిలోనూ లక్షణాలు కనిపించట్లేదు. పరీక్షలు చేస్తేనే వారు వైరస్‌ బారిన పడినట్లు తేలుతోంది. మరికొందరిలో కొద్దిపాటి లక్షణాలు మాత్రమే బయటపడుతున్నాయి. వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, అజిత్రోమైసిన్‌, జింక్‌ వంటి ఔషధాలతో చికిత్స చేస్తే కోలుకుంటున్నారు. మరికొందరు ప్లాస్మా థెరపీ వంటివాటితో బయటపడుతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే వెంటిలేటర్‌ దశవరకూ వెళ్తున్నారు. అందుకే కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉంటోంది. అంకెల్లో చెప్పాలంటే.. ఇప్పటిదాకా వైరస్‌ బారిన పడిన 30 లక్షల మందిలో మృతుల సంఖ్య కేవలం 2.28 లక్షలు! అంటే.. కొంచెం అటూ ఇటుగా 7 శాతం. ఆ మరణాల్లో కూడా ఎక్కువ శాతానికి కారణం.. కొన్ని దేశాలు మొదట్లో చూపించిన నిర్లక్ష్యమే. లేకుంటే ఆ సంఖ్య ఇంకా తక్కువగా ఉండేది. హెర్డ్‌ ఇమ్యూనిటీ పేరుతో యూకే.. చైనా నుంచి పెద్ద ఎత్తున విమానాల్లో వస్తున్నవారిని అడ్డుకోక అమెరికా.. చైనీయులకు మద్దతుగా ‘హగ్‌ ఏ చైనీస్‌’ వంటి క్యాంపెయిన్లు నిర్వహించి ఇటలీ.. ఇలా ఆయా దేశాలు తొలినాళ్లలో చేసిన తప్పిదాలవల్లే అంతమంది విలువైన ప్రాణాలు పోయాయి. ముందే జాగ్రత్త పడి కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌ వంటి దేశాలు, పటిష్ఠమైన ట్రాకింగ్‌, ట్రేసింగ్‌ టెస్టింగ్‌ విధానాలతో దక్షిణ కొరియా వంటి దేశాలు.. వైరస్‌ వ్యాపించే వేగాన్ని గణనీయంగా అడ్డుకోగలిగాయి. ఇది గణాంకాలు చెబుతున్న మాట. అంతెందుకు.. యూర్‌పలోనే నార్వే, డెన్మార్క్‌ వంటి దేశాలు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగాయి. ఇప్పుడు లాక్‌డౌన్‌ అంక్షలను సైతం దశలవారీగా ఎత్తేసే ప్రయత్నాల్లో ఉన్నాయి.


మనదేశంలో.. రాష్ట్రంలో..

భారత్‌లో కొవిడ్‌-19 బారిన పడినవారు కోలుకుంటున్నవారి సగటు గురువారం ఉదయం 8 గంటల సమయానికి.. 25.19 శాతంగా ఉండగా.. మరణిస్తున్నవారి సంఖ్య 3.2 శాతంగా ఉందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. సాయంత్రానికి వెల్లడైన గణాంకాల ప్రకారం చూస్తే... మనదేశంలో 33,610 మందికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. 8373 మంది (24.91శాతం) కోలుకున్నారు. 1075 మంది (3.19శాతం) మరణించారు. మృతుల్లో 65శాతం మంది మగవారు కాగా.. మహిళలు కేవలం 35 శాతం మంది మాత్రమే ఉండడం గమనార్హం. కాగా.. లాక్‌డౌన్‌కు ముందు మనదేశంలో ప్రతి 3.4 రోజులకూ కేసుల సంఖ్య రెట్టింపు కాగా.. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ఆ వేగం బాగా తగ్గింది. కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 11 రోజులు పడుతోంది. ఇక తెలంగాణలో కూడా కేసుల సంఖ్య కొద్దిరోజులుగా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. మర్కజ్‌కు వెళ్లొచ్చినవారిని, వారి కాంటాక్టులను గుర్తించడం ఫలితానిచ్చింది. కొద్దిరోజులుగా కొత్త కేసుల కన్నా.. డిశ్చార్జ్‌ అవుతున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇవన్నీ ప్రజలకు భరోసానిచ్చేవేనని.. కొవిడ్‌-19 గురించి భయపడకుండా.. భౌతిక దూరం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరిస్తే చాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.


- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-05-01T07:05:54+05:30 IST