రక్తంలో రసాయనాలా?

ABN , First Publish Date - 2020-12-12T09:44:12+05:30 IST

‘‘ప్రజలు తాగుతున్న నీటిని ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేయించండి. ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదు. అస్వస్థతకు

రక్తంలో రసాయనాలా?

మూలాలు కచ్చితంగా తెలియాలి: జగన్‌


అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలు తాగుతున్న నీటిని ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేయించండి. ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదు. అస్వస్థతకు గురైన వారి రక్త నమూనాల్లో లెడ్‌, ఆర్గానో క్లోరిన్‌, ఆర్గానో ఫాస్పరస్‌ కనిపిస్తోంది. ఇది ఎలా వచ్చిందన్నది కచ్చితంగా కనిపెట్టాలి’’ అని అధికారులను సీఎం జగన్‌  ఆదేశించారు. ఏలూరు అలజడిపై శుక్రవారం మరోసారి కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏలూరు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే..అస్వస్థత ఎలా వచ్చిందనేది కచ్చితంగా తెలుసుకోవాలని, ఈ కోణంలో అందరూ దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా జగన్‌ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీ వేశామని, ఈ అంశంపై పరీక్షలు చేస్తున్న వివిధ సంస్థలు, ఏజెన్సీలు, నిపుణులను సమన్వయం చేస్తూ కమిటీ ముందడుగు వేయాలని కోరారు. విచ్చలవిడిగా పురుగుమందులు, నిషేధిత పురుగు మందుల వినియోగాన్ని అడ్డుకోవాలనిని చెప్పారు. నిషేధించిన పురుగుమందులు అమ్మితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


మందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తే, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అడ్డుకోగలుగుతామన్నారు. వచ్చే నెలరోజులపాటు ఇదే పనిలో ఉండాలని ఆదేశించారు. ‘‘ప్రస్తుత పరిస్థితికి నీరు కారణమా..? కాదా..? అన్నదానిపై ముందు పూర్తిస్థాయిలో నిర్ధారణలు తీసుకోవాలి. సేంద్రియ పద్ధతుల ద్వారా జరిగే ఉత్పత్తులను ప్రోత్సహించాలి. బియ్యం శాంపిల్స్‌ కూడా తీసుకుని పరీక్షలు చేయించాలి. రసాయన ఎరువులు కూడా వింతవ్యాధికి కావచ్చునని కొంతమంది చెప్తున్నారు. అటువైపుగా కూడా పరిశీలన చేయాలి. ఏ అంశాన్నీ కొట్టిపారేయొద్దు. నిపుణులు వ్యక్తం చేసిన ప్రతి కోణంలోనూ మరింత లోతుగా పరిశీలన, పరిశోధన జరగాలి’ అని ఆదేశించారు. కాగా ఏలూరులో ప్రస్తుత పరిస్థితులను సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ‘‘గురువారం రాత్రి నుంచి ఇద్దరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విజయవాడలో ఎనిమిదిమంది, ఏలూరులో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారంతా డిశ్చార్జ్‌ అయ్యారు. డిశ్చార్జి అయిన వారు తిరిగి ఆస్పత్రులకు వచ్చిన దాఖలాలు లేవు’’ అని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటివరకూ 16 శాంపిల్స్‌ను పరిశీలించామని, తాగునీటి శాంపిళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో లెడ్‌, నికెల్‌ లేవని, మరోసారి పరీక్షలు చేస్తున్నామని ఎయిమ్స్‌ ఢిల్లీ నిపుణులు తెలిపారు. ‘‘ప్రాథమికంగా పాలలో నికెల్‌ కనిపించింది. దీనిపై మరింత పరిశీలన చేస్తున్నాం. ఇక.. బ్లడ్‌ శాంపిల్స్‌లో లెడ్‌, నికెల్‌ కనిపించాయి. యూరిన్‌లో లెడ్‌ కనిపించింది.


పురుగు మందులు కూడా ఈ పరిస్థితికి  కారణం కావొచ్చు. పురుగు మందుల్లో కూడా భారీగా లోహాలు ఉంటాయి. ఆర్గానో క్లోరిన్‌ ఉందా..? లేదా..? అని చెప్పడానికి నమూనాలను సీఐఎ్‌సఎ్‌ఫఎల్‌కు పంపించాం. ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది’’ అని చెప్పారు. కెమికల్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ నిపుణులు మాట్లాడుతూ ‘‘తాగునీరు బాగానే ఉంది. కానీ బ్లడ్‌లో లెడ్‌, ఆర్గానో క్లోరిన్‌ ఉన్నాయి. సిరమ్‌ శాంపిళ్లలో ఆర్గానో క్లోరిన్‌, ఆర్గానో ఫాస్పరస్‌ కనిపించాయి. ఈ రెండే వింతవ్యాధికి కారణమని భావిస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘పురుగు మందుల అవశేషాలే కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. దీర్ఘకాలంపాటు సాగాల్సిన పరిశోధన ఇది. శాంపిల్స్‌పై ఇంకా విశ్లేషణ కొనసాగుతోంది. బియ్యంలో పాదరసం ఆనవాళ్లు కనిపించాయి. టమాటాపై పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. ఆర్గానో ఫాస్ఫరస్‌ బ్లడ్‌లో కనిపించింది. ఇవి ఎలా మనుషుల శరీరంలోకి ప్రవేశించాయన్న దానిని గుర్తించాల్సి ఉంది.’’ అని జాతీయ పోషకాహార సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భూగర్భజలాలను పరిశీలిస్తున్నామని, శాం పిళ్లు తీసుకున్నామని, ఫలితాలకు సమయం పడుతుందని హైదరాబాద్‌ ఎన్‌ఈఈఆర్‌ఐ నిపుణులు తెలిపారు. 


కొత్త కేసులు తగ్గాయి: ఆళ్ల నాని

ఏలూరు క్రైం: ఏలూరులో వింత వ్యాధులకు సంబంధించిన కేసులు గణనీయంగా తగ్గాయని, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. 


భయపెడుతున్న క్లోరైడ్‌ మోతాదు: భూగర్భ జలాల్లో క్లోరైడ్‌ ఎక్కువ మోతాదులో ఉన్నట్టు తాజా ఫలితాల్లో తేలింది. కొన్ని ప్రాంతాల్లో  470 మిల్లీ గ్రాములకుపైగానే ఉన్నట్టు గుర్తించారు. క్లోరైడ్‌ శాతం నీటిలో ఎక్కువ కావడం వల్ల తల తిరగడం, తల నొప్పి, వాంతులయ్యే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇక..ఈ నీటి నమూనాల్లో ఫ్లోరైడ్‌, కార్బైట్‌, బైకార్బైట్‌, సల్ఫేట్‌, కాల్షియం, మెగ్నీషియం తగు మోతాదులోనే ఉన్నట్టు తేలింది. 


సీఎస్‌ నేతృత్వంలో ‘ఏలూరు’ కమిటీ

ఏలూరు ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 21 మందితో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నాయకత్వం వహిస్తారు. ఏలూరు వాసులు ఇంతలా తీవ్ర అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాలు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.


అన్నంలో పాదరసం ఛాయలు

నీళ్లలో ఏమీ లేదు : ఆరోగ్యశాఖ 

ఏలూరు క్రైం: ‘‘ఏలూరులోని బాధితుల నుంచి సేకరించి రక్త నమూనాల్లో సీసం, నికెల్‌ మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. తాగునీటిలో ఎలాంటి సమస్య లేదన్నట్లుగా వైద్య సంస్థలు తేల్చాయి’’ అని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద భాస్కర్‌, నిపుణుల బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏలూరువాసులు నీటి విషయంలో అపోహపడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు సరఫరా చేస్తున్న నీరు అత్యంత సురక్షితమైనదేనని చెప్పారు. ‘‘ఏలూరులో వాయు కాలుష్యం ఏమీ లేదని ఎయిమ్స్‌, ఎన్‌ఐసీటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చి చెప్పాయి. అయినప్పటికీ వీటిపై నాగపూర్‌ సంస్థ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాం. అన్నంలో పాదరసం ఛాయలు కనిపించినట్లు ఎన్‌ఐఎన్‌ వెల్లడించింది. ఆహారం, కూరగాయల్లో ఒకింత పురుగు మందుల అవశేషాలు కనిపించాయని సీసీఎంబీ నివేదిక ఇచ్చింది’’ అని తెలిపారు.

Updated Date - 2020-12-12T09:44:12+05:30 IST