పంటల నాణ్యతే రైతుల సిరి

ABN , First Publish Date - 2020-10-14T07:19:17+05:30 IST

గల్ఫ్ దేశాలలో ఖర్జూర పంటకు, ఆ మాటకొస్తే ఏ వ్యవసాయక ఉత్పత్తికీ కనీస మద్దతు ధర అనేది ఉండదు. ఇక్కడి ప్రభుత్వాల దృష్టి అంతా రైతుల ఉత్పాదక....

పంటల నాణ్యతే రైతుల సిరి

గల్ఫ్ దేశాలలో ఖర్జూర పంటకు, ఆ మాటకొస్తే ఏ వ్యవసాయక ఉత్పత్తికీ కనీస మద్దతు ధర అనేది ఉండదు. ఇక్కడి ప్రభుత్వాల దృష్టి అంతా రైతుల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడం పైనే ఉంటుంది.


చమురు గర్భలైన గల్ఫ్ దేశాలలో సేద్యంపై ఆధారపడిన జీవనం సాగిస్తున్న రైతులు ప్రధానంగా ఖర్జూరపళ్ళను పండిస్తారు. హైదరాబాద్, హవానా, హైడిల్‌బెర్గ్, బీజింగ్, టోక్యో, సిడ్నీ... ఇలా ఎక్కడైనాసరే మధురఫలాల ప్రేమికులు కొనుగోలు చేసుకునే ఖర్జూరాలు దాదాపుగా అరబ్ రైతులు పండించేవే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతయ్యే ఖర్జూరపు పండ్లలో 77 శాతం అరబ్బు దేశాలకు చెందినవేనన్నది ఒక కచ్చితమైన అంచనా. ఖర్జూరాన్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలలో అత్యధికంగా పండిస్తారు. ఈ పండ్లతోటలు సాగు చేసే అరబ్ రైతులను గల్ఫ్ ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రొత్సహిస్తాయి. అయితే రైతులు పండించే ఖర్జూరాలను ఏ ప్రభుత్వమూ కొనుగోలు చేయదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఖర్జూర పంటకు, ఆ మాటకొస్తే ఏ వ్యవసాయక ఉత్పత్తికీ ఈ ఎడారి దేశాలలో కనీస మద్దతు ధర అనేది ఉండదు. ఇక్కడి ప్రభుత్వాల దృష్టి అంతా రైతుల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడం పైనే ఉంటుంది. అరబ్ రైతులు ఖర్జూరపు పళ్ళతో పాటు కూరగాయలు కూడా పండిస్తారు. వీటి క్రయవిక్రయాల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనేది ఉండదు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించే దిశగా అవి కృషి చేస్తాయి. అందుకు తగినట్లుగా యంత్రసామగ్రిని సమకూరుస్తాయి. ఎరువులు సరఫరా చేస్తాయి. అవసరమైన కార్మికులను రప్పించుకోవడానికి అనుమతినిస్తాయి. ఇక్కడి వ్యవసాయరంగంలో ఇంతవరకే ప్రభుత్వాల పాత్ర. పంటల మార్కెటింగ్ విషయంలో ఏ మాత్రం అవి జోక్యం చేసుకోవు. అయితే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరిస్తున్నాయి. తత్కారణంగా అరబ్బు రైతుల ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉంటాయి. 


నిజానికి గల్ఫ్ దేశాల మార్కెట్లలో భారతీయ వ్యవసాయోత్పత్తులకు మంచి గిరాకీ ఉండి ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు. మన వ్యవసాయోత్పత్తుల నాణ్యత శ్రేష్ఠంగా లేకపోవడమే అందుకు కారణమని చెప్పక తప్పదు. రైతులకు ఆసరా ఇవ్వడం కోసం ఎప్పుడో మొదలుపెట్టిన మద్దతు ధర విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగించడం విచిత్రమే. ఈ విధానంపై రైతులు ఆధారపడుతున్నందునే నాణ్యత కలిగిన పంట ఉత్పత్తులతో సొంతగా రైతుల ఎదుగుదల ఉండటం లేదు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను, వ్యవసాయ రంగంలోని లోపాలను విస్మరించినా కేంద్రం ఆ రంగానికి సంబంధించి ఇటీవల తీ‍సుకువచ్చిన మూడు కొత్త చట్టాలు భవిష్యత్తులో భారతీయ రైతుకు ప్రయోజనం చేకూర్చుతాయని చెప్పవచ్చు.


మొహమ్మద్ ఇర్ఫాన్, ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2020-10-14T07:19:17+05:30 IST