ప్రవాసుల స్వప్నభంగం

ABN , First Publish Date - 2020-10-28T05:36:13+05:30 IST

జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వచ్చి తమ స్థితిగతులను మెరుగుపరచుకున్న హైదరాబాదీలు తమ కన్నఊరిలో సొంతంగా ఒక ఇల్లు కలిగి ఉండాలని ఆకాంక్షించడం కద్దు...

ప్రవాసుల స్వప్నభంగం

జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వచ్చి తమ స్థితిగతులను మెరుగుపరచుకున్న హైదరాబాదీలు తమ కన్నఊరిలో సొంతంగా ఒక ఇల్లు కలిగి ఉండాలని ఆకాంక్షించడం కద్దు. అయితే ఆ కోరికను నెరవేర్చుకోవడంలో వారు అనేక సవాళ్ళను ఎదుర్కోవలసివస్తోంది. అటు సంపన్నులకు, ఇటు పేదలకు వారి వారి స్తోమతకు అనుగుణంగా హైదరాబాద్‌లో నివాస స్థలాలు విక్రయించే దళారులు గల్ఫ్ దేశాలలో అనేకమంది ఉన్నారు. కొంతమంది ప్రవాసులు స్వదేశంలోని స్థిరాస్థి వ్యాపారాలలో భాగస్వాములుగా ఉన్నారు. వారిలో ఒకరిద్దరు గల్ఫ్‌ నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత స్థిరాస్థి రంగం మీదుగా రాజకీయాలలో అడుగుపెట్టి ఏకంగా చట్టసభలకు ఎన్నికయ్యారు! 


హైదరాబాద్ నగరంలో స్థిరాస్థి వ్యాపారానికి, భూ ఆక్రమణలకు, రాజకీయాలకు ఉన్న సంబంధం కొత్త విషయమేమీ కాదు. మహానేతలుగా అనుచరులు కీర్తించే కొందరికి ఈ వ్యవహారాలలో ప్రమేయం ఉంది. నగరం నడిబొడ్డున కొంత భాగాన్ని అక్రమించి గత్యంతరం లేని పరిస్థితులలో ఖాళీ చేసిన ఒక ఉద్దండ నేత నుంచి గల్లీలలో గజాలు కబ్జా చేసిన చోటా మోటా నాయకుల వరకు అనేక మంది సదరు ‘ఘనుల’ జాబితాలో ఉన్నారు.


తొలుత ఖాళీస్థలాలు ఎక్కువగా ఉన్న ఒకప్పటి శివారు ప్రాంతాలలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు మొదలయ్యాయి. తర్వాత అవి ప్రభుత్వ, ప్రైవేట్ స్మశానాలు, చెరువులు, నాలాలు– ఇవీ అవీ అనేతేడా ఏమీలేకుండా దశాబ్దాలుగా కొనసాగుతూ నగరంలోని ఇతర ప్రాంతాలకు, చివరకు రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు భారీగా విస్తరించాయి. నగరంలోని ఒక శాసన సభా నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిపై పోటీ చేసి ఓటమి పాలై ఆర్థికంగా దెబ్బ తిన్న అభ్యర్థి తనను ఆదుకోవాలని సొంత పార్టీ అధిష్ఠానాన్ని అభ్యర్థించాడు. పార్టీ నాయకత్వం అతని వేడుకోలును మన్నించి కొన్ని చెరువు ప్రాంతాలను చూపించి వాటిని విక్రయించుకుని నష్టం పూడ్చుకోమని చెప్పింది. ఆ పరాజిత నేత ఆ చెరువులను ఆక్రమించి, అనేక కాలనీలను సృష్టించి అమ్ముకుని లబ్ధి పొందాడు. గల్ఫ్‌ ప్రవాసులు అనేకమంది ఆ  కాలనీలలో ఇళ్ళు కొనుగోలు చేశారు.


భారీవర్షానికి అతలాకుతలమైన హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగాశివారు ప్రాంతాలు, జలమయమైన పాతబస్తీ, దానిపరిసర ప్రాంతాలలోని అనేక కాలనీలలో కూడా ఇళ్ళు సమకూర్చుకునేందుకు వాళ్లు తమ కష్టార్జితాన్ని వెచ్చించారు.


సౌదీ అరేబియాలోని జుబేల్ నగరం పెట్రోలియం, రసాయనాల పరిశ్రమలకు నెలవు. అరేబియా సముద్రతీరంలో ఉన్న ఈ సుప్రసిద్ధ పారిశ్రామిక నగరం పేరిట హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్ పురా నియోజకవర్గం ఫలక్‌నుమా ప్రాంతంలో అల్ జుబేల్ అనే పెద్ద కాలనీ ఉంది. అదేవిధంగా ఒమాన్‌లో సలాల అనేది, దేశ రాజధాని మస్కట్ తర్వాత రెండవ పెద్ద నగరం. ఈ సలాల పేరిట చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఏకంగా ఒక పెద్ద బస్తీ ఉంది. చల్లని ప్రాంతంగా అనేకమంది వర్ణించే చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా నియోజకవర్గాలలో భూ ఆక్రమణలు ఇతర ప్రాంతాలతో పోల్చితే ఎక్కువ. పాతబస్తీ, శివారు ప్రాంతాలలో భూముల క్రయ విక్రయాలు అనేకం నిబంధనలకు విరుద్ధంగా జరిగినవే. ఇప్పుడు వాటిలో అత్యధికం జలమయమయ్యాయి.


పాతబస్తీ శివారులో జలమయమైన ప్రాంతాలలో బండ్లగూడ, బాబానగర్, జుబేల్ కాలనీ, నబీల్ కాలనీ, బాలాపూర్ తదితర ప్రాంతాలలో గల్ఫ్ దేశాల నుంచి తిరిగివెళ్ళిన వారేకాకుండా, హైదరాబాద్ నగరంలో పనిచేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలూ పెద్దసంఖ్యలో నివాసముంటున్నారు. అందుకే స్థానికులు ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో వరద నష్టం వీలయినంత తక్కువగా ఉండేలా పైన పేర్కొన్న కాలనీల వైపు చెరువు నీళ్ళు వదిలారనే పుకారు ఒకటి బలంగా ఉంది.


హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామనే పాలకులు నగర మౌలిక వసతులను పట్టించుకోవటం లేదు. 2000 సంవత్సరంలో భారీ వర్షాల అనంతరం నాలాల తీరుపై నిపుణులు చేసిన సిఫార్సులు ఆచరణసాధ్యం కావని చెప్పడం ద్వారా ప్రభుత్వం నిస్సహాయతను వ్యక్తంచేసింది. విశ్వనగరంలో సొంతానికి ఇల్లు ఉండాలని కలలుకనే వారు ఇటీవలి జలవిపత్తు అనంతరం అది ఎంత వరకు సాధ్యం, ఎక్కడ కట్టుకుంటే ఇల్లు సురక్షితం అనే దిశగా అలోచించడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించనంత కాలం మున్ముందు కూడ ఇదే దుస్థితి పునరావృతమవుతుంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2020-10-28T05:36:13+05:30 IST