ఎడారిసీమలో తెలుగు గానం

ABN , First Publish Date - 2020-09-30T07:13:55+05:30 IST

హిందీ చలనచిత్రరంగంలో నేడు సల్మాన్‌ఖాన్ అగ్రస్థాయి నటుడు, అతడు నటించిన చిత్రాలన్నీ దాదాపు విజయవంతమవుతాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయని...

ఎడారిసీమలో తెలుగు గానం

నిర్మలహృదయం, ఉన్నత వ్యక్తిత్వం బాలు ఔన్నత్యాన్ని ఎంతగానో పెంచాయి. ఘంటసాల, మొహమ్మద్ రఫీల కోవలో బాలు కూడ ఓ అమరగాయకుడు.


హిందీ చలనచిత్రరంగంలో నేడు సల్మాన్‌ఖాన్ అగ్రస్థాయి నటుడు, అతడు నటించిన చిత్రాలన్నీ దాదాపు విజయవంతమవుతాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయని, అతడితో నటించిన ఇతర తారల దశ దిశ తిరిగిపోతుందని అంటారు. నేడు కండల వీరుడిగా పేరొందిన సల్మాన్‌ఖాన్ ఒకప్పుడు బక్కపలుచగా, అసలు సినిమాలకు పనికిరాడంటూ భావించిన కాలం కూడ ఉండేది. 1989 చివర్లో మొదటిసారి హీరోగా నటించిన ‘మైనే ప్యార్ కియా’  హిందీ చిత్రం రికార్డులు బద్దలు కొట్టడంతో అప్పటినుంచి అతడికి తిరుగులేకుండా పోయింది. ప్రేమ కథ ఇతివృత్తంగా నిర్మించిన మైనే ప్యార్ కియా, షోలేను కూడ అధిగమించిందని అంటారు. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్ కోసం గానగంధర్వుడు యస్‌పి బాలసుబ్రమణ్యం పాడిన పాటలు దేశామంతా ఒక దశాబ్దం పాటు ఉర్రూతలూగించాయి.


హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్‌లో ప్రదర్శించిన ఈ చిత్రం ప్రతి షో టిక్కెట్ల విక్రయం సందర్భంగా బుకింగ్ కౌంటర్ల వద్ద పెద్ద తోపులాట జరిగేది. కౌంటర్‌ మూసేశాక పగిలిపోయిన గాజులు, విరిగిపోయిన చెప్పులు, ఇతర చెత్తచెదరాన్ని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికులు వచ్చేవారు. అంతగా ఆ రోజుల్లో ప్రేక్షకులు ఎగబడి చూసిన సినిమా అది. టిక్కెట్‌ కోసం బ్లాక్‌లో ప్రయత్నించినా లభించకపోవడంతో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ సిఫార్సుతో ఒక మిత్రుడు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు పెద్ద యుద్ధాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఆ సినిమాలో ఉన్న మొత్తం 11 పాటల్లో 10 యస్‌పి బాలసుబ్రమణ్యం పాడారు. ఇప్పటికీ అవి శ్రోతలకు మధురానుభూతిని కలిగిస్తూనే ఉన్నాయి. దిల్ దివానా.. పాట గొప్ప హిట్. బాలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన కోలుకోవాలని ట్విటర్ ద్వారా ప్రార్థించిన సల్మాన్‌ఖాన్‌ తనకెంతో గుర్తింపు తెచ్చిన ఆ పాటను ప్రత్యేకంగా  ప్రస్తావించారు. సల్మాన్‌ మరో హిట్ చిత్రం ‘హమ్‌ ఆప్ కే హై కౌన్’ సహా ఇతర సినిమాలలో బాలు పాడిన పాటలు ప్రేక్షకుల హృదయాలను దోచాయి. బాలు అంతకు ముందు 1981లో  ‘ఏక్ దుజే కే లియే’లో పాడిన పాటలను కూడ ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదించారు. ఇక తెలుగులో సరే సరి. శంకరాభరణం, సాగర సంగమం వంటి చిత్రాల గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. 


ఎంత మధురగాయకుడైనప్పటికీ బాలు హిందీలో తన స్థాయికి తగినట్టుగా రాణించలేకపోయారని చెప్పవచ్చు. హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఉద్దేశ్యపూర్వకంగానే బాలు వంటి దక్షిణాది గాయకులకు అవరోధాలు కల్పించారని చెబుతారు. ‘గోరి తేరా గావ్ బడా ప్యారా’ (చిత్ చోర్, 1976) పాటతో ఇప్పటికీ చెరగని ముద్రవేసిన గాయకుడు కె.జె. యేసుదాస్  హిందీ వైపు వెళ్ళకపోవడానికి గల కారణాల గురించి ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి.


సంగీత, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు సాధారణంగా ఆయా భాషాప్రియులకు మాత్రమే పరిమితమవుతారు, చేరువవుతారు. అందునా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దిగ్గజ సంగీత, సాహిత్యకారులకు పద్మ పురస్కారాలు, చలనచిత్ర రంగపు ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎన్ని దక్కినా జాతీయ స్థాయిలో, ప్రత్యేకించి ఉత్తరాదిలో లభించే ఆదరణ అంతంత మాత్రమే అనేది చేదు నిజం. 


విదేశాలలో సంగీత ప్రముఖుల కార్యక్రమాలను నిర్వహించినప్పుడు సహజంగా ఆయా భాషాప్రియులే హాజరుకావడం పరిపాటి. కానీ యస్‌పి బాలసుబ్రమణ్యం కార్యక్రమాలలో మాత్రం అన్ని రాష్ట్రాలు, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల ప్రవాసీయులు ఎంతో ఆసక్తితో పాల్గొనేవారు, వారితో ఆయన వారి వారి భాషలలోనే సంభా‌షించేవారు. దుబాయిలో భారీస్థాయిలో వినోద కార్యక్రమాలు నిర్వహించే నరేష్ ఒబరాయితో కన్నడంలో, అతడి భార్య శశితో తెలుగులో మాట్లాడేవారు. ఎలాంటి భేషజం లేకుండా అందరితో కలివిడిగా, ఆప్యాయంగా గడిపేవారు. 2019లో కువైట్‌కు వచ్చినప్పుడు కొందరు ఆటోగ్రాఫ్ కావాలని కోరగా, ‘ఎందుకు, ఏకంగా వీడియోనే తీసుకుందామ’ని చెప్పి అప్పటి కప్పుడు తీయించారు. 


కళాకారుల స్థానంలో కొత్త కొత్త వాయిద్య పరికరాలు వస్తున్నాయని, ఒక బృందంతో కలిసి పాడే పాటలలో ఉన్న తృప్తి ఈ వాయిద్యాల కారణంగా కనుమరుగైపోతోందని, రెండు దశాబ్దల నాడే ఆయన వాపోయారు. మాజీ పార్లమెంటు సభ్యుడు ఎ.పి.జితేందర్ రెడ్డి ఒమన్‌లో పని చేస్తున్నప్పుడు బాలును మొట్టమొదటిసారిగా గల్ఫ్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత యుఏఇలో బాలు సంగీత కచేరీని ఏర్పాటు చేసారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిర్మలహృదయం, ఉన్నతవ్యక్తిత్వం బాలు ఔన్నత్యాన్ని పెంచాయి. ఘంటసాల, మొహమ్మద్ రఫీల కోవలో బాలు కూడ ఓ అమరగాయకుడు.

మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2020-09-30T07:13:55+05:30 IST