ఒక నేల---..అనేక గమనాలు
ABN , First Publish Date - 2020-07-11T05:49:19+05:30 IST
బాపట్ల వ్యవసాయ కళాశాలలో విద్యాభ్యాసం చేసి దేశ పురోగతికి తోడ్పడిన ప్రముఖులు అనేకమంది. వీరందరూ తాము కృషి చేసిన రంగాలను అమితంగా ప్రభావితం చేసి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందారు.
బాపట్ల వ్యవసాయ కళాశాలలో విద్యాభ్యాసం చేసి దేశ పురోగతికి తోడ్పడిన ప్రముఖులు అనేకమంది. వీరందరూ తాము కృషి చేసిన రంగాలను అమితంగా ప్రభావితం చేసి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందారు. పలువురి పరిశోధనలు పాఠ్యాంశాలు అయ్యాయి. మరి కొందరి జీవితాలు ముందుతరాలకు మార్గదర్శకమయ్యాయి.
దక్షిణ భారతదేశంలో రెండో వ్యవసాయ కళాశాలగా 1945 జూలై 11 (16అని కొందరంటారు)న బాపట్ల వ్యవసాయకళాశాల ప్రారంభమయింది. 75 సంవత్సరాల స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది. హాజరు పట్టికలో ఒకటో విద్యార్థిగా నమోదయిన అజీజ్ అహ్మద్ (హైదరాబాద్ వాస్తవ్యుడు) నుండి ఇంతవరకు సుమారు 8 వేల మందికి పైగా విద్యార్థులు మా కళాశాలలో చదువుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా, జమ్మూ-కశ్మీర్, కర్ణాటక, తమిళనాడు విద్యార్థులు సైతం ఆ తొలి సంవత్సరాలలోనే బాపట్లకు రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసేవారిలో విధిగా 10 శాతం మంది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ‘భారత వ్యయసాయ పరిశోధనామండలి’ నిర్ణయం మేరకు ఆ సేతు హిమాచలం నుంచి బాపట్ల వ్యవసాయ కళాశాలకు రావడం అనివార్యమయింది. విద్యార్థినుల విషయానికి వస్తే తొలి సంవత్సరాలలో ఒకరో ఇద్దరో మాత్రమే వుండేవారు. ఇప్పుడు వారి సంఖ్య సహజంగానే గణనీయంగా పెరిగింది. కనీసం అరవైశాతం సీట్లు విద్యార్థినులే పొందడం ప్రస్తుత విశేషం.
ఇప్పటికీ ఒక పెద్ద గ్రామంగా భావించే భావపురి (బాపట్ల సంప్రదాయ నామం) నుంచి, వ్యవసాయ కళాశాలలో విద్యాభ్యాసం చేసి దేశ పురోగతికి తోడ్పడిన ప్రముఖులు అనేకమంది వున్నారు. వీరందరూ తాము కృషి చేసిన రంగాలను అమితంగా ప్రభావితం చేసి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందారు. వారిలో పలువురి పరిశోధనలు పాఠ్యాంశాలు అయ్యాయి. మరి కొందరి జీవితాలు ముందుతరాలకు మార్గదర్శకమయ్యాయి. ఈ రోజుల్లో ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళడం ఏమంత పెద్ద విషయం కాదు. 1940 నుంచి 1970ల దాకా అది చెప్పుకోదగ్గ విశేషమే. తొలి 15సంవత్సరాలలోనే ప్రతి బ్యాచ్‌లో కనీసం ఐదారుగురు పై చదువులకు అమెరికా తదితర దేశాలకు వెళ్ళి అద్భుతంగా రాణించారు. వ్యవసాయరంగమే అని కాకుండా మౌలిక పరిశోధనల్లో వినుతికెక్కారు. ఫార్మా రంగంలో సంచలనాలు సృష్టించారు. చరిత్రకందని విషయాలన్నీ వెలికితీసి వారి జీవిత ప్రస్థానాల స్ఫూర్తిదాయక విశేషాలను ఈ తరానికి అందించే ప్రయత్నం ఇంతవరకూ జరగక పోవటం బాధాకరం. ముఖ్యంగా వ్యవసాయరంగానికొచ్చినప్పుడు ప్రతి పంటలో అధిక దిగుబడినిచ్చే రకాల అభివృద్ధితో రైతుల జీవన స్థితిగతులు మెరుగుపడేందుకు ఎందరో కృషి చేశారు. ఈ కోవకు చెందినవారే యస్.వి.యస్ శాస్త్రి, గంగాప్రసాదరావు, యం.వి.రెడ్డి, జి.హరినారాయణ తదితరులు. వీరి సేవలు అవిస్మరణీయమైనవి. మానవ వనరుల అభివృద్ధి, మౌలిక వనరుల కల్పనతో, నిరంతరం రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నడిపించిన ఉదాత్తులు ఈడ్పుగంటి సుబ్బారావు.
వ్యవసాయ కళాశాల పట్టభద్రులు ఆనాడు కాలానుగుణంగా అధికోత్పత్తే లక్ష్యంగా సాగిన అభివృద్ధిలో ఎలా భాగస్వాములయ్యారో, ఇప్పుడు పర్యావరణ హిత సుస్థిర వ్యవసాయం కోసం జరుగుతున్న కృషిలో కూడా భాగ స్వాములుగా వున్నారు. పర్యావరణంలో వస్తున్న మార్పుల గురించి అధ్యయనం చేస్తూ ప్రపంచ సంస్థలకు సలహాలు, సూచనలిస్తున్న శివకుమార్, అంచా శ్రీనివాస్‌లు ఈ కోవలోని వారే. కేన్సర్ పరిశోధనలో ఉన్న జానయ్య లాంటి యువ శాస్త్రవేత్తలు ఎందరో వున్నారు. సమగ్ర సస్యరక్షణే శ్రీరామరక్ష అంటూ అంతర్జాతీయ స్థాయికెదిగిన జి. వి. రంగారావు, వైరస్‌ల పరిశోధనలో అందె వేసిన చెయ్యిగా పేరొందిన డివిఆర్ రెడ్డిల కృషి అవిస్మరణీయమైనది. పరిశోధనలతో పాటు రాజకీయ, పరిపాలన, ఆర్థిక, పారిశ్రామిక వాణిజ్య, వ్యాపార, సేవారంగాలలో వందల సంఖ్యలో ఆయారంగాలను ప్రభావితం చేస్తూ లక్షలాది మందికి ఉపాధికల్పిస్తున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న అజయ్ కల్లం, ఈ రోజు అమెరికాకు భారత ప్రత్యేక ఆర్థికదౌత్యాధికారిగా వెళ్ళిన కోట రవి వరకు ఎందరో వివిధ రంగాలలో ఉన్నారు. బార్బడాస్ కస్టమ్స్ అధికారిగా ఉన్న బొడ్డు రాజు నుండి యుఎన్‌ఓ తరపున జోర్డాన్‌లో అత్య ంత కీలకస్థానంలో ఉన్న ఇజ్రాయల్ వరకు మరెందరో.
పంచదార కర్మాగారాల నిర్వహణ, ఒంగోలు అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన చేసిన ముళ్ళపూడి నరేంద్రనాథ్, కోయంబత్తూర్‌లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలయిన పిఎస్‌జి గ్రూప్ మొదలు ఉభయ రాష్ట్రాలలో సుప్రసిద్ధమైన వాసవీ గ్రూప్ రామ్మోహనరావు దాకా అందరూ బాపట్లలో చదువుకున్నవారే. అక్వా, పురుగుల మందులు, విత్తనోత్పత్తి, రియల్‌ఎస్టేట్, మౌలికవనరుల కల్పన, వైద్యశాలలు, టూరిజం, ఎగుమతులు దిగుమతులు, పొగాకు, మైనింగ్, గ్రానైట్ ఇలా వారు అడుగు పెట్టని రంగంలేదు. ఆకాశమే హద్దుగా ఎదిగారు. బ్యాంకింగ్ రంగంలో అయితే చెప్పలేనంత. ప్రస్తుత నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు, అదే బ్యాంకు డిప్యుటీ మేనేజర్‌గా ఉన్న పి.వి. సూర్యకుమార్‌ల దాకా ప్రతి బ్యాంక్‌లో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నవారు ఎందరో బాపట్ల వ్యవసాయకళాశాలలో విద్యాభ్యాసం చేసిన వారే. ఇది మా కళాశాలకు గర్వ కారణం.
అందరికంటే మిన్నగా వ్యవసాయవిద్యను తమ సేద్యానికే అన్వయిస్తూ రైతులుగా ముందుకు సాగిన వారూ ఎందరో వున్నారు. ఇటువంటి ఆదర్శ కృషీవలులు ప్రతి బ్యాచ్‌లో కనీసం ఇద్దరో ముగ్గురో ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలకు స్వస్తి చెప్పి వ్యవసాయ జీవనంలో జీవన మధురిమలను ఆస్వాదిస్తున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే జి.వి.ఆర్. ప్రసాద్. వ్యవసాయంలోనే కృషి చేస్తూ జాతిపురోభివృద్ధికి దోహదం చేస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ప్రసిద్ధికెక్కిన కన్నెగంటి పాపారావు స్ఫూర్తి వీరందరికీ ఆదర్శమయింది.
ప్రస్తుతం వ్యవసాయంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణంలో వస్తున్న వికృత మార్పులు అందరికీ తెలిసినవే. దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ అతలాకుతలం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్కర పరిస్థితులను ఆకళింపు చేసుకుని, వాటిని అధిగమించి మానవమనుగడ సుస్థిరంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా వ్యవసాయ విద్యాపరులు అంకిత భావంతో కృషి చేయవల్సిన అవసరమున్నది. వ్యవసాయ పరిశోధనలకు పెట్టుబడులు పెంచాలి. జవాబుదారీతనం ఉండేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలి. ఇది మనందరి భవిష్యత్తుకు చాలా ముఖ్యం. గతంలోకి తొంగిచూస్తే ఆ కాలంనాటి విపత్కర పరిస్థితులను అధిగమించి వెలుగు బాటలు వేసిన వారిలో బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులూ ఉన్నారు. అదే స్ఫూర్తితో ఆ కళాశాల నేటి విద్యార్థులూ సుస్ధిర వ్యవసాయాభివృద్ధికీ, ఆరోగ్యకర సమాజం కోసం సాగే ప్రతి ప్రయత్నంలో భాగస్వాములవుతారు. కావలసిందల్లా అన్ని స్థాయిల్లో చిత్తశుద్ధి, నిజాయితీలు మాత్రమే. వ్యవసాయ కళాశాల 75 సంవత్సరాల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పాలకులు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఆ దిశగా స్ఫూర్తి నింపేందుకు కృషి చేయాలి.
-కాకుమాను సాంబశివరావు
(1973 బ్యాచ్ విద్యార్థి)
(బాపట్ల వ్యవసాయ కళాశాలకు 75 ఏళ్ళు)