10 వర్సిటీలకు వీసీలు

ABN , First Publish Date - 2020-08-28T22:08:57+05:30 IST

విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వైస్‌ చాన్సలర్ల-వీసీ) నియమాకంపై ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. 15 రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 స్టేట్‌ యూనివర్సిటీలు ఉండగా.. వీటిలో 9 వర్సిటీల వీసీల పదవీకాలం గత

10 వర్సిటీలకు వీసీలు

15 రోజుల్లో నియమించేందుకు కసరత్తు ..

9 వర్సిటీలకు 984 దరఖాస్తులు 

1:3 ప్రకారం సిద్ధమవుతున్న జాబితా 

హైదరాబాద్‌, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వైస్‌ చాన్సలర్ల-వీసీ) నియమాకంపై ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. 15 రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 స్టేట్‌ యూనివర్సిటీలు ఉండగా.. వీటిలో 9 వర్సిటీల వీసీల పదవీకాలం గత ఏడాది జూలైలోనే పూర్తయింది.  గత 13 నెలలుగా ఇంఛార్జి అధికారుల పాలనలో ఇవన్నీ నడుస్తున్నాయి. విశ్వవిద్యాలయాల వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని ఐఏఎస్‌ అధికారులను ఇంఛార్జి వీసీలుగా నియమించడంతో ఈ వర్సిటీల్లో పాలన పూర్తిగా గాడితప్పిందన్న ఆరోపణలున్నాయి. దీంతో వీసీల నియామకంపై సర్కార్‌ దృష్టిసారించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 స్టేట్‌ వర్సిటీ వీసీల పదవీకాలం గత ఏడాది జూలైలోనే పూర్తయింది. సాధారణంగా ఇంఛార్జి వీసీలుగా రిజిస్ర్టార్‌లను నియమించే సంప్రదాయం ఉండగా.. దీనికి భిన్నంగా అన్ని వర్సిటీలకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించారు. వారంతా కీలక శాఖల్లో కీలక బాధ్యతల్లో ఉన్నవారు కావడంతో వర్సిటీలను పట్టించుకోవడమే మానేశారు. దీంతో పాలన గాడి తప్పడంతో పాటు సమస్యలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. చివరిసారిగా గత ఫిబ్రవరిలో దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. మూడు వారాల్లో పాలకమండళ్లను, వీసీలను నియమించాలని ఫిబ్రవరి-20న ఆదేశించారు. తర్వాత నెలవరకూ ఎలాంటి పురోగతి లేకపోగా.. లాక్‌డౌన్‌తో ఇక ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. 


273 మంది అర్హులు.. 

ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్‌, అంబేడ్కర్‌, శాతవాహన, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ,పాలమూరు, పొట్టిశ్రీరాములు మొత్తం 9 వర్సిటీలకు గతంలో నోటిఫికేషన్‌ విడుదలచేయగా 984 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 273 మంది అర్హులుగా తేలారు. ఒక్కో వర్సిటీకి ముగ్గురు చొప్పున పేర్లను సెర్చ్‌ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. ఆ జాబితాను ప్రభుత్వం గవర్నర్‌కు పంపిస్తుంది. అందులోనుంచి ఒకరిని గవర్నర్‌ ఎంపికచేస్తారు. సీఎం తాజా ప్రకటన నేపథ్యంలో ముగ్గురి ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. 15 రోజుల్లోపు 9 మంది వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యునివర్సిటీ (జేఎన్‌ఏఎ్‌ఫయు) వీసీ పదవీకాలం గత జనవరిలోనే ముగియగా.. ఇంకా నియామకం జరగలేదు. దీని నోటిఫికేషన్‌ తాజాగా ఇచ్చారు. దీని దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు ఉంది. ఈ 9 వర్సిటీలతో పాటే దీనికి కూడా వీసీ పోస్టు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 


పాలకమండళ్లు.. ఖాళీల భర్తీ 

కరోనా పరిస్థితుల నేపథ్యంలో  అన్ని వర్సిటీలు క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అన్ని సెట్‌ల తేదీలు ప్రకటించగా.. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్‌ నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. ఇలాంటి సమయంలో వీసీల భర్తీ మరింత జాప్యం జరిగితే తీవ్ర విమర్శలు వస్తాయని భావించిన ప్రభుత్వం ముందుగా వీసీల నియామకంపై దృష్టి సారించింది. ముందుగా వీసీలను నియమించి, తర్వాత పాలకమండళ్లను ప్రకటించే అవకాశాలున్నాయి. అలాగే గతంలో వర్సిటీల్లో ఖాళీగా 1061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చినా భర్తీ చేయలేదు. వీటిని కూడా భర్తీ చేయనున్నారు. 


అనాథగా.. ట్రిపుల్‌ ఐటీ బాసర

ట్రిపుల్‌ ఐటీ బాసరగా పేరుగాంచిన రాజీవ్‌గాంధీ యునివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం నాణ్యమైన ఇంజినీరింగ్‌ బోధనలో కొద్దికాలంలోనే జాతీయస్థాయిలో పేరుసాధించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నుంచి ఇది ఇంఛార్జి వీసీల పాలనలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఐఏఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జ ఇంఛార్జి వీసీగా ఉన్నారు. ఈయన బాధ్యతలు స్వీకరించిన గత ఏడాది కాలంలో ఒక్కసారి కూడా కనీసం వర్సిటీని సందర్శించలేదు. ఈ వర్సిటీ చట్టం ఇతర వర్సిటీలతో పోలిస్తే వేరుగా ఉంది. ఇక్కడ వీసీతో పాటు చాన్స్‌లర్‌, డైరెక్టర్‌ను కూడా నియమించాల్సి ఉంది. ఈ చట్టాలను మార్చి ఇతర వర్సిటీల్లా మారుద్దామని గత అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం భావించనా సాధ్యంకాలేదు. చట్టం మార్చిన  తర్వాతనే పూర్తిస్థాయి వీసీని నియమించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో గత ఆరేళ్లుగా ఈ వర్సిటీ పూర్తిస్థాయి వీసీ పాలనకు నోచుకోలేదు. అందుకే ఖాళీగా ఉన్న మొత్తం 9 వర్సిటీలకు దరఖాస్తులు ఆహ్వానించినా.. దీనికి మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


రాష్ట్రం ఏర్పిడిన తర్వాత నుంచి శాతవాహనకు కూడా కొత్త వీసీ నియామకం చేపట్టలేదు. దీంతో వర్సిటీలో బోధన, బోధనేతర నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. 




Updated Date - 2020-08-28T22:08:57+05:30 IST