వాళ్లు మాతోనే ఉండాలా?

ABN , First Publish Date - 2020-06-29T05:30:00+05:30 IST

డాక్టర్‌! మా వారు మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లితండ్రులకే ప్రాధాన్యమిస్తూ, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్లతో కలిసి ఉండడం నా వల్ల కావడం లేదు. ఈ విషయం గురించి మేము పడుతున్న గొడవలు చూసి...

వాళ్లు మాతోనే ఉండాలా?

డాక్టర్‌! మా వారు మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లితండ్రులకే ప్రాధాన్యమిస్తూ, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్లతో కలిసి ఉండడం నా వల్ల కావడం లేదు. ఈ విషయం గురించి మేము పడుతున్న గొడవలు చూసి, మా అత్తామామలు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. వారిని మెరుగైన వైద్యంతో బతికించుకోగలిగాం. ఈ పరిణామంతో, బంధువులు అందరూ నన్ను దూషించారు. ఆయన ధోరణితో విసిగిపోయి, విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. మాకు ఓ అమ్మాయి ఉంది. ఈ పరిస్థితిలో నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? - దివ్య


కొడుకుగా తల్లితండ్రుల బాధ్యత స్వీకరించడం మీ వారి బాధ్యత. అయితే వారికి ఉన్న తీవ్రమైన డిప్రెషన్‌, మతిమరుపుతో కూడిన డిమెన్షియా... ఈ రెండు సమస్యలూ వైద్యంతో అదుపులోకి వచ్చేవి కావు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అంగీకరించక తప్పదు. వారికి ఉన్న ఈ సమస్యలు మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేస్తూ ఉండి ఉండవచ్చు. అలాగని వారిని వదిలేసి, మీ వారు మీతోనే ఉండాలని కోరుకోవడం సరి కాదు. దంపతులకు వ్యక్తిగత సమయం ఉండాలను కోవడం తప్పు కాదు. అయితే ఈ విషయాలు మీ వారికి అర్థమయ్యేలా చెప్పడం అవసరం. అలాగే మీకు ఒక పాప ఉందని అంటున్నారు. కాబట్టి పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. మీరు మథన పడుతున్న అంశాల గురించి మీ వారితో మాట్లాడండి. మీరు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పండి. ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి రండి. మీ అత్తామామలను నొప్పించకుండా, వారి మాటలకు నొచ్చుకోని ధోరణి అలవరుచుకోండి. వీలైతే వారి బాగోగుల కోసం పనివాళ్లను ఏర్పాటు చేయండి. పని ఒత్తిడి తగ్గించుకోండి. ఇలా పరిస్థితికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోగలిగితే మానసిక ఒత్తిడికి తావుండదు. 

-డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, 

క్లినికల్‌ సైకాలజిస్ట్‌, హైదరాబాద్‌


Updated Date - 2020-06-29T05:30:00+05:30 IST