నా భూమి నాకు దక్కాలంటే..?
ABN , First Publish Date - 2020-02-11T05:30:00+05:30 IST
ప్రభుత్వం వారు 2008లో 3 సెంట్ల భూమి. డి-ఫారమ్ పట్టా ఇచ్చారు. అందులో ఇల్లు కట్టుకోవడానికి 2016లో మేము వెళితే, అప్పటికే ...
ప్రభుత్వం వారు 2008లో 3 సెంట్ల భూమి. డి-ఫారమ్ పట్టా ఇచ్చారు. అందులో ఇల్లు కట్టుకోవడానికి 2016లో మేము వెళితే, అప్పటికే ఆ స్థలంలో కొందరు ఇల్లు క ట్టుకున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ, ఫలితం లేదు. నా మూడు సెంట్ల భూమి నాకు దక్కాలంటే ఏంచేయాలి? ఈ స్థలానికి సంబంధించిన హద్దులు చూపమని బ్యాంకులో చలాన్ కూడా కట్టాం. అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెల్‌కు కూడా ఫిర్యాదు చేశాను. కానీ, ఎక్కడా స్పందన లేదు. నాకు ఇచ్చిన అసైౖన్డ్ స్థలంలో ఇతరులు ఇల్లు కట్టడం కూడా సర్వేయర్, విఆర్‌ఓలు వచ్చి చూశారు. ఆ వివరాల రిపోర్టులు కావాలని సమాచార హక్కు చట్టం కింద ఒక అర్జీని పోస్టులో పంపాను. కానీ, వారు ఇంతవరకు నాకు రిపోర్టు పంపలేదు. కరెంటు బిల్లులు, ఇంటిపన్ను బిల్లులన్నీ అందులో ఇల్లు కట్టిన వారి పేరు మీదే ఉన్నాయి. అనుబంధ పత్రం కూడా వారి పేరు మీదే ఉంది. నా భూమి నాకు దక్కాలంటే ఏం చేయాలి?
- బి. రామలక్ష్మి, నిజామాబాద్
మీకు డి-ఫారమ్ పట్టా ఇవ్వడమే కాకుండా, అసైన్డ్ చేసిన భూమిని స్వాధీనపరిచి మీకు అందులో ఇల్లు కట్టుకోవడానికి వీలు కల్పించవలసిన బాధ్యత కూడా అసైన్ చేసిన అధికారులదే. మీకు భూమిని స్వాధీనపరచనందు వల్ల వేరే వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించుకున్నప్పుడు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌కి, లేదా జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేయండి. మీ భూమిని ఆక్రమించిన వారిని అందులోంచి తొలగించి మీకు స్వాధీనపరచమని గానీ, లేదా దానికి సమీపంలో అంతే విస్తీర్ణమైన వేరే ఏదైనా భూమిని ఇప్పించమని గానీ అడగండి. మీరు ఫిర్యాదు చేసిన తరువాత కూడా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ గానీ ఈ విషయంలో ఏమాత్రం స్పందించకపోతే మీరు వారి మీద పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా న్యాయస్థానాన్ని సంప్రతించి, మీ భూమిని మీకు అసైన్ చేయమని కోరే హక్కు మీకు ఉంది. సమాచార చట్టం హక్కు ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ మీరు అడిగిన సమాచారం ఇంతవరకూ లభించలేదన్నారు. వాస్తవానికి మీరు అర్జీ పెట్టుకున్న 30 రోజుల్లోగా మీరు అడిగిన సమాచారాన్ని మీకు అందచేయాలి. ఒకవేళ ఆ సమాచారం వారి వద్ద లేకపోతే, ఆ విషయమైనా తెలియచేయవలసిన బాధ్యత వారికి ఉంది. సమాచారం అందించడంలో నిర్లక్ష్యంగా ఉండిపోతే వారి మీద హైదరాబాద్‌లోని అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేయండి. ఏమైనా మీకు డి- ఫారమ్ పట్టా ఇస్తూ అసైన్ చేసిన అధికారులే మీకు న్యాయం చేయవలసి ఉంటుంది.
ఒడ్నాల శ్రీహరి, న్యాయవాది, హైదరాబాద్