ఏమని చెప్పాలి?
ABN , First Publish Date - 2020-03-17T06:06:07+05:30 IST
మాది పేద కుటుంబం. ఇటీవలే నేను డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నలది మతాంతర వివాహం. మా నాన్న పఠాన్(ఓసీ), మా అమ్మ షేక్ (బీసీ-బీ). నా స్కూలు, కాలేజ్ సర్టిఫికేట్లలో బీసీ-బీ అనే ఉంది. నేను, నా చెల్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మా కులం పెద్ద సమస్యగా మారింది. నా టీసీలో...
మాది పేద కుటుంబం. ఇటీవలే నేను డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నలది మతాంతర వివాహం. మా నాన్న పఠాన్(ఓసీ), మా అమ్మ షేక్ (బీసీ-బీ). నా స్కూలు, కాలేజ్ సర్టిఫికేట్లలో బీసీ-బీ అనే ఉంది. నేను, నా చెల్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మా కులం పెద్ద సమస్యగా మారింది. నా టీసీలో బీసీ-బీ (దూదేకులు) అని ఉంటే... రేషన్ కార్డులో, ఓటర్ ఐడీ కార్డుల్లో నాన్న పేరు పక్కన పఠాన్ అని ఉంది. ఇంటి పత్రాల్లోనూ ఇలాగే ఉంది. మునుముందు మాకు ఉద్యోగం వస్తే, మేము బీసీ-బీ కాదని ఉద్యోగం తీసేసే ప్రమాదం ఉందా? మాకు తెలిసిన వాళ్లను అడిగితే, మతాంతర వివాహం చేసుకున్న వారి పిల్లలకు తండ్రి కులమూ, మతమే వరిస్తున్నాయని చెబుతున్నారు. అయినా ఒక పక్కన ప్రభుత్వం కులాంతర, మతాంతర వివాహాలనూ ప్రోత్సహిస్తూనే... మరో పక్క ఈ లిటిగేషన్లు పెట్టడం ఏంటీ? కులాంతర, మతాంతర వివాహం చేసుకోవడం వారి ఇష్టం. కానీ, వారికి కలిగిన పిల్లలకు తమ తల్లితండ్రుల్లోని ఎవరో ఒకరి కులాన్నీ, లేదా మతాన్ని వాడుకునే స్వేచ్ఛ లేదా? చివరికి మేము ఓసీగా చెబుతూ ఉద్యోగ ప్రయత్నం చేయాలా? ఈ విషయాలు వివరంగా తెలియచేయండి.
-ఎస్.కె.హసీనా, కర్నూలు
ఒక వ్యక్తి ఏ కులానికి సంబంధించిన వాడనే విషయం కేవలం రెవెన్యూ అధికారులు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగానే నిర్ధారించడం జరుగుతుంది. మీ నాన్న పఠాన్ అనీ, మీ అమ్మ షేక్ అనీ తెలియచేశారు. మీ స్కూల్ రికార్డులన్నింటిలోనూ బీసీ-బి గానే పేర్కొన్నట్లుగా రాశారు. ఈ వివరాలు తెలియచేస్తూ మీరు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకుంటే వారి రివెన్యూ ఇన్‌స్పెక్టర్ ద్వారా సంబంధిత విషయంలో విచారణ జరిపి, కుల ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఆ ధ్రువీకరణపత్రం ఆధారంగా ఏ ఉద్యోగానికైనా ఆ కుల ప్రాతిపదికగా అర్హత పొందవచ్చు. వాస్తవానికి మీ అమ్మగారిది షేక్ (బీసీ) కులం అయినప్పటికీ, చట్టరీత్యా మీకు మీ నాన్న (ఓసీ) కులమే వర్తిస్తుంది. ఏమైనా మీరు ఏ విషయమూ దాచకుండా, పూర్తి వివరాలను అంటే మీ నాన్నగారి కులం, మీ అమ్మగారి కులం వేర్వేరుగా పేర్కొంటూ సంబంధిత తహసీల్దారుకు కుల ధ్రువీకరణ పత్రానికై దరఖాస్తు చేసుకోండి. స్కూలు రికార్డ్సులో నమోదైన సర్టిఫికెట్లను కూడా వారికి అందచేయండి. వారు విచారణ జరిపి మీకు ఏ కుల ధ్రువీకరణ పత్రం ఇస్తారో, ఆ పత్రం ఆధారంగా మీరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలా మీరు ఉద్యోగం పొందితే మునుముందు ఏ విధమైన ఇబ్బందులూ ఉండవు.
- ఒడ్నాల శ్రీహరి, న్యాయవాది, హైదరాబాద్