ఆ ప్రపంచం నుంచి బయటకు రాడా?

ABN , First Publish Date - 2020-06-22T05:30:00+05:30 IST

డాక్టర్‌! మా అబ్బాయి ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే రోజంతా ఫోన్‌తోనే గడుపుతూ ఉంటాడు...

ఆ ప్రపంచం నుంచి బయటకు రాడా?

డాక్టర్‌! మా అబ్బాయి ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే రోజంతా ఫోన్‌తోనే గడుపుతూ ఉంటాడు. రాత్రి పూట ఎక్కువ సమయం మేలుకోవడం, సమయానికి భోజనం చేయకపోవడం మామూలైపోయింది. ఫోన్‌ వాడకం తగ్గించమని చెబితే, కోపం తెచ్చుకుంటున్నాడు. మా అబ్బాయికి ఉన్న ఫోన్‌ వ్యసనం పోయేదెలా? సలహా ఇవ్వగలరు.     

-  ఓ సోదరి, నెల్లూరు.


టీనేజ్‌లో ఉన్నవారు ఎక్కువ సమయం పాటు ట్యాబ్‌ లేదా ఫోన్‌లతో గడపడం సహజం. అలాగనీ బలవంతంగా పిల్లల దగ్గర్నుంచి ఫోన్‌ లాక్కోవడం, ఇంటర్నెట్‌ కట్‌ చేస్తానని బెదిరించడం లేదా తగాదా పడడం సరి కాదు. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమ్స్‌ లాంటి వాటిని పూర్తిగా అడ్డుకునే పరిస్థితి లేదనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాటి వల్ల జీవనశైలి దెబ్బతినకుండా... రెండింటి మధ్య సమతూకం కుదిరేలా పిల్లల ఫోన్‌ వాడకం ఉండేలా చూసుకోవాలి. ఇదే విషయాన్ని మీ అబ్బాయికి చెప్పండి. మన చిన్నతనంలో ఇలాంటి సదుపాయాలు, పరికరాలు లేవు కాబట్టి ఇప్పటి జనరేషన్‌ పిల్లలు వాటికి ఆకర్షితులవుతూ ఉంటే, పెద్దలమైన మనకు కొంత విసుగు, చీకాకు కలగడం సహజం. అయితే ఈతరం పిల్లలు సామాజిక మాధ్యమాలు, సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ ఉన్న ప్రపంచంలో పుట్టారు. కాబట్టి ఎంత కాదనుకున్నా అవి వాళ్ల జీవితంలో భాగమే. ఈ విషయం తల్లితండ్రులు అర్థం చేసుకోవాలి. వాటిని వాడకపోతే సాటి విద్యార్థులు, స్నేహితులు ఎగతాళి  చేసే పరిస్థితి కూడా ఉంది. 


అయితే అలా సెల్‌ఫోన్లతో ఎక్కువ సమయం గడపడం వల్ల జీవనశైలి దెబ్బతింటుంటే, కచ్చితంగా ఆ అలవాటు వ్యసనంగా మారిందనే నిర్థారణకు రావాలి. మీ అబ్బాయి విషయంలో మీరు తీవ్రంగా స్పందించకుండా, సున్నితంగా వివరించే ప్రయత్నం చేయండి. ఎక్కువ సమయం పాటు ఫోన్‌కు అతుక్కుపోవడం మూలంగా విలువైన కాలాన్ని ఎలా వృథా చేస్తున్నారో అర్థమయ్యేలా చెప్పండి. ఆ సమయాన్ని అభిరుచుల కోసం వెచ్చించడం ఎంత ఉపయోగకరమో వివరించండి. ఫోన్‌ వాడకం వల్ల మార్కులు తగ్గితే, ‘ఇంతకన్నా ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోగలవు? ఫోన్‌ వాడకం తగ్గించలేవుగా?’ అని ఎద్దేవా చేసేలా మాట్లాడకుండా... ‘ఇంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగే సామర్థ్యం నీకుంది’ అంటూ ప్రోత్సాహకరంగా మాట్లాడాలి. అలాగే ‘ఫోన్‌ పక్కన పెట్టకపోతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను’ లాంటి మనం చేయలేని పనుల గురించి మాట్లాడకూడదు. లేదంటే మీ మాటలకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి మీ అబ్బాయికి ఎక్కువ సమయం ఫోన్‌ వాడితే కలిగే నష్టాలు ఏమిటో చెప్పండి. నాణ్యమైన సమయాన్ని కుటుంబంతో గడపడం వల్ల కలిగే లాభాలను వివరించండి. ఇలా చేస్తే, కచ్చితంగా మీ అబ్బాయిలో మార్పు వస్తుంది.

-డాక్టర్‌ ఎమ్‌.ఎస్‌ రెడ్డి,

సైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌.


Updated Date - 2020-06-22T05:30:00+05:30 IST