పరీక్ష హాల్‌లో...

ABN , First Publish Date - 2020-03-12T06:03:48+05:30 IST

పరీక్షల సమయంలో ఎప్పటికప్పుడు సమయం చాలా తక్కువగా ఉన్నట్లే అనిపిస్తుంది. ఎవరికైనా అది సహజమే...

పరీక్ష హాల్‌లో...

పరీక్షల సమయంలో ఎప్పటికప్పుడు సమయం చాలా తక్కువగా ఉన్నట్లే అనిపిస్తుంది. ఎవరికైనా అది సహజమే! అందుకే ఒక ఆన్సర్‌ తర్వాత మరొక ఆన్సర్‌ వేగంగా రాసుకుంటూ వెళుతుంటారు. ఒక రకంగా అది అవసరం కూడా! కాకపోతే, ఈ క్రమంలో మనసు ఎంతో కొంత ఉద్వేగానికి లోనవుతూ ఉంటుంది. అందువల్ల....


ఒక ఆన్సర్‌ రాయడం పూర్తయిన  తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఖాళీగా ఉండి రిలాక్స్‌ కావడం అవసరం. అలా ఖాళీగా ఉండడం వల్ల రెండు నిమిషాల సమయం వృథా అవుతుంది కదా అనిపించవచ్చు. కానీ, అలా ఓ రెండు నిమిషాలు ఆగి ఆలోచించడం వల్ల పదింతల లాభం కలుగుతుంది. 


మౌనంగా ఉండే ఆ రెండు నిమిషాలు మనసు పూర్తిగా స్తబ్ధంగా ఉంటుందనేమీ కాదు. ఆ తర్వాత రాయబోయే ప్రశ్నను పరిశీలిస్తూ ఉంటుంది. ఆన్సర్‌లోని అంశాల గురించి మనసు ఆలోచించుకుంటుంది. ఆలోచనా క్రమంలో ఏదైనా తేడా ఉంటే సరిచేసుకుంటుంది. 


ఆ ఒకటి రెండు నిమిషాల విరామం వల్ల కలిగే మరో ప్రయోజనం కూడా ఉంది. అదేమిటంటే, అంత బాగా రాయలేని వాటిని స్పష్టంగా గుర్తించి, బాగా రాయగలిగే వాటిని ఎంచుకోవడం ఆ విరామంలో సాధ్యమవుతుంది.


ఆన్సర్‌కూ ఆన్సర్‌కూ మధ్య తీసుకునే ఆ స్వల్ప విరామం వల్ల మనసు తేలిక పడుతుంది. ఆ తర్వాత రాయబోయే ఆన్సర్‌ను మరింత ప్రభావవంతంగా రాసే శక్తి కలుగుతుంది. 


వీలైతే, ఆ విరామ సమయంలో బలంగా శ్వాసతీసుకుని వదిలితే మరింత మంచిది. అలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, పరీక్షల్ని మరింత ఉత్సాహంగా రాయగలిగే మనోబలం ఏర్పడుతుంది.

Updated Date - 2020-03-12T06:03:48+05:30 IST