విజ్ఞానాన్ని సాధించే క్రమం

ABN , First Publish Date - 2020-02-28T09:11:18+05:30 IST

ఒక విద్యార్థి జ్ఞాన సముపార్జన క్రమాన్ని తెలిపే శ్లోకమిది. విద్యను నేర్చుకునే విధానాన్ని నాలుగు పాదాలుగా విభాగిస్తే.. గురువు వద్ద ..

విజ్ఞానాన్ని సాధించే క్రమం

ఆచార్యాత్‌ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా!

పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణచ!

ఒక విద్యార్థి జ్ఞాన సముపార్జన క్రమాన్ని తెలిపే శ్లోకమిది. విద్యను నేర్చుకునే విధానాన్ని నాలుగు పాదాలుగా విభాగిస్తే..  గురువు వద్ద శిష్యుడు నేర్చుకునేది ఒక పాదం మాత్రమే. లోతుగా అధ్యయనం చేసి, బుద్ధితో విచారించి, సూక్ష్మాంశాలు పరిశోధించి, విశ్లేషణ శక్తిని ఉపయోగించి, ఆంతర్యాన్ని గ్రహించి మరొక పాదాన్ని నేర్చుకుంటాడు. తోటి విద్యార్థులతో జరిపే చర్చలతో, మీమాంసాదులతో అవగాహన పెంచుకోవడం ద్వారా మరో భాగం నేర్చుకుంటాడు. నేర్చిన విద్యను ఆచరణలో పెడుతూ.. కాలక్రమేణా తన, ఇతరుల అనుభవాల ద్వారా పూర్తిగా నేర్చుకుంటాడు. స్థూలంగా చెప్పాలంటే.. గురువు బోధనల ద్వారా వికసన పొందుతాడు. బుద్ధితో విశ్లేషణ చేసుకొని, తనలోని పరిమితులను చెరిపివేసుకొని, జ్ఞానాన్ని విస్తరించుకుంటాడు. జ్ఞాన విస్తరణ వల్ల విషయాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. నైపుణ్యాలు పెరుగుతాయి.


 పూర్వ నిశ్చితాభిప్రాయాలను త్రోసిరాజని హేతుబద్ధమైన, తార్కికమైన ఆలోచన చేసే శక్తి పెరుగుతుంది. నిజానికి ఈ వికసన, విస్తరణలు కూడా తన ఆలోచన విధాన పరిమితులకు లోబడినవే కాబట్టి అవి సమగ్రతను, సంపూర్ణతను సంతరించుకోవు. అందుకే, సమాజంలోని విద్యాధికులతో చర్చోపచర్చలు, వాదప్రతివాదనలు చేస్తూ తన అభిప్రాయాలను, ప్రతిపాదనలను ఇతరులతో పంచుకుంటూ తనలోని లోతుపాతులను సవరించుకుంటూ, తప్పొప్పులను దిద్దుకుంటూ, విద్యను వివిధ కోణాలలో ఆధునికీకరించుకుంటూ ముందుకు సాగడం వల్ల విద్య వ్యాప్తమౌతుంది. తన ప్రతిపాదనలు నూతనత్వాన్ని సంతరించుకుంటాయి. తన వాదమే యథార్థమనే భావన గతించి.. సత్యాన్ని ఆవిష్కరించ గలుగుతాడు. ఈ స్థితిలో తనలోని జ్ఞానం తెలివిగా, విజ్ఞానంగా, వివేచనగా, వివేకంగా రూపాంతరం చెందుతుంది. జీవితం పరీక్షలు పెడుతూ పాఠం నేర్పుతుంది కాబట్టి జీవన విధానంలో వ్యక్తి వివేచన ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటుంది. అప్పుడప్పుడూ తన విజ్ఞానం ఇచ్చిన ఉత్సాహం, అధికమైన ఆత్మవిశ్వాసం వల్ల అహంకారం పలకరించే అవకాశం ఉంటుంది. అప్పుడు తాను వివిధ మార్గాల ద్వారా నేర్చుకున్న విజ్ఞతను జీవన గమనంలో ప్రతిక్షేపించడం ద్వారా తన విజ్ఞానం, విజ్ఞత, ప్రాజ్ఞత, నైపుణ్యాలు సమగ్రతను సంపూర్ణతను సంతరించుకుంటాయి. దీనిని ప్రచారం చేయడం వల్ల సత్యం, శాశ్వతం, అనంతం, ఆనందమయమైన విజ్ఞానం పరివ్యాప్తమై సమాజానికి ఉపకరిస్తుంది. ఆ పరిపూర్ణతను సాధించడమే మానవ జీవన గమ్యం.


వికసన విస్తరణగా, విస్తరణ వ్యాప్తంగా, వ్యాప్తం పరివ్యాప్తంగా రూపాంతరం చెందడం వల్ల సమగ్రతను, సంపూర్ణతను పొందిన వ్యక్తిత్వం తన పరిమితులకు అతీతంగా స్పందించడం నేర్చుకుంటుంది. భౌతిక, మానసిక, భావోద్వేగ, సామాజిక, ఆధ్యాత్మిక జీవన పార్శ్వాలలో తన స్థాయిని ఉన్నతీకరించుకుంటుంది. అసాధ్యాలనుకున్న లక్ష్యాలను ఛేదించే సన్నద్ధత ఆవిష్కృతమౌతుంది. దార్శనికత పెరుగుతుంది. అంతర్గత దృష్టికోణం నుండి చూచే అలవాటు సహజ ప్రకృతిగా, నైజంగా మారుతుంది. దానితో మూలాలను అన్వేషించగలుగుతాం. సమస్యలకు భయపడి పారిపోకుండా ఎలాంటి సమస్యకైనా సకారాత్మక వైఖరితో పరిష్కారాన్ని కనుగొనగలుగుతాం.

- పాలకుర్తి రామమూర్తి, 9441666943

=================

‘పటాన్‌చెరు’ ఉదంతం.. నష్ట నివారణ చర్యల దిశగా డీజీపీ

ఒకేసారి వేయి కార్యాలయాలతో వీడియో కాన్ఫరెన్స్‌

మానవీయ కోణంలో పనిచేయాలని ఉద్బోధ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్యకు పాల్పడ్డ సంధ్యారాణి అనే విద్యార్థిని తండ్రిని ఓ కానిస్టేబుల్‌ బూటుకాలితో తన్నడం కలకలం రేపిన నేపథ్యంలో.. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నష్టనివారణ చర్యలను ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల దాకా.. ప్రతిఒక్కరూ హాజరయ్యేలా గురువారం రికార్డుస్థాయిలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్వీయ క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఉద్బోధించారు. మానవీయకోణంలో పనిచేయాలని సూచించారు. శాంతిభద్రతల పోలీసులే కాకుండా.. బెటాలియన్లు, ఇతర యూనిట్లు, శిక్షణ కళాశాలలు.. ఇలా అన్ని విభాగాలకు చెంది న సిబ్బంది, అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పటాన్‌చెరులో చోటుచేసుకున్న ఘటన వల్ల మొత్తం పోలీసు శాఖ అప్రతిష్టపాలయ్యే ప్రమా దం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక విలువలు, మానవీయం తదితర అంశాలపై సిబ్బందికి నిరంతరం పునశ్చరణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పటాన్‌చెరు తరహా ఘటన పునరావృతమవ్వకుండా హోంగార్డు మొదలు, ఉన్నతాధికారి దాకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసింగ్‌పై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలన్నారు.  

Updated Date - 2020-02-28T09:11:18+05:30 IST