ఇది ఓ అంజి మామ కథ
ABN , First Publish Date - 2020-07-08T05:30:00+05:30 IST
అంజిమామ టెంపరరీ లైన్‌మన్. అతని కూతురు వెన్నీ టెన్త్ పరీక్షలు రాయడానికి బయలుదేరుతుంది. అంజి కూతుర్ని బైక్‌పై పరీక్ష హాలుకు తీసుకెళుతుంటాడు. పరీక్షకు కావాల్సిన ప్యాడ్స్...
అంజిమామ టెంపరరీ లైన్‌మన్. అతని కూతురు వెన్నీ టెన్త్ పరీక్షలు రాయడానికి బయలుదేరుతుంది. అంజి కూతుర్ని బైక్‌పై పరీక్ష హాలుకు తీసుకెళుతుంటాడు. పరీక్షకు కావాల్సిన ప్యాడ్స్, పెన్నులు గట్రా అన్నీ ఉన్నాయో లేదో ఒకటికి పదిసార్లు చూసుకోమంటాడు. అవన్నీ తన దగ్గర స్పేర్ కూడా పెట్టుకొంటాడు. ప్రతి చిన్న విషయంలోనూ వెన్నీకి జాగ్రత్తలు చెబుతుంటాడు. ‘పరీక్ష రాసేది నేనైతే నీకెందుకు డాడీ అంత టెన్షన్’ అని అడుగుతుంది వెన్నీ! సీన్ కట్ చేస్తే పరీక్ష హాలు... వెన్నీ వెనకాలే తన కజిన్. ఏమీ చదవడు. కాస్త చూపిస్తే కాపీ కొట్టుకుంటానని వెన్నీతో అంటాడు. ఆమె కుదరదంటుంది. పక్కనే ముఖానికి గుడ్డ కట్టుకున్న మరో విద్యార్థి కూడా చూపించమని నస పెడుతుంటాడు.
డిబార్ అవుతానన్న భయంతో ససేమిరా అంటుంది. చివరకు ఓ పరీక్షలో కాపీ స్లిప్‌లు ఇన్విజిలేటర్ కంట పడతాయి. వెన్నీ, ఆమె కజిన్, పక్కన విద్యార్థిపై ఇన్విజిలేటర్ అనుమానిస్తాడు. ఎవరో చెప్పకపోతే అందర్నీ డిబార్ చేస్తానంటాడు. తనకేం తెలిదని వెన్నీ వెక్కి వెక్కి ఏడుస్తూ... అంతా వాళ్లే చేశారంటుంది. పక్క విద్యార్థి ముఖంపైనున్న గుడ్డను లాగితే... అందరికీ పెద్ద షాక్! ఆ పక్కన పరీక్ష రాసేది ఎవరో కాదు... అంజి మామ. అదే వెంకీ వాళ్ల నాన్న. టెన్త్ పాసైతేనే అతని ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. దీంతో ఇరవై ఏళ్లుగా దండయాత్ర చేస్తూనే ఉంటాడు. అయితే ఇలా పట్టుపడటంతో బాధపడుతుంటాడు. ఇంతలో వెన్నీ కజిన్ వచ్చి ‘మనమంతా పాసయిపోయాం. కరోనా వల్ల సీఎం అందర్నీ పాస్ చేసేశాడు’ అంటూ చెబుతాడు. ఇది విని అంజిబాబు ఎగిరి గంతేస్తాడు. ‘నేను టెన్త్ పాస్’ షార్ట్ ఫిలిమ్ కథ ఇది.
‘మై విలేజ్ షో’ ఛానల్ అప్‌లోడ్ చేసిన ఈ షార్ట్ ఫిలిమ్‌కు రచన, దర్శకత్వం బుర్రా శివకృష్ణ. అంజిమామ, వెన్నెల అభినయం ప్రత్యేక ఆకర్షణ. అనిల్ గీలా, శ్రీకాంత్, మధుల సినిమాటోగ్రఫీ అద్భుతం. విడుదల చేసిన మూడు రోజులకే 6.5 లక్షల మంది దీన్ని వీక్షించారు. లక్షకు పైగా లైక్ చేశారు.
చిత్రం: నేను టెన్త్ పాస్
వ్యూస్: 6.5 లక్షలు
రచన, దర్శకత్వం: శివకృష్ణ బుర్రా
నటీనటులు: అంజి మామ, వెన్నెల, శివకృష్ణ, చంద్రమౌళి, అభి, ప్రశాంత్, స్వామి.