ఛిల్లింగ్‌ థ్రిల్‌

ABN , First Publish Date - 2020-09-15T05:30:00+05:30 IST

ఐస్‌ గడ్డను కాసేపు పట్టుకొంటేనే చేయి మొద్దుబారిపోతుంది. అన్నీ కప్పుకొని మంచు ప్రాంతాల్లో విహరించినా చలి చంపేస్తుంది. మరి ఇతడు..? మంచు గడ్డలున్న

ఛిల్లింగ్‌ థ్రిల్‌

ఐస్‌ గడ్డను కాసేపు పట్టుకొంటేనే చేయి మొద్దుబారిపోతుంది. అన్నీ కప్పుకొని మంచు ప్రాంతాల్లో విహరించినా చలి చంపేస్తుంది. మరి ఇతడు..? మంచు గడ్డలున్న బాక్స్‌లో రెండున్నర గంటలు హాయిగా గడిపేశాడు.  అదీ ఓ అండర్‌వేర్‌ తప్ప మరే ఆచ్ఛాదనం లేకుండా! 

రికార్డులు చాలానే వస్తుంటాయి. కానీ కొన్నింట్లోనే మజా ఉంటుంది. అలాంటిదే ఈ ఫీట్‌. ఆస్ర్టియాకు చెందిన జోసెఫ్‌ కోబెల్‌ ఈ సాహసానికి ఒడిగడ్డాడు. గతంలో ఉన్న 2:08:47 గంటల రికార్డును బద్దలు కొట్టి, సరికొత్త ప్రపంచ రికార్డు తన పేరున లిఖించుకున్నాడు. దాని కోసం అతడు తన జీవితాన్నే రిస్క్‌లో పెట్టుకున్నాడు. 

ఎలా సాధించాడీ ఘనత? ఒక అద్దాల పెట్టె... దాని నిండా ఐస్‌ క్యూబ్స్‌. స్విమ్మింగ్‌ డ్రాయర్‌ మినహా జోసెఫ్‌ ఒంటిపై మరేమీ లేవు. నిదానంగా ఐస్‌ బాక్స్‌లోకి వెళ్లాడు. చేతులు కట్టుకుని, తల భాగం వదిలేసి, భుజాల వరకు మంచు గడ్డలు కప్పుకున్నాడు. నిర్వాహకులు బాక్స్‌ మూసేశారు. అరగంట... గంట... రెండు గంటలు... గడియారంలో ముళ్లు తిరుగుతున్నాయి. అక్కడున్న వారందరిలో ఉత్కంఠ. లోపల అతడు ఎలా ఉన్నాడోనని! సరిగ్గా 2 గంటల 30 నిమిషాల 57 సెకన్లు గడిచాక మనోడు కూల్‌గా బయటకు వచ్చాడు. చూస్తున్నవారు వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు. అంతలోనే చప్పట్లు, ఈలలతో జోసెఫ్‌కు జేజేలు పలికారు. 

కొసమెరుపేమిటంటే... జోసెఫ్‌ బద్దలు కొట్టింది అతడి రికార్డునే! 

‘ఇదో అద్భుతమైన అనుభూతి. సూర్యుడిని జయించినట్టుంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు జోసెఫ్‌ కోబెల్‌. ఇంతకు మించిన ‘ఛిల్లింగ్‌’ థ్రిల్లింగ్‌ ఏముంటుంది! 


Updated Date - 2020-09-15T05:30:00+05:30 IST