ఆరోగ్యం... ఆ తర్వాతే ఫ్యాషన్...
ABN , First Publish Date - 2020-05-25T05:20:17+05:30 IST
కరోనా వైరస్‌తో మాస్కుల్లో రకరకాల ఫ్యాషన్ ట్రెండ్స్ ప్రవేశించాయి. అవి జనాలను ముఖ్యంగా యువతను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గీతికా కానుమిల్లి తన అంతరంగాన్ని పంచుకున్నారు.
కరోనా వైరస్‌తో మాస్కుల్లో రకరకాల ఫ్యాషన్ ట్రెండ్స్ ప్రవేశించాయి. అవి జనాలను ముఖ్యంగా యువతను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గీతికా కానుమిల్లి తన అంతరంగాన్ని పంచుకున్నారు.
‘‘కేంద్రం లాక్‌డౌన్ సడలింపులను అంచెలంచెలుగా చేపడుతోంది. అయితే, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. మాస్కులు ధరించకపోతే తెలంగాణలో వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలకు మాస్కులు దీర్ఘకాలిక అవసరంగా మారాయి. ఈ నేపథ్యంలో మాస్కుల తయారీ యూనిట్లకు రకరకాల ఫ్యాషన్ బ్రాండ్లు శ్రీకారం చుట్టాయి.
డిజైనర్స్ ఆసక్తి చూపుతున్నారు
ఆర్గానిక్, ఇక్కత్, కాటన్, జామ్‌దానీ, ఖాదీ, కలనేత, కలంకారీ, టై అండ్ డై, రీసైకిల్డ్ మెటీరియల్స్, పోచంపల్లి వంటి ఫ్యాబ్రిక్‌తో కళాత్మక మాస్కుల తయారీని పలు ఫ్యాషన్ బ్రాండ్లు చేపట్టాయి. వీటి తయారీకి డిజైనర్స్ ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అంతేకాదు గ్లోబల్ ఫ్యాషన్ల స్థాయిలో మాస్కుల తయారీ వేగం పుంజుకుంది. ఉదాహరణకు డిజైనర్ మసాబా గుప్తా తనదైన డిజైనింగ్ శైలిని ప్రతిఫలించే ‘మాస్కాబా’ పేరుతో మాస్కుల తయారీ చేపట్టారు. కొందరు డిజైనర్లు భారత్, పాశ్చాత్య శైలి కలబోతగా మాస్కులను డిజెన్ చేస్తున్నారు.
సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ మాస్కులకు ఆదరణ
ధారణ ప్రజలు శానిటైజ్ చేసిన ఫ్యాబ్రిక్ మాస్కులను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరు డిజైనర్లు తమ ఫ్యాషన్ మాస్కులను అధిక పొరలతో (లేయర్స్) రూపొందిస్తున్నారు. కొత్త మాస్కులను ఒకసారి ఉతికి వాడాలి. మాస్కులను ఐరన్ బాక్సులతో ఇస్త్రీ చేస్తే వాటిపై ఉన్న బ్యాక్టీరియా పోతుంది. కొందరు ఫ్యాషన్ డిజైనర్లు ‘నీమ్ మాస్కులను’ సిద్ధం చేస్తున్నారు. వేపను ఉపయోగించి చేసే ఈ మాస్కుల్లో యాంటీ ఎలర్జిక్, డీటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. కొన్ని ఫ్యాషన్ స్కూళ్లల్లో విద్యార్థులు కాటన్, ఖాదీ, ఇక్కత్, జామ్‌దానీ తరహా క్లాత్‌లతో మాస్కులు చేస్తున్నారు. ఆర్గానిక్ హ్యాండ్‌ఓవెన్ కాటన్ మాస్కులు వివిధ రంగుల్లో, డిజైన్లలో వస్తున్నాయి. ప్రింటెడ్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో, ఇంకా లినిన్, చైనా సిల్క్, కాటన్, పాప్‌లిన్ ఫ్యాబ్రిక్స్‌తో మాస్కులను రూపొందిస్తున్నారు. సింథటిక్ కాకుండా కాటన్ నిట్స్ స్ట్రింగ్స్ వచ్చేలా డిజైనర్ మాస్కులను చేస్తున్నారు. వీటి ట్రెండులో ‘సెల్ఫ్‌ఎక్స్‌ప్రెషన్’ ప్రతిఫలించే మాస్కులను వినియోగదారులు ఇష్టపడుతున్నారు. చెక్స్, జామెట్రికల్ డిజైన్స్, పశ్చిమదేశాల స్టయిల్ ఆఫ్ డిజైన్స్‌తో కూడిన డిజైన్ మాస్కులు, అరబిక్, జ్యూయిష్ మోటిఫ్స్ కలగలిసిన డిజైన్ ట్రెండ్స్ వస్తున్నాయి.
ఒక డిజైనర్‌గా నేను చెప్పేదేమిటంటే మాస్కులు ఆరోగ్యపరంగా మొదట ప్రజలకు ఉపయోగపడాలి. క్లాత్ సౌకర్యంగా ఉండాలి. లేత రంగులతో ఉన్న ఎథ్నిక్ డిజైన్ మాస్కులు వేసవిలో సుఖంగా ఉంటాయి.. ఇంకా కలంకారీ, పోచంపల్లి ఇక్కత్, కాటన్, ఆర్గానిక్, టై అండ్ డై మాస్కులు సౌకర్యంగా ఉండడంతో పాటు ఫ్యాషనబుల్‌గా ఉంటాయి. చేనేతల్లో పూల డిజైన్లు, బొమ్మలు, ప్రకృతి, జంతువులు, ఇంకా జామెట్రికల్, పూల తీగలు-ఇలా ఎన్నో డిజైన్లు ఉంటాయి. టై అండ్ డై మాస్కులు ఎథ్నిక్ డిజైన్లతో మోడరన్‌గా ఉంటాయి.
ఆఫ్రికన్ ప్రింట్స్‌లో ట్రైబల్, గాఢ రంగులతో ఉండే మాస్కులు ఆధునికంగా కనిపిస్తాయి. కరోనా ఇప్పుడప్పుడే ప్రజల్లోంచి పోయేలా కనిపించడం లేదు. అందుకే మాస్కుల అవసరాలు భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఇప్పటికే కొన్ని ఫ్యాషన్ షోలలో మాస్కుల ప్రదర్శన చేస్తున్నారు. ప్రతి ఫ్యాషన్ డిజైనర్ తనదైన ఐడెంటిటీని తమ వర్క్‌లో చూపుతారు. టీన్స్ ట్రెండీ ఫ్యాషన్లను ఇష్టపడ్డా ఖరీదునూ గమనిస్తారు. రీసైకిల్డ్ మెటీరియల్‌తో కూడా మాస్కులు చేస్తున్నారు. నేను చెప్పేదేమిటంటే మనం మాస్కులకు వాడే మెటీరియల్ పర్యావరణ అనుకూలంగా, ఆరోగ్యరక్షణకారిగా ఉండాలి... వాటిల్లో ఫ్యాషనూ మెరవాలి!’’
చిన్నప్పటి కోరిక!
‘‘నేను హైదరాబాదులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. డిజైనర్ అవాలన్నది నా చిన్నప్పటి కల. లెహంగా డిజైనింగ్‌లో ‘గీతిక కానుమిల్లి క్లోథింగ్’ ఫేమస్. నా పేరునే నా అవుట్‌లెట్‌కి పెట్టా. లావణ్యా త్రిపాఠీ, షాలినీ పాండే, రాశీఖన్నా, త్రిష, సమంత వంటి సినీ తారలకు వర్క్ చేశా. రంగుల మీద నాకు మంచి పట్టు ఉంది. మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకోవాలన్నది నా కోరిక..’’
నాగసుందరి