హార్ట్ బ్రేక్ అయిందా!
ABN , First Publish Date - 2020-10-28T06:03:34+05:30 IST
ప్రేమలో విఫలమైతే హృదయం ముక్కలైనట్లు అనిపిస్తుంది. ఆ బాధతో జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ప్రేమలో ఉన్న రోజులు గుర్తుకు వస్తుంటాయి...
ప్రేమలో విఫలమైతే హృదయం ముక్కలైనట్లు అనిపిస్తుంది. ఆ బాధతో జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ప్రేమలో ఉన్న రోజులు గుర్తుకు వస్తుంటాయి. ఏ పొరపాటు వల్ల మీ ప్రయాణం అలా ముగిసిపోయిందనే ప్రశ్నలు మెదడును తొలుస్తూనే ఉంటాయి. అయితే దాని నుంచి కొందరు తొందరగా బయటపడతారు. కొందరు ఎక్కువ సమయం తీసుకుంటారు. ఆ మనోవేదన నుంచి బయటపడేందుకు లవ్‌గురూలు ఏం చెబుతున్నారంటే...
పాజిటివ్ ఆలోచనలతో: జీవితం మనల్ని చాలా మార్పులకు గురి చేస్తుంది. ఆ విషయం మనకు తెలియకుండానే జరుగుతుంది. అలాంటి ప్రతి సంఘటనా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేమలో విఫలమవడం కూడా అలాంటిదే. అది ఎంత కష్టమైనప్పటికీ పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్లడం మంచిది. ఒకవ్యక్తి వల్ల బాధపడ్డారనీ, మొత్తం ప్రపంచం అలానే ఉంటుందని అనుకోవడం సరికాదు.
స్వీయ జాగ్రత్తలు: కొన్ని అనుబంఽధాలు జీవితంలో చాలా విషయాలు నేర్పిస్తాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గడం, తరచూ గొడవులు పడుతున్నప్పుడు విడిపోవడం సహజమే. ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటి కానప్పుడు వారితో బంధాన్ని ముగించడం తప్ప వేరే దారి ఉండదు. ఇలాంటి సమయంలోనే స్వీయ జాగ్రత్తలు అవసరం. బ్రేకప్స్ అనేది మనసును ఎంతో బాధిస్తాయి. అప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉందనేది చాలా ముఖ్యం. అద్దం ముందు నిల్చొని మీకు మీరు ధైర్యం చెప్పుకోండి.
మీపై మీకు నమ్మకం: ఎదుటివారికి మీపై నమ్మకం కుదరాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. మీకు నచ్చిన దుస్తులు ధరించడం, నచ్చిన పనులు చేయడం.. ఇలాంటి చిన్నచిన్న విషయాలను మీరు ఒకరితో బంధంలో ఉన్నప్పుడు మరచిపోయిఉంటారు. అలాంటి వాటిపై ఇప్పుడు దృష్టి సారిస్తే మనసు తేలికవుతుంది. నెమ్మదిగా మీ మనసు బ్రేకప్ గాయం నుంచి కోలుకుంటుంది.
స్నేహితులతో ట్రిప్: స్నేహితులతో కాసేపు గడపండి. వారితో కలిసి సరదాగా ఎక్కడికైనా ట్రిప్‌కు వెళ్లండి. దాంతో మీరు తొందరగా మానసికంగా దృఢంగా మారతారు. ఏది ఏమైనా సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి. హార్ట్‌బ్రేక్ వల్ల మీరు అలానే దిగాలుగా ఉన్నారనుకోండి అప్పుడు టేబుల్‌మీద లేదా ఫ్రిజ్ మీద ఒక పాజిటివ్ సందేశం రాసి పెట్టుకోండి. రోజుకు అయిదు పాజిటివ్ సందేశాలు చదవండి.