కరోనాకు టెక్‌ చెక్‌!

ABN , First Publish Date - 2020-03-07T07:39:59+05:30 IST

చైనాలో ఒక వ్యక్తి రక్తంలోని ఆక్సిజన్‌ శాతాన్ని తెలుసుకుని, అతడి ఊపిరితిత్తులు ఎంతమేర ప్రభావితమయ్యాయో గుర్తించడానికి ఒక అప్లికేషన్‌ రూపొందించారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌వాచ్‌లు, ఎస్‌ - హెల్త్‌ వంటి అప్లికేషన్లలో ఆక్సిజన్‌ శాతాన్ని ఫోన్‌లోని కెమెరా ద్వారా స్కాన్‌ చేసి తెలుసుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

కరోనాకు టెక్‌ చెక్‌!

చైనాలో ఒక వ్యక్తి రక్తంలోని ఆక్సిజన్‌ శాతాన్ని తెలుసుకుని, అతడి ఊపిరితిత్తులు ఎంతమేర ప్రభావితమయ్యాయో గుర్తించడానికి ఒక అప్లికేషన్‌ రూపొందించారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్‌వాచ్‌లు, ఎస్‌ - హెల్త్‌ వంటి అప్లికేషన్లలో ఆక్సిజన్‌ శాతాన్ని ఫోన్‌లోని కెమెరా ద్వారా స్కాన్‌ చేసి తెలుసుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఇదే రకమైన టెక్నాలజీ కరోనా వైరస్‌ విషయంలోనూ ఉపయోగపడింది.  


కరోనా వైరస్‌ లాంటివి వాతావరణ మార్పుల వల్ల కానీ, వివిధ దేశాల మధ్య బయో వార్‌ల వల్ల కానీ ఇకమీదట కూడా పుట్టుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఖచ్చితంగా ఇలాంటి సమస్యలకు టెక్నాలజీ సహాయంతో వీలైనంత త్వరగా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉంది. ఒక వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత రోగుల శరీరంలో జరిగే మార్పులను నిరంతరం పరిశీలించాలి. బీపీ, ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌, బ్లడ్‌ గ్లూకోజ్‌, మెటబాలిక్‌ రేట్‌ వంటి అన్ని అంశాలను పరిశీలిస్తూ, అవసరమైతే డిఎన్‌ఏ నమూనాల ద్వారా రోగిలో చోటుచేసుకునే మార్పులను కూడా నమోదుచేయాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల కారణంగా ఒక ప్రదేశంలో ఉన్న రోగిలో, మరో ప్రదేశంలో ఉన్న రోగిలో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా కూడా నమోదు చేసి పరిశోధించవలసిన అవసరం ఎంతో ఉంది.


ఇలా భారీ మొత్తంలో సేకరించిన సమాచారాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీల ఆధారంగా నిశితంగా విశ్లేషించి ఇన్ఫెక్షన్‌ ప్యాటర్న్‌, రికవరీ, పేషెంట్‌కి ఏ తరహా వైద్యం వల్ల ఊరట లభిస్తుందో పరిశీలించాలి. తద్వారా అవసరమైతే కొత్త మందులను వేగంగా కనిపెట్టాలి. ఇప్నటికే ఒక వ్యక్తికి కేన్సర్‌, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది  మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారంగా తెలుసుకునే విధానాలు ఉన్నాయి. ఇదే పని దీర్ఘకాల వ్యాధుల విషయంలోనే కాకుండా అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన జబ్బుల విషయంలో కూడా జరగాలి. అలాగే ఫార్మసీ రంగంలో కూడా కొత్త మందుల ఆవిష్కరణలో ఇప్పటికీ చాలాచోట్ల సంప్రదాయక విధానాలు అనుసరిస్తున్నారు. దీనివల్ల జనరిక్‌ మందులు తప్పించి కొత్తవి, సైడ్‌ ఎఫెక్ట్‌ పెద్దగా లేని మందులు తయారు చేయడానికి చాలా సమయం పడుతోంది. కొన్ని మందులు పేషెంట్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న పరిస్థితులు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో వివిధ ఫార్మాస్యూటికల్‌ ఫార్ములాలు, డ్రగ్‌ రియాక్షన్లని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారంగా సునిశితంగా అధ్యయనం చేసి, ప్రభావవంతమైన మందులను కనిపెట్టడానికి కచ్చితంగా టెక్నాలజీని వాడాలి. కరోనా వైరస్‌ లాంటివి వచ్చినప్పుడు టెక్నాలజీ వినియోగం సమాజాన్ని ఆందోళన కలిగంచడానికి కాకుండా సమర్థమైన పరిష్కారాలను కనుగొనే దిశగా సాగాలి. 

Updated Date - 2020-03-07T07:39:59+05:30 IST