ప్రియమైన నీకు..!

ABN , First Publish Date - 2020-07-01T05:58:10+05:30 IST

ప్రేమ పక్షుల మధ్య తీయని అనుబంధమే కాదు... ఒకరిపై ఒకరికి తగని ఆకర్షణా ఉంటుంది. మొదట్లో బంధం గొప్పగా, అనుభూతుల వరంగా అనిపించినా... కొన్నాళ్ల తరువాత అంతటి మాధుర్యం మిస్సవ్వచ్చు...

ప్రియమైన నీకు..!

ప్రేమ పక్షుల మధ్య తీయని అనుబంధమే కాదు... ఒకరిపై ఒకరికి తగని ఆకర్షణా ఉంటుంది. మొదట్లో బంధం గొప్పగా, అనుభూతుల వరంగా అనిపించినా... కొన్నాళ్ల తరువాత అంతటి మాధుర్యం మిస్సవ్వచ్చు. కాలంతో పాటు లక్ష్యాలు, జీవితం పట్ల ఆలోచనలు మారుతుంటాయి. ఈ సమయంలో మీ బంధం పట్ల ఒత్తిడి, అనాసక్తి ఏర్పడవచ్చు. అందుకే మీ మధ్య ఆకర్షణ ఇసుమంతైనా తగ్గకుండా... ప్రతి క్షణం కొత్తగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిదీ! దాని కోసం మీరేం చేయాలంటే... 


చిన్న చిన్న కానుకలు: ఏ బంధంలోనైనా భాగస్వామిని ఎప్పుడో ఒకసారి ఆశ్చర్యపరచడం ముఖ్యమైనది. అయితే అదేపనిగా అలా చేసినా ప్రమాదమే! వారికి బోర్‌ అనిపిస్తుంది. సమయం, సందర్భాన్ని బట్టి ఒకరికొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం బంధాన్ని దృఢంగా చేస్తుంది. అలానే  డేట్‌కి తీసుకెళ్లడం, మెచ్చే బహుమతి ఇవ్వడం వంటివి వారికి ఎంతో ఆనందాన్నిస్తాయి. మీరు ఎంతలా తనను ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. మీ పై ప్రేమ రెట్టింపవుతుంది. 


ఆకర్షణ తగ్గకుండా: రొమాంటిక్‌ రిలేషన్‌షి్‌పలో ప్రేమ, ఆకర్షణ... రెండూ అతి ముఖ్యమైనవి. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా మీ బంధం ఎంతోకాలం నిలబడదు. సో... మీ భాగస్వామి పట్ల ఎల్లప్పుడూ ప్రేమ, ఆకర్షణతో ఉంటూ వారు మీకెంత ప్రత్యేకమో తెలియజేస్తూ ఉండాలి. 

మధుర జ్ఞాపకాలు: ఇద్దరూ కలిసి ఫన్నీ యాక్టివిటీ్‌సతో ఎక్కువ సమయం గడపండి. ఉత్సాహాన్ని, థ్రిల్‌ను ఇచ్చే మధుర జ్ఞాపకాలను మూటగట్టుకోండి. దాంతో మీ అనుబంధంలో అపార్థాలకు దారితీసిన సంఘటనలు మరుగునపడిపోతాయి. 

ఒకరికి ఒకరు: మీ బంధం బలపడాలంటే ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి. మీరు వారి ధైర్యం కావాలి. మీ భాగస్వామి ఆనంద, విషాద క్షణాల్లో మీరు వారి వెంటే ఉండాలి. అవి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు... ఏవైనా కావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఎంత  బాధ్యత, విలువైన భాగస్వామో, వారిని ఎంత ప్రేమిస్తున్నారో ఎదుటివారికి అర్థమవుతుంది.

తొలి ప్రాధాన్యం: జీవితంలో అన్నింటికన్నా మీ భాగస్వామికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. మీ ప్రియతమను ప్రేమగా చూసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని నిర్లక్ష్యం చేయకూడదు. 

రచ్చ వద్దు: ఏ బంధమూ పరిపూర్ణంగా ఉండదు. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, ఏకాభిప్రాయం కుదరకపోవడం వంటివి సహజం. అయితే ఈ తగాదాలు, అలకలే మీ రొమాంటిక్‌ జర్నీని బ్రేక్‌ చేస్తాయి. బంధాన్ని బలహీన పరుస్తాయి. కనుక చిన్న చిన్న విషయాలను పెద్దవి చేయకండి. బదులుగా ఆ సమయాన్ని మీ అనుబంధాన్ని దృఢంగా చేసుకునేందుకు ఉపయోగించుకోండి. 

మాట్లాడుతూనే ఉండండి: మీ బంధం పదికాలాలు నిలవాలంటే వీలు దొరికినప్పుడల్లా భాగస్వామితో మాట్లాడుతూ ఉండండి. మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నా, మీ మధ్య ఏదో విషయంలో స్పష్టత లేకున్నా... వారితో చర్చించండి. దానివల్ల మీ మనసు తేలికవడమే కాదు... మిమ్మల్ని ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం వాళ్లకు దొరుకుతుంది.

Updated Date - 2020-07-01T05:58:10+05:30 IST