మనోళ్లు దుమ్ములేపుతున్నారు...

ABN , First Publish Date - 2020-02-08T06:29:03+05:30 IST

వినోదాల వీచిక... నైపుణ్యానికి వేదిక... యూట్యూబ్‌. భారత్‌లో 460 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులుంటే...

మనోళ్లు దుమ్ములేపుతున్నారు...

వినోదాల వీచిక... నైపుణ్యానికి వేదిక... యూట్యూబ్‌. భారత్‌లో 460 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులుంటే... అందులో 260 మిలియన్ల మందికి పైగా యూట్యూబ్‌ను వీక్షిస్తున్నారు. అన్నింటికీ మించి నాలుగేళ్లుగా యూట్యూబ్‌లో తెలుగు వారి హవా ఓ రేంజ్‌లో పెరిగిందట! తెలుగులో ఉన్నంత వైవిధ్యం, సమతూకం మరెందులో లేకపోవడమే దీనికి కారణమంటారు ‘యూట్యూబ్‌ ఇండియా’ కంటెంట్‌ పార్ట్‌నర్‌షిప్‌ డైరెక్టర్‌ సత్యరాఘవేంద్ర... 


ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్‌ ఉపయోగించే దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, తక్కువ మొత్తానికే మొబైల్‌ డేటా అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. యూట్యూబ్‌లో ఆన్‌లైన్‌ వీడియోలు చూసేవారిలో 75 శాతం మొబైల్‌ నుంచేనన్నది నమ్మలేని నిజం. గృహిణులకు వంటలు, కుర్రకారుకు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఎవరైనా మెచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌... అది ఇది అని తేడా లేకుండా ఏ వయసు వారికి ఏది కావాలంటే అది ఒక్క క్లిక్‌లో చూసే వెసులుబాటు యూట్యూబ్‌ కల్పించింది. సాధారణంగా ఆన్‌లైన్‌ అనగానే కంటెంట్‌ అధిక భాగం ఇంగ్లిష్‌లో ఉంటుందనుకుంటాం. కానీ మనవాళ్లు వీక్షించే ఆన్‌లైన్‌ వీడియోల్లో 95 శాతం భారతీయ భాషల్లోనివే!


గ్రామీణ భారతం... 

2014 ముందు వరకు సాంప్రదాయ ఛానల్స్‌ మాత్రమే ఉండేవి. అయితే ఆ తరువాత నుంచి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఎక్కువగా ముంబయ్‌, ఢిల్లీ వంటి మహానగరాల నుంచే కంటెంట్‌ ప్రొవైడర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది. అత్యధిక కంటెంట్‌ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తోంది. యూట్యూబ్‌ ‘వాచ్‌ టైమ్‌’లో 60 శాతం... ఆరు ప్రధాన మెట్రో నగరాల వెలుపలే! 2022 నాటికి భారతీయ భాషల కంటెంట్‌ను బ్రౌజ్‌ చేసే ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 536 మిలియన్లకు చేరుతుందని అంచనా. దేశ జనాభాలో ఇంగ్లిష్‌ భాషతో పరిచయం గలవారు 20 శాతం కన్నా తక్కువ. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఆన్‌లైన్‌లో ప్రాంతీయ భాషల హవానే కొనసాగుతుందనడంలో సందేహం లేదనేది సత్యరాఘవేంద్ర అంచనా. 


తెలుగు జిలుగు... 

ఇతర దేశాలతో పోలిస్తే యూట్యూబ్‌ చూసేవారి సంఖ్య భారత్‌లో అత్యంత వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం సగటున నెలకు 265 మిలియన్ల మంది వీడియోలు బ్రౌజ్‌ చేస్తున్నారు. ఐదేళ్ల కిందట పది లక్షలకు మించి సబ్‌స్ర్కైబర్స్‌ గల కంటెంట్‌ క్రియేటర్లు భారత్‌లో ఇద్దరే ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 1,200 మందికి చేరింది. హాస్యం, క్రీడలు, వార్తలు, విద్య, అందం, ఆరోగ్యం, వెబ్‌సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. రోజు రోజుకూ వీటి వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంతో పోలిస్తే దక్షిణ భారత్‌లో కంటెంట్‌ క్రియేటర్లు అధికమయ్యారు. నాలుగైదేళ్ల కిందటి పరిస్థితికి ఇప్పుడు పూర్తి భిన్నం. ఈ కాలంలో తెలుగు  భాషలో వీడియోలు 60 శాతం పెరిగాయంటే... వాటికి ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో అర్థమవుతుంది. ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో కంటెంట్‌ వైవిధ్యంగానూ, అదే సమయంలో సమతూకంగా కూడా ఉంటుంది. ఎలాగంటే ఒకవైపు టీవీ, సినిమా ఛానల్స్‌... మరోవైపు ‘మహాతల్లి’, ‘వైవా’, ‘మై విలేజ్‌ షో’ తదితర సాధారణ ప్రజలు నిర్వహిస్తున్న వీడియోలు కనిపిస్తాయి. 


ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే యూట్యూబ్‌లో మొదట వచ్చిన తెలుగు కంటెంట్‌ అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణాల్లోని గ్రామీణ ప్రాంతాలవారు అప్‌లోడ్‌ చేసింది. ఇందులో చిన్న... పెద్ద తేడా లేదు. అన్ని వయసులవారూ ఉన్నారు. మహిళా కంటెంట్‌ క్రియేటర్ల సంఖ్య కూడా అనూహ్యంగా పెరగడం మరో ఆసక్తికర పరిణామం. అదే సమయంలో చాలామంది యువకులు, గృహిణులు వీటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. కొందరైతే యూట్యూబ్‌ను ప్రధాన సంపాదన మార్గంగా మలుచుకున్నారు. 

- హనుమా 


తెలుగులో టాప్‌ 10 ఛానల్స్‌ 

(సబ్‌స్ర్కైబర్స్‌ మిలియన్లలో) 

ఛానల్‌                   అంశం  

గ్రాండ్‌పా కిచెన్‌          పల్లెటూరి రుచులు 

కంట్రీ ఫుడ్స్‌          పల్లెటూరి రుచులు

మహాతల్లి            వినోదం

వైవా                   వినోదం

ఈజీ రంగోలీ            అభిరుచులు

తెలుగు టెక్‌ట్యూట్స్‌    టెక్నాలజీ

మై విలేజ్‌ షో            గ్రామీణ జీవితం

మైనా స్ర్టీట్‌ ఫుడ్‌   పల్లెటూరి రుచులు

ప్రియా వంటలు   ఆహారం

క్రియేటివ్‌ థింక్స్‌   పల్లెటూరి జీవితం


ఐదు నుంచి పది లక్షలు... 

‘‘తెలుగులో ఇప్పుడు 80కి పైగా ఛానల్స్‌కు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నారు. 785కి పైగా ఛానల్స్‌కు లక్ష మంది, 80 ఛానల్స్‌కు పది లక్షల ప్లస్‌ ఖాతాదారులున్నారు. తెలుగులో కంటెంట్‌ క్రియేటర్లు ఎంత వేగంగా పెరుగుతున్నారో ఈ లెక్కలు చెబుతాయి. సమీప భవిష్యత్‌లో యూట్యూబ్‌ వీక్షకుల సంఖ్య దీనికి రెట్టింపయ్యే అవకాశం ఉంది’’       



- సత్యరాఘవేంద్ర

Updated Date - 2020-02-08T06:29:03+05:30 IST