బంధంలోదూరం పెరుగుతోందా!
ABN , First Publish Date - 2020-11-04T06:11:30+05:30 IST
రెండు మనసుల ప్రయాణం.. ఒక అనుబంధంగా చక్కగా సాగిపోతున్న వేళ... కొన్ని పరిస్థితులు ఆ
రెండు మనసుల ప్రయాణం.. ఒక అనుబంధంగా చక్కగా సాగిపోతున్న వేళ... కొన్ని పరిస్థితులు ఆ బంధాన్ని బలహీనం చేస్తుంటాయి. అప్పుడు మీ అనుబంధం అనుకున్న దిశలో వెళ్లడం లేదనిపిస్తుంది! అయితే ఏదో ఒకరోజు పరిస్థితులు చక్కబడతాయిని భావించి వాటిని పట్టించుకోవడం మానేస్తారు చాలామంది. అయితే ఆ ప్రయాణం మిమ్మల్ని మానసిక, శారీరక వేదనకు గురిచేస్తుందంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలి.
ఒంటరిగానే సంతోషంగా ఉన్నప్పుడు: భాగస్వామితో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించాలి. అలాకాకుండా బోర్‌గా, డల్‌గా ఫీలవడం, భాగస్వామి సమక్షంలో కన్నా వారు లేనప్పుడు స్వేచ్ఛగా ఉన్నానని మీకు అనిపిస్తుండడం మీ బంఽధం ఎంతోకాలం నిలవదు అనడానికి సంకేతం.
నమ్మకం లేకపోవడం: ఏ బంధంలోనైనా నమ్మకమే కీలకం. నమ్మకమనే పునాది ప్రేమను బలపరుస్తుంది. ఏదో ఒక విషయంలో తగవు పడినప్పటి నుంచి ఒకరిని ఒకరు నమ్మకపోవడం చాలా జంటలలో కనిపించేదే. మీ ప్రియతమ మిమ్మల్ని ఎవరైనా పొగిడినా అసూయపడడం, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేయడం వంటివి మీ బంధం బలహీనతను సూచించే సంకేతాలు. పరస్పరం నమ్మకం లేకపోతే మీరు బంధంలో ఎక్కువకాలం కొనసాగలేరు.
తరచూ క్షమాపణలు చెప్పడం: మీ భాగస్వామి మిమ్మల్ని భయపెడుతూ, మీపై ప్రతి విషయానికి నోరుపారేసుకొనే రకం అయితే, మీరు ప్రతి చిన్నదానికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. అలాంటి వ్యక్తిని భరించడం నిజంగా చాలా కష్టం. అంతేకాదు మీరు వారికి చులకనవుతారు. మీ అత్మగౌరవం దెబ్బతింటుంది. అలాంటి వారితో జీవితం పంచుకోడంలో ఎలాంటి అర్థం ఉండదు.
ప్రతిదీ ఆలోచిస్తున్నప్పుడు: మీరు తరచుగా ‘ఏం మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను’ అని ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే మీరు అవతలి వారిని సంతోషంగా ఉంచేందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. వారికి నచ్చినట్టు ఉండకపోతే ఎక్కడ మిమ్మల్ని విడిచిపెట్టి వెళతారనే భయం మీలో ఉందని అర్థం. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వారిని వెళ్లనివ్వండి. మీరు కొత్త జీవితం మొదలెట్టండి.
మిమ్మల్ని తక్కువగా చూడడం: తక్కువ ఆత్మగౌరవం ఉన్నవాళ్లు తరచుగా తమ భాగస్వామిని తక్కువగా చూస్తుంటారు. మీ పార్ట్‌నర్ పదేపదే ‘నేను నీకోసం ఏమేమి చేశానో తెలుసా! నేను తలచుకుంటే నీ కన్నా మంచి వ్యక్తిని భాగస్వామిగా పొందగలను’అని అంటున్నారనుకోండి. మీ మధ్య దూరం పెరుగుతోందని, వారికి మీమీద ప్రేమ లేదనే విషయాన్ని గ్రహించాలి.
ఒంటరిననే భావన: మీ ప్రియతమతో ఉన్నా కూడా మీరు ఒంటరి అనే భావనే కలుగుతుందంటే వారు మీరు సరైన వ్యక్తి కాదనే విషయం తెలుసుకోవాలి. మీతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండేవాళ్లు, మీ ఇష్టాలతో ఏకీభవించేవాళ్లను చూసుకోవాలి.