వాయిద్యం లేకుండావాయించేస్తాడు

ABN , First Publish Date - 2020-09-23T05:30:00+05:30 IST

ఇంట్లో అప్పుడప్పుడూ పాటలు హమ్‌ చేయడం అందరికీ అలవాటే. కొంతమందయితే నోటితోనే మ్యూజిక్‌ కూడా కొట్టేస్తుంటారు. అదే ‘

వాయిద్యం లేకుండావాయించేస్తాడు

రణవీర్‌ సింగ్‌, అలియా భట్‌ల ‘గల్లీ బాయ్‌’ గుర్తుందా?యువతలోని ర్యాపింగ్‌, బీట్‌బాక్సింగ్‌ ట్యాలెంట్‌ను వెతికి పట్టుకున్న చిత్రం అది. అలాంటి గల్లీ బాయ్‌ కథే 22 ఏళ్ల హ్యారీ డిక్రుజ్‌ది కూడా! వాయిద్యం లేకుండా గొంతుతోనే సాక్సోఫోన్‌ స్వరాలు పలికిస్తాడు. అదీ లయబద్దంగా... ఎవరికీ సందేహం రాకుండా! సరదాగా మొదలుపెట్టి... ప్రొఫెషనల్స్‌తో పోటీ పడే స్థాయికి ఎదిగిన ఈ బెంగళూరు ‘బీట్‌బాక్సర్‌’ జర్నీ అతడి మాటల్లోనే... 


ఇంట్లో అప్పుడప్పుడూ పాటలు హమ్‌ చేయడం అందరికీ అలవాటే. కొంతమందయితే నోటితోనే మ్యూజిక్‌ కూడా కొట్టేస్తుంటారు. అదే ‘బీట్‌బాక్సింగ్‌’! అయితే ఆడుతూ పాడుతూ కాకుండా వాయిద్యాన్ని అచ్చుగుద్దినట్టు స్వరపేటికతో పలికించగలగాలి. నా ప్రత్యేకత ఏమిటంటే... గొంతుతో సాక్సోఫోన్‌లా సౌండ్స్‌ తెప్పించడం. 


కాలేజీ ఫెస్ట్‌లో... 

నేను పీయూసీ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు మా కాలేజీలో ఓ ఉత్సవం జరిగింది. ఆ కార్యక్రమం నచ్చక బయట మా సీనియర్‌తో ముచ్చట్లు పెట్టాం. అప్పుడతడు నోటితో డ్రమ్స్‌ శబ్దాలు పలికించి ఆశ్చర్యపరిచాడు. బీట్‌బాక్సింగ్‌ అంటే ఏమిటో చెప్పాడు. ఇంటికెళ్లిన తరువాత నా స్నేహితుడితో కలిసి, దాని గురించి శోధించడం మొదలుపెట్టా. చివరకు ఓ అంతర్జాతీయ కళాకారుడి యూట్యూబ్‌ ఛానల్‌ కంట పడింది. దాని ద్వారా అతడు బీట్‌బాక్సింగ్‌ పాఠాలు చెబుతున్నాడు. అది చూసి నేను కూడా నేర్చుకున్నా. 


హగ్‌ ఇచ్చింది... 

అనుకోకుండా ఒక పార్టీలో తొలిసారి నా విద్య ప్రదర్శించే అవకాశం వచ్చింది. సాక్సోఫోన్‌ సౌండ్స్‌ గొంతుతో పలికించాను. అక్కడున్న ఓ అమ్మాయికి అది బాగా నచ్చేసింది. ఆనందంలో వచ్చి ఓ హగ్‌ ఇచ్చింది. నాకూ పట్టలేనంత సంతోషం కలిగింది. మరింత మక్కువ పెరిగింది. కొద్ది రోజుల్లోనే బీట్‌బాక్సింగ్‌ నా జీవితంలో భాగమైపోయింది. ఇక అప్పటి నుంచి కాలేజీలో ఏ ఫెస్టివల్‌ జరిగినా తప్పనిసరిగా నా ప్రదర్శన ఉండేది. వాటి నుంచే కొత్తవి నేర్చుకొంటూ, నాలోని కళను మెరుగుపరుచుకొంటూ వచ్చాను. 


ఔత్సాహికులకు కోచింగ్‌... 

ఒక రోజు బెంగళూరులోని ఓ హౌసింగ్‌ సొసైటీ వాళ్లు నన్ను ప్రదర్శనకు పిలిచారు. అక్కడి చిన్నారులకు బీట్‌బాక్సింగ్‌ బాగా నచ్చింది. దీంతో ‘శిక్షణ ఇస్తావా’ అని సొసైటీ పెద్దలు అడిగారు. ఈ ఆలోచనేదో బానే ఉందనిపించింది. మా స్నేహితుడి సహకారంతో వారం వారం అక్కడ ట్రైనింగ్‌ ఇస్తున్నాను. తిరుచిరాపల్లి ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (నిట్‌)లో వర్క్‌షా్‌పలు కూడా నిర్వహించాను. ఎవరు అడిగినా కాదనకుండా నేర్పిస్తున్నా.


ఔత్సాహికులకు చెప్పేదేమంటే... బీట్‌బాక్సింగ్‌ నేర్చుకొంటాననగానే అందరూ వెనక్కి లాగుతారు. కానీ అవేవీ పట్టించుకోకుండా ఇష్టంతో కష్టపడితే అద్భుతాలు చేయవచ్చు. మొదట్లో నన్నూ అడిగారు... ‘బీట్‌బాక్సింగ్‌ నేర్చుకొని ఏం చేద్దామని’ అని! ఆ మాటలేవీ చెవికి ఎక్కించుకోలేదు కనుకనే ఇప్పుడు అదే కెరీర్‌గా మార్చుకున్నా. దేనికీ లోటు లేకుండా సంపాదించగలుగుతున్నా. 


చూసేవారికి నచ్చుతోంది... 

నాలాగా చాలామంది యువకులు ఇప్పుడు బీట్‌బాక్సింగ్‌ ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి చాలా ఏకాగ్రత కావాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకొంటూ ఉండాలి. నేను నేర్చుకొనే రోజుల్లో మొట్టమొదటిసారి ఓ పోటీకి వెళ్లాను. నా సౌండ్స్‌ను అక్కడున్నవారందరూ ఆస్వాదించారు. నిజానికి సాక్సోఫోన్‌లా మిమిక్రీ చేయడం ఎప్పుడు మొదలుపెట్టానో తెలియదు.

కానీ అనుకోకుండా నా షో చూస్తున్నవారు ఆ సౌండ్స్‌ అద్భుతంగా పలికిస్తున్నావంటూ అభినందించారు. దీంతో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాను. బీట్‌బాక్సింగ్‌ అయితే నేర్పిస్తున్నాను కానీ, సాక్సోఫోన్‌ సౌండ్స్‌ ఎలా రాబట్టాలనేది మాత్రం ఎవరికీ చెప్పడంలేదు. ఆ విషయంలో నేను స్వార్థపరుడిని. ఎందుకంటే నన్ను అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది అదే కదా!  


సినిమా ప్రయత్నాలు... 

బీట్‌బాక్సింగ్‌ కళను సినిమాల్లో చూపించాలనుకొంటున్నాను. దాని కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇతర వాయిద్యాలతో కలిపి చేస్తే మరింత శ్రావ్యంగా ఉంటుంది. మ్యూజిక్‌లో నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే తపన. తొలుత రియాల్టీ షోస్‌, తరువాత చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాలని కోరుకొంటున్నా.

ఈ రంగంలో నాకు స్ఫూర్తి నాపోమ్‌ అకా నీల్‌ మెడోస్‌. అతడు ‘బీట్‌ బాక్స్‌ హౌస్‌’ సభ్యుడు. ఆరంభంలో అతడి శైలిని అనుకరించేవాడిని. అయితే అది నైపుణ్యం పెంచుకొనే క్రమంలోనే! నిదానంగా నా సొంత ట్యూన్స్‌ చేసుకొంటూ వస్తున్నా.     





వందకు పైగా ప్రదర్శనలు... 

అయితే గత ఏడాది టెడెక్స్‌ షో నా కెరీర్‌ను మలుపు తిప్పింది. నా పేరుతో బ్యానర్లు, పోస్టర్లు ఆ వేదిక అంతటా కనిపించే సరికి షాకయ్యాను. చప్పట్లు, ఈలలతో షో జరిగే ప్రాంగణమంతా మారుమోగింది. నన్ను నేను నమ్మలేని సందర్భం అది. ఎంతోమంది అభినందనలతో ముంచెత్తారు. అటు తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం రాలేదు. ఇప్పటి వరకు దక్షిణ భారత దేశంలో వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. 2017లో ‘కేరళ బీట్‌బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌’ గెలిచాను. ఇప్పుడు కాలేజీ విద్యార్థుల్లో నా పేరు బాగా పాపులర్‌!


Updated Date - 2020-09-23T05:30:00+05:30 IST