ప్రశ్నించే నైజం నాది

ABN , First Publish Date - 2020-10-14T05:12:15+05:30 IST

శివబాలాజీ... తెలుగింట పరిచయం అక్కర్లేని పేరు. సంపన్న కుటుంబంలో పుట్టి... సినిమాలపై ప్రేమతో వ్యాపార వారసత్వాన్ని వదులుకున్నాడు.

ప్రశ్నించే  నైజం నాది

శివబాలాజీ... తెలుగింట పరిచయం అక్కర్లేని పేరు. సంపన్న కుటుంబంలో పుట్టి... సినిమాలపై ప్రేమతో వ్యాపార వారసత్వాన్ని వదులుకున్నాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సొంతంగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ఇప్పుడు కార్పొరేట్‌ స్కూళ్ల ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ... తనలాంటి ఎందరో తల్లితండ్రుల తరుఫున ప్రశ్నించే గొంతుకయ్యాడు. సినిమా... ప్రేమ... పెళ్లి... పోరాటం... 




నిజ జీవితంలోనూ హీరోగా నిలిచిన శివబాలాజీ అంతరంగం ‘యంగ్‌’కు ప్రత్యేకం..

మేము తెలుగువారమే అయినా నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది చెన్నైలోనే. మా నాన్న పారిశ్రామికవేత్త. కొంతకాలం నేను కూడా ఆయనతో కలిసి వ్యాపారం చేశాను. అయితే నాకు సినిమాలంటే బాగా మోజు. నటించాలనే కోరిక బాగా ఉండేది. కానీ ఎలా వెళ్లాలి... ఎవరిని కలవాలి అనేవేవీ నాకు తెలియదు. ఇదిలావుంటే ఒకసారి రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి గారు నా ఫొటోలను దర్శకుడు సురేశ్‌ కృష్ణకు పంపారు. ఆయన తీయబోయే సినిమా కోసం కొత్తవారిని వెతుకుతున్నారు అప్పుడు. ఒకరోజు ఆడిషన్స్‌కు రమ్మని కబురు వచ్చింది. మొత్తం 150 మందిలో నేను ఎంపికయ్యాను. 


ఇంట్లో వద్దన్నారు... 

విషయం ఇంట్లో వాళ్లకి తెలిసింది. ఎవ్వరూ ఒప్పుకోలేదు. ముఖ్యంగా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. స్నేహితుడి పెళ్లని ఇంట్లో చెప్పి హైదరాబాద్‌ వచ్చాను. ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది... 2002 సెప్టెంబర్‌ 19న నా మొట్టమొదటి షాట్‌. ‘ఇది మా అశోగ్గాడి లవ్‌స్టోరీ’ సినిమా. వారం తరువాత నాన్నకు ఫోన్‌ చేశాను. ‘నువ్వు అక్కడే ఉండు’ అనేసి ఆయన ఫోన్‌ పెట్టేశారు. ఏడాది పాటు మా ఇద్దరి మధ్య మాటలు లేవు. చివరకు 2003లో నా తొలి సినిమా విడుదలైంది. అది పెద్దగా ఆడలేదు. దాంతో ఎలాగైనా సరే నేనేంటో నిరూపించుకోవాలన్న కసి పెరిగింది. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 23 చిత్రాలు చేశాను. మంచి నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకోగలిగాను. కొన్నాళ్లకు ఇంట్లోవాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. 


అలా కుదిరింది... 

‘ఆర్య’ సినిమాలో పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అది చూసి ‘ఇంగ్లి్‌షకారన్‌’ అనే తమిళ సినిమాలో అవకాశం దక్కింది. అందులో మధుమిత హీరోయిన్‌. అక్కడ ఆమెతో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఒకరంటే ఒకరం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. పెద్దవాళ్లకు చెప్పాం. మా ఇంట్లోవాళ్లు ఓకే అన్నారు. అయితే మధుమిత పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. ‘అబ్బాయికి కోపం ఎక్కువ’ అన్నారు. ఒకటిరెండుసార్లు వాళ్లు నన్ను షూటింగ్‌ సమయంలో చూసి ఆ మాట చెప్పారు. అన్నీ తెలుసుకుని తరువాత వాళ్లూ సరేనన్నారు.


నాలుగేళ్లు ఆగాం... 


అయితే ముందుగా కెరీర్‌పై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో కొంత కాలం ఆగి పెళ్లి చేసుకొందామని నేను, మధుమిత అనుకున్నాం. దాని ప్రకారమే నాలుగేళ్ల తరువాత 2008లో మా నిశ్చితార్థం జరిగింది. 2009లో పెళ్లయింది. అలా మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి. మాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ధన్విన్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. చిన్నవాడు గగన్‌ ఒకటో తరగతిలో ఉన్నాడు.


ఊహించని పరిణామం... 

మా పిల్లలిద్దరూ హైదరాబాద్‌ మణికొండలోని ‘మౌంట్‌ లిటెరా జీ స్కూల్‌’లో చదువుతున్నారు. ఆ పాఠశాలతో మాకు ఎనిమిదేళ్ల అనుబంధం. ఎప్పుడూ వారిని ఇబ్బంది పెట్టిందిలేదు. చిన్న చిన్న సమస్యలొచ్చినప్పుడు మేమే వెళ్లి పరిష్కరించుకుని వచ్చేవాళ్లం. అలాంటిది ఫీజులపై కొందరు తల్లితండ్రులు ప్రశ్నించినందుకు మమ్మల్ని టార్గెట్‌ చేశారు. 


అసలు జరిగిందేమంటే...

స్కూల్‌ పిల్లల పేరెంట్స్‌ అంతా కలిసి ఒక వాట్సప్‌ గ్రూప్‌ పెట్టుకున్నారు. అందులో మధుమితను కూడా యాడ్‌ చేశారు. ఆన్‌లైన్‌ క్లాస్‌లు జరుపుతూ బిల్డింగ్‌ ఫీజని, కల్చరల్‌ యాక్టివిటీస్‌ ఫీజని ఏవేవో పేర్లతో ఫీజులు కట్టమంటూ స్కూల్‌ యాజమాన్యం తల్లితండ్రులపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. ఎవరన్నా వెళ్లి ప్రశ్నిస్తే వాళ్లని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఒకరోజు ఆన్‌లైన్‌ తరగతుల నుంచి మా ఇద్దరు అబ్బాయిలనూ తొలగించారు. అప్పటివరకు అసలు ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. వెంటనే స్కూల్‌కు ఫోన్‌ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. తమ పిల్లల్నీ క్లాస్‌ల నుంచి తప్పించారంటూ కొందరు తల్లితండ్రులు మాకు చెప్పారు. 


ఎందుకనేది చెప్పలేదు... 

మేం ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు మొత్తం కట్టేశాం. అయినా మా పిల్లల్ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో తెలియదు. ఇంతలో పరీక్షలన్నారు. వాటికీ పిల్లల్ని అనుమతించలేదు. అంటే మమ్మల్ని భయపెడితే మిగిలినవారు మాట్లాడకుండా ఉంటారనే అభిప్రాయం కావచ్చు వారిది. మెయిల్‌ పెడితే యాజమాన్యం నుంచి బదులు రాలేదు. అప్పుడే అనుకున్నాం... ఈ విషయాన్ని ఇంతటితో వదలకూడదని! ఇది నా ఒక్కడి సమస్య కాదు... కార్పొరేట్‌ స్కూళ్లలో చదువుతున్న నాలాంటి ఎంతోమంది సమస్య. వాళ్ల కోసం కూడా నేను నిలబడాలనుకున్నా.


పిల్లల మనసు గాయపడుతుంది... 

ఏదైనా ఉంటే పెద్దవాళ్లను పిలిచి మాట్లాడాలి. అంతేకానీ పిల్లలను ఇబ్బంది పెడితే వాళ్ల మనసు ఎంతలా గాయపడుతుందో, తల్లితండ్రులుగా మేం ఎంత బాధపడతామో వాళ్లు ఆలోచించడంలేదు. పైగా కొద్దిమంది మినహా అంతా ఫీజులు కట్టేశారు. ఆ కొద్దిమంది కూడా కొంత సమయం ఇవ్వమని కోరుతున్నారే గానీ, కట్టమని చెప్పడంలేదు. ఈ విపత్కాలంలో దానికీ ఒప్పుకోకపోతే ఎలా? పిల్లలు వాళ్ల చేతుల్లో ఉంటారు కాబట్టి తల్లితండ్రులు కొందరు ప్రశ్నించడానికి భయపడుతున్నారు. మా దగ్గర ఫీజులు తీసుకొని కూడా టీచర్లకు సరిగా జీతాలు ఇవ్వడంలేదని తెలిసింది. ఇది దారుణం. ఇలాంటి కొన్ని కార్పొరేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు నీతి, నిజాయతీ, విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ప్రశ్నించినవారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. దాని కోసం ఎంతదాకానైనా వెళతాను.


ఫిర్యాదుతో కదిలింది

ఎంతకీ స్కూల్‌ యాజమాన్యం స్పందించకపోవడంతో మానవహక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదు చేశాం. హెచ్‌ఆర్సీ ఆదేశాల మేరకు విద్యాశాఖ కమిషనర్‌ ఎంక్వయిరీ కమిటీ వేశారు. ప్రస్తుతం ఆ కమిటీ రాష్ట్రంలోని కొన్ని స్కూల్స్‌పై విచారణ జరుపుతోంది. మేం హెచ్‌ఆర్సీకి వెళ్లగానే మా పెద్దబ్బాయిని తిరిగి తీసుకున్నారు. ఓ ఛానల్‌లో స్కూల్‌ గురించి మాట్లాడిన వెంటనే రెండో అబ్బాయికి కూడా క్లాస్‌లు మొదలయ్యాయి.


ఈ ఫిర్యాదుల నేపథ్యంలో స్కూల్‌ యాజమాన్యం మాకో మెయిల్‌ పంపించింది. అందులో స్కూల్‌ ఎంత మంచిదో చెబుతూ మూడు నాలుగు పేరాలున్నాయి. ఆపై మధుమితను అడ్రెస్‌ చేస్తూ... ‘మీ ఆలోచనా తీరు, నడవడిక మార్చుకోకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరిస్తూ సందేశం. ‘మా పిల్లల్ని ఆన్‌లైన్‌ క్లాస్‌ల నుంచి ఎందుకు తొలగించారు’ అని మేమడిగితే, అది కాకుండా వేరే ఏదో మెయిల్‌లో రాసుకొచ్చారు స్కూల్‌వారు.

Updated Date - 2020-10-14T05:12:15+05:30 IST