‘సాఫ్ట్’ ప్రేమాయణం
ABN , First Publish Date - 2020-08-26T05:30:00+05:30 IST
షాను... ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. సహోద్యోగి వైష్ణవిని అతడు ఇష్టపడతాడు. అయితే ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడేమోనన్న చిన్న అనుమానం. వాళ్లనీ వీళ్లనీ కాకుండా ఆ విషయాన్ని నేరుగా వైష్ణవినే అడగాలనుకుంటాడు...
షాను... ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. సహోద్యోగి వైష్ణవిని అతడు ఇష్టపడతాడు. అయితే ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడేమోనన్న చిన్న అనుమానం. వాళ్లనీ వీళ్లనీ కాకుండా ఆ విషయాన్ని నేరుగా వైష్ణవినే అడగాలనుకుంటాడు. అనుకోకుండా ఓ రోజు ఆమె లిఫ్ట్‌లో కనిపిస్తుంది. అడగాలా వద్దా అని సందేహిస్తూనే అడిగేస్తాడు. ‘ఇక్కడే కాదు... నాకు ఈ భూమ్మీదే బాయ్‌ఫ్రెండ్ లేడ’ని చెబుతుంది. దానికి మనోడు ఎగిరి గంతేస్తాడు. ఆ తరువాత తన స్నేహితులందరినీ ఇంటికి పిలిచి, ఆ ఆనందాన్ని పంచుకుంటాడు షాను. ‘వైష్ణవి నన్ను మిస్టర్ షాను అంటున్నప్పుడల్లా వంద ఫోన్లు ఒకేసారి వైబ్రేట్ అవుతున్నట్టుంటుంది... తెలుసా’ అంటూ తన ఫీలింగ్స్ చెబుతాడు. అయితే వైష్ణవి తనను ప్రేమిస్తుందో లేదోనన్న సందేహం అతడిలో. రాత్రి నిద్ర పట్టక ఆమెకు మెసేజ్ చేయాలనుకున్నా, తరువాత ఈ టైమ్‌లో వద్దని విరమించుకుంటాడు. ఇంతలో వైష్ణవే కాల్ చేస్తుంది. ‘రేపు వరలక్ష్మి వ్రతం కదా! ఆఫీసులో చీర కట్టుకురమ్మన్నారు. నాకు ఎలా కట్టుకోవాలో తెలియదు.
నార్మల్ డ్రెస్‌లోనే వస్తా. సుపీరియర్స్ను నువ్వే మేనేజ్ చెయ్యాలి’ అని చెప్పగానే కాల్ కట్ అవుతుంది. ఏదో ఊహించుకున్న షాను... ఆమెకు తన మీద ఏ ఫీలింగ్సూ లేవని అప్సెట్ అవుతాడు. తెల్లారి ఆఫీసుకు చీరలో ఎంట్రీ ఇస్తుంది వైష్ణవి. రాత్రి చార్జింగ్ అయిపోయి మొబైల్ స్విచ్చాఫ్ అయిపోయిందని చెప్పగానే షాను ముఖంలో నవ్వులు విరబూస్తాయి. ఆఫీసులో అంతా సరదాగా ఎంజాయ్ చేస్తారు. వైష్ణవిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి కారులో బయలుదేరుతాడు షాను. ఆమె దిగే ముందు ఏదో చెప్పాలనుకొంటాడు. ప్రపోజ్ చేస్తాడేమోననుకుంటుంది. అయితే షాను ‘నిన్ను ముద్దుపెట్టుకోవాలనుంది’ అంటాడు. ఈసారి వైష్ణవి షాక్ అవుతుంది. ఎండ్ కార్డ్ పడుతుంది. ఇదంతా ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ షార్ట్ ఫిలిమ్లోనిది. ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రతి ఫ్రేమూ కలర్ఫుల్గా తీశాడు దర్శకుడు సుబ్బు కె. కథ, మాటలు కూడా అతడే. వంశీ శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ అద్భుతమనే చెప్పాలి. ప్రధాన పాత్రల్లో షణ్ముక్ జస్వంత్, వైష్ణవీ చైతన్య పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. యూట్యూబ్‌లో విడుదలైన వారం లోపే పన్నెండు లక్షలమందికి పైగా వీక్షించారు.
ది సాఫ్ట్వేర్ డెవలపర్
కథ, దర్శకత్వం: సుబ్బు కె
విడుదల: ఆగస్టు 21, వ్యూస్: 12.11 లక్షలు