ఆందోళనలో యువతరం
ABN , First Publish Date - 2020-06-03T05:30:00+05:30 IST
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రపంచంలోని తమ వయసు వారితో పోలిస్తే భారతీయ యువత ఆరోగ్యం, ఆర్థికపరమైన లావాదేవీల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని చెబుతోంది తాజా అధ్యయనం...
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రపంచంలోని తమ వయసు వారితో పోలిస్తే భారతీయ యువత ఆరోగ్యం, ఆర్థికపరమైన లావాదేవీల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని చెబుతోంది తాజా అధ్యయనం.
కరోనా రేపిన కల్లోలం ప్రభావం యువతరం మీద ఎంతమేర ఉందో తెలుసుకునేందుకు భారతదేశంలో టీవీ చూసేవారి సంఖ్యను గణించే ‘బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్), అమెరికాలో వినియోగదారుల ప్రవర్తనను అంచనా వేసే నీల్సెన్ సంస్థ సంయుక్తంగా ఒక నివేదిక రూపొందించాయి. ఇందులో తేలిందేమంటే 15 దేశాల్లోని యువతరంతో పోల్చి చూస్తే మనదేశంలోని యువత తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని, ఆర్థికంగా అభద్రతకు గురవుతున్నారని నివేదిక చెబుతోంది. అంతేకాదు కుటుంబసభ్యుల ఆరోగ్యం, వాయిదా చెల్లింపుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఖరీదైన వస్తువులను కొనడం ఆలస్యం చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపు- అనంతర పరిణామాల మీద రూపొందించిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేమిటంటే అమెరికా యువతలో 70 శాతం మంది కొవిడ్-19 అనంతరం తమ జీవితం ఆశాజనకంగానే సాగుతుందని నమ్ముతున్నారు. 55ఏళ్లు దాటిన వాళ్లలో 56శాతం మంది ఆరునెలల్లో తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడతాయని విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం.