టెక్‌రంగంలో ఏదీ ఆమె ముద్ర?
ABN , First Publish Date - 2020-03-07T07:43:24+05:30 IST
మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు. తమను తాము నిరూపించుకుంటున్నారు. అదే సమయంలో చాలామంది మహిళలు పని ప్రదేశాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీ రంగంలోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది.
మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు. తమను తాము నిరూపించుకుంటున్నారు. అదే సమయంలో చాలామంది మహిళలు పని ప్రదేశాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీ రంగంలోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది.
టెక్ గురు
టెక్నాలజీ ఉద్యోగాల్లో ఉద్యోగం స్థాయిని బట్టి అందరికీ వేధింపులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మహిళా ఉద్యోగినుల పట్ల ఆ వేఽధింపులు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. చాలాచోట్ల ఒకే మూస పనులను చేయాల్సిన సందర్భాల్లో మాత్రమే మహిళలను నియమిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక కారణాలు, తల్లిదండ్రుల ఆలోచనా విధానం వంటి అనేక అంశాల కారణంగా ఐఐటీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థినులు చదవలేకపోతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో పరిస్థితులు కొద్దిగా ఆశాజనకంగా ఉన్నప్పటికీ గ్రామీణ భారతంలో మాత్రం ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. వీటన్నిటినీ దాటుకుని విద్యాసంస్థల్లో ప్రవేశం పొందినప్పటికీ, కోర్సు పూర్తయ్యేనాటికి పై చదువులకు వెళ్లగలుగుతామో లేదో తెలియని అనిశ్చితి చాలామంది విద్యార్థినుల్లో ఉంది.
అందుబాటు అంతంత మాత్రం...
చదువుకోడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి కావలసిన మౌలిక సదుపాయాల విషయంలో కూడా విద్యార్థినులు వివక్షకు గురవుతున్నట్లు తాజాగా ఒక అధ్యయనంలో బయటపడింది. సరైన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, ప్రతీ అంశంలో తల్లితండ్రుల సహకారం లేకపోవడం చాలా చోట్ల జరుగుతోంది. ఆర్థిక స్థోమత లేని కుటుంబాల్లో ఇది మరీ ఎక్కువ. మగపిల్లాడి విషయంలో ఎలాగోలా సర్దుబాటు చేసుకుని అన్ని సదుపాయాలు సమకూర్చే తల్లితండ్రులు ఆడపిల్లల విషయంలో సర్దుకుపోమని చెబుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరైన మౌలిక సదుపాయాలు లేనప్పుడు, విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య లభించనప్పుడు ఆ ప్రభావం విద్యార్థినుల మీద పడుతోంది.
నిర్ణయాత్మక ఉద్యోగాలకి దూరంగా..
చాలా కొద్ది శాతం సంస్థల్లో మాత్రమే నిర్ణయాత్మక పదవుల్లో, కీలక స్థానాల్లో మహిళలను నియమించడం జరుగుతోంది. పైకి అంతా బాగానే ఉన్నప్పటికీ తమ ఎదుగుదలకు అనేక శక్తులు అడ్డు పడుతున్నట్లు అనేక సంస్థల్లోని మహిళలు భావిస్తున్నారు. వాస్తవానికి టెక్నాలజీ ఉద్యోగాల్లో ఉద్యోగం స్థాయిని బట్టి అందరికీ వేధింపులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, మహిళా ఉద్యోగినుల పట్ల ఆ వేఽధింపులు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. చాలాచోట్ల ఒకే మూస పనులను చేయాల్సిన సందర్భాల్లో మాత్రమే మహిళలను నియమిస్తున్నారు. అలాగే బిపిఓ, సపోర్ట్ ఉద్యోగాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి సరికొత్త టెక్నాలజీల కారణంగా ఈ తరహా ఉద్యోగాలు పోయే ప్రమాదాలు లేకపోలేదు. దాంతో సంబంధిత ఉద్యోగినులు తమ భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతున్నారు.
పరిస్థితులు మారాలి!
గత కొన్నేళ్లుగా భారతదేశంలో స్టార్టప్‌లకి చాలా ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి నిధులు కూడా సమకూరుతున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కొన్ని స్టార్టప్‌లు ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోయినప్పటికీ, అనేక అద్భుత ఐడియాలు మాత్రం ఇప్పుడు వందల కోట్ల టర్నోవర్ సాధించిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు కూడా పలు స్టార్టప్‌లు నిర్వహించడంతో పాటు అనేకమంది మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా వివిధ రకాల అనుమతులు, ఇతర కీలకమైన అంశాలలో మహిళలు చాలా శ్రమించాల్సి వస్తోంది. ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది.
ఇవీ బలాబలాలు!
ఒక పని పూర్తయ్యే వరకు పట్టుదలగా పనిచెయ్యడం మహిళలకు ఉన్న ప్రత్యేక లక్షణం. చేసే పని పట్ల చాలా శ్రద్ధ చూపిస్తుంటారు. టెక్నాలజీ రంగం చాలా ఉత్పాదకత దృష్టితో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మహిళలకు ప్రోత్సాహకాలు ఇస్తూ, వారి పనితీరును నిరంతరం సమీక్షిస్తూ, వారి విజయాలను గుర్తించే సమాజం గనుక ఉంటే కచ్చితంగా వారు ఉన్నత స్థానాలకు చేరడానికి ఆస్కారం ఉంటుంది. అనేక సందర్భాలలో ఎక్కువ సృజనాత్మకత ఉండి, భిన్నమైన ఆలోచనలు చేయగలిగే సమర్ధత మహిళలకు ఉంటుంది. టెక్నాలజీ రంగంలో కార్య నిర్వహణా బాధ్యతల్ని వారు సమర్థంగా చేపట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. క్లయింట్లతో వ్యవహరించేటప్పుడు కూడా మహిళా ఉద్యోగులు తమ ప్రత్యేకత కనబరుస్తారు. సమర్థులైన మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తే రాణిస్తారనడంలో సందేహం లేదు.
టెక్నాలజీ రోల్స్
ఇటీవల ‘ఇంటెల్’ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో 26 శాతం మంది మహిళలు మాత్రమే టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే దీనికి సమర్ధత లేకపోవడం కారణం కాదు. నియామక దశ మొదలుకుని టెక్నాలజీ సంస్థల్లో వివిధ దశల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఒక సంస్థలో అతి ముఖ్యమైన కార్యనిర్వాహక స్థాయికి ఎదుగుతున్న మహిళలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వివిధ టెక్నాలజీ సంస్థలు మహిళల విధుల విషయంలో అంతర్గతంగా అనధికార విధానాలను అనుసరిస్తున్నట్లుగా గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చాయి.
- నల్లమోతు శ్రీధర్
- fb.com/nallamothusridhar